Russian Oil : అధిక ధరలను ప్రజలు తట్టుకోలేరు... అందుకే అది నా నైతిక బాధ్యత : ఎస్ జైశంకర్

ABN , First Publish Date - 2022-08-17T16:52:08+05:30 IST

ప్రజలు కొనగలిగే ధరలకు చమురును అందించడం భారత దేశ నైతిక

Russian Oil : అధిక ధరలను ప్రజలు తట్టుకోలేరు... అందుకే అది నా నైతిక బాధ్యత : ఎస్ జైశంకర్

బ్యాంకాక్ : ప్రజలు కొనగలిగే ధరలకు చమురును అందించడం భారత దేశ నైతిక కర్తవ్యమని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subhrahmanyam Jaishankar) చెప్పారు. ఆత్మరక్షణ ధోరణిలో పడిపోకుండా, రష్యా నుంచి చమురును కొంటున్నామన్నారు. మన దేశ విధానాన్ని ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఆమోదిస్తున్నాయని చెప్పారు. బ్యాంకాక్‌లో భారత సంతతి (Indian community) ప్రజలను ఉద్దేశించి ఆయన మంగళవారం మాట్లాడారు. 


ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా (Russia) నుంచి చమురును కొనడానికి భారత దేశం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆమోదిస్తున్నాయని చెప్పారు. దీనికి కారణం భారత దేశం (India) తన నిర్ణయం పట్ల ఆత్మరక్షణ ధోరణిలో లేకపోవడమేనని తెలిపారు. తన ప్రజల పట్ల తనకుగల బాధ్యతను ఇతర దేశాలు తెలుసుకునేలా భారత దేశం చేసిందని వివరించారు. నిజాయితీగా, అరమరికలు లేకుండా వ్యవహరిస్తే, అందరూ ఆమోదిస్తారని చెప్పారు. మన నిర్ణయాలకు ఎల్లప్పుడూ ఆమోదం లభించకపోయినప్పటికీ, నిర్ణయం తీసుకుని, అమలు చేస్తే, మితిమీరిన తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేయకపోతే, మీ ప్రయోజనాలను సూటిగా వ్యక్తీకరిస్తే, ఆ నిర్ణయం వాస్తవికతతో కూడినదని ప్రపంచం అంగీకరిస్తుందనేది తన అభిప్రాయమని తెలిపారు. 


మన వైఖరి అమెరికా (America)తో సహా అందరికీ తెలుసునని, దానిని వారు అంగీకరిస్తున్నారని అన్నారు. యూరోపు దేశాలు రష్యా చమురును తక్కువగా కొంటున్నాయని, భారత దేశానికి చమురును సరఫరా చేసేవారు తమ సరఫరాలను యూరోపు దేశాలకు మళ్ళించారని చెప్పారు. చమురు ధరలు నిష్కారణంగా ఎక్కువగా ఉన్నాయన్నారు. అదేవిధంగా గ్యాస్ ధరలు కూడా అధికంగా ఉన్నాయని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి దేశం తన ప్రజలకు సాధ్యమైనంత ఉత్తమమైన డీల్‌ను సాధించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. అత్యధిక ధరలను తట్టుకునేవిధంగా, ఆ ప్రభావాన్ని తప్పించుకునే విధంగా చేయవలసిన బాధ్యత ఆయా దేశాలకు ఉంటుందని చెప్పారు. తాము చేస్తున్నది కచ్చితంగా అదేనని వివరించారు. 


తాము ఈ పనిని ఆత్మరక్షణ ధోరణితో చేయడం లేదన్నారు. మన ప్రయోజనాలు నెరవేరడం కోసం చాలా నిజాయితీగా, అరమరికలు లేకుండా వ్యవహరిస్తున్నామని తెలిపారు. తలసరి ఆదాయం 2,000 డాలర్లుగల దేశం భారత దేశమని చెప్పారు. అధిక ధరలను తట్టుకోగలిగే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు. వారికి ఉత్తమమైన డీల్ లభించే విధంగా చేయడం తన బాధ్యత, నైతిక కర్తవ్యం అని స్పష్టం చేశారు. 


భారత్-థాయ్‌లాండ్ జాయింట్ కమిషన్ సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ మంగళవారం థాయ్‌లాండ్ చేరుకున్నారు. 


Updated Date - 2022-08-17T16:52:08+05:30 IST