70 ఏళ్ల వయసు.. సైకిల్ పై భార్య శవం.. కిందపడిపోయిన దృశ్యాలు వైరల్.. చివరకు..

ABN , First Publish Date - 2021-04-30T17:46:46+05:30 IST

రోడ్డుపై ఓ గుంత ఉండటంతో సైకిల్ అదుపు తప్పింది. దీంతో సైకిల్ పై ఉన్న అతడి భార్య మృతదేహం కిందపడిపోయింది. అతడు కూడా కింద పడిపోయాడు. ఇప్పుడు అవే దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

70 ఏళ్ల వయసు.. సైకిల్ పై భార్య శవం.. కిందపడిపోయిన దృశ్యాలు వైరల్.. చివరకు..

ఉత్తరప్రదేశ్: అతడికి 70 ఏళ్ల వయసు. సైకిల్ పై భార్య మృతదేహాన్ని తీసుకెళ్తున్నాడు. అంత వయసులోనూ నెమ్మదిగా సైకిల్ ను నడుపుతూ వెళ్తున్నాడు. ఇంతలో రోడ్డుపై ఓ గుంత ఉండటంతో సైకిల్ అదుపు తప్పింది. దీంతో సైకిల్ పై ఉన్న అతడి భార్య మృతదేహం కిందపడిపోయింది. అతడు కూడా కింద పడిపోయాడు. ఇప్పుడు అవే దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కరోనా వల్ల ఎంత మంది ఇలా అష్టకష్టాలు పడుతున్నారో తెలియజేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పూర్ పరిధిలోని అంబెర్పూర్ గ్రామంలో తిలక్ ధారీ అనే 70 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడు. అతడి భార్య బుధవారం కరోనా కారణంగా మరణించింది. 


దీంతో అంత్యక్రియల నిమిత్తం అతడి భార్య మృతదేహాన్ని అంబులెన్స్ లో సొంతూరికి తరలించారు. ఆ మృతదేహాన్ని ఊళ్లో వదిలేసి వేరే అత్యవసర నిమిత్తం అంబులెన్స్ వెళ్లిపోయింది. అయితే ఆ ఊళ్లో కరోనాతో మరణించిన ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి వీల్లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇక్కడ అంత్యక్రియలు చేస్తే వైరస్ గ్రామంలో వ్యాపిస్తుందంటూ భయాందోళనలు వ్యక్తం చేశారు. అలా ఏమీ జరగదని స్థానికంగా ఉన్న ఆశా కార్యకర్తలు చెబుతున్నా గ్రామస్తులు వినిపించుకోలేదు. దీంతో  తిలక్ ధారి పదిహేను కిలోమీటర్ల దగ్గరలో ఉన్న సాయి నదీ ప్రాంతంలో తన భార్యకు అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నాడు. ఆటోలు కానీ, ట్రాక్టర్ డ్రైవర్లు కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో తన ఇంట్లో ఉన్న సైకిల్ పై భార్య మృతదేహాన్ని పెట్టుకుని బయలు దేరాడు. 


రోడ్డుపై వెళ్తుండగా మార్గమధ్యంలో గుంతలు వచ్చి కింద పడిపోయాడు. భార్య మృతదేహం కూడా కింద పడిపోయింది. అతడు అలా సైకిల్ పై పడుతున్న కష్టాన్ని చూసిన ఓ పోలీస్  కానిస్టేబుల్ గుండె కరిగిపోయింది. వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. స్థానిక పోలీసులు అతడికి అండగా ఉండి ఓ అంబులెన్స్ ను ఏర్పాటు చేయించారు. ఆ పోలీసులే అతడి బంధువులై అతడి భార్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన పోలీసులు అతడు ధన్యవాదాలు చెప్పాడు. కాగా, భార్య శవంతో సైకిల్ పై వెళ్తున్న అతడి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2021-04-30T17:46:46+05:30 IST