ఖరీదైనా.. కొందాం.. కొంతైనా.. పసిడి ధరలు భగ్గుమంటున్నా ఆగని విక్రయాలు..

ABN , First Publish Date - 2020-08-08T21:59:26+05:30 IST

పసిడి ఆల్‌టైం రికార్డు ధరలు పలుకుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తుకు చేరింది. అయినా పసిడిపై మోజు తగ్గట్లేదు. ఎంత ఖరీదైనా కొంతైనా కొందామని జనం భావిస్తున్నారు. ఇటీవల హిందూపురంలోని ఏ నగల దుకాణం వద్ద చూసినా జనం

ఖరీదైనా.. కొందాం.. కొంతైనా.. పసిడి ధరలు భగ్గుమంటున్నా ఆగని విక్రయాలు..

హిందూపురం(ఆంధ్రప్రదేశ్): పసిడి ఆల్‌టైం రికార్డు ధరలు పలుకుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తుకు చేరింది. అయినా పసిడిపై మోజు తగ్గట్లేదు. ఎంత ఖరీదైనా కొంతైనా కొందామని జనం భావిస్తున్నారు. ఇటీవల హిందూపురంలోని ఏ నగల దుకాణం వద్ద చూసినా జనం కనిపించటమే ఇందుకు నిదర్శనం. లాక్‌డౌన్‌తో పట్టణంలో వంద రోజులకుపైగా బంగారు ఆభరణాల దుకాణాలు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తేయటంతో బంగారు దుకాణాలు తెరుచుకుని, వ్యాపారాలు ప్రారంభమయ్యేలోపే అనూహ్యంగా బంగారు, వెండి ధరలు పెరుగుతూ ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరాయి. శ్రావణ మాసం, శుభకార్యాలు ఉండటంతోపాటు పసిడి ధరలు మరింత పెరగవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రజలు ఎంతో కొంత కొనుగోలు చేద్దామని నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల దుకాణాల వద్ద జనం కన్పిస్తున్నారు. హిందూపురం పట్టణంలో పేరుమోసిన నగల దుకాణాల్లో రోజుకు రూ.50 లక్షల నుంచి రూ.కోటికిపైగా వ్యాపారాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌తో పసిడి విక్రయాలు మందంగించాయనీ, కొనేవారే లేరని పైకి చెబుతున్నా.. లావాదేవీలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.


రోజురోజుకీ..

బంగారు, వెండి ధరలు రోజుకో సరికొత్త రికార్డు నమోదు చేస్తున్నాయి. గురువారం హిందూపురంలో 24 క్యారెట్ల పది గ్రాముల మేలి బంగారు ధర రూ.58 వేలు, 22 క్యారెట్ల బంగారం రూ.54 వేలు పలికాయి. వెండి కిలో రూ.77 వేలకు చేరింది. రోజురోజుకీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్య తరగతి ప్రజలు కొంతైనా కొందామని వస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు బంగారు, వెండి కొనుగోళ్లకు అడ్వాన్సులు చెల్లించిన వారు, ధరలు మరింత పెరుగుతాయనీ, శుభకార్యాల కోసం కొనేవారే అధికంగా ఉన్నట్లు నగల దుకాణాల నిర్వాహకులు అంటున్నారు. పట్టణంలో సడలింపు సమయం కుదింపుతో దుకాణాల్లోకి ఒకేసారి అందరినీ అనుమతి వ్వకపోవటంతో జనం కన్పిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల బంగారు దుకాణాల వద్ద ఈ జనాన్ని చూసి, కరోనా కాలంలో పసిడి భగ్గుమంటున్నా కొనుగోళ్లకు పడిగాపులా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.


శుభకార్యాలున్నాయి:మల్లికాభాను, హిందూపురం

మా ఇంట్లో శుభకార్యాలున్నాయి. మార్చిలో గ్రాము రూ.4 వేలు ఉన్నపుడే కొందామని భావించాం. కరోనాతో పట్టణంలో వంద రోజులకుపైగా ఆభరణాల దుకాణాలు బంద్‌ అయ్యాయి. ధరలు ఇంతలా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదు. బంగారు ధర పెరిగినా కొనక తప్పదు.


భారమైనా కొనాల్సిందే:నాగరాజు, హిందూపురం

గత నెలలో 100 గ్రాముల బంగారుకు కొంత అడ్వాన్స్‌ ఇచ్చా. అప్పట్లో పది గ్రాములు రూ.48వేలు ఉండేది. బంగారు తీసుకుందామని వస్తే రూ.57 వేలు అనీ, ప్రస్తుత ధర చెల్లించాలనీ, లేందంటే కొన్నాళ్లు ఆగాలని నగల వ్యాపారి చెప్పారు. ఇంట్లో శుభకార్యాలున్నాయి. ధర పెరిగిందని శుభకార్యాలు వాయిదా వేయలేం కదా.


ఎంత పెరిగినా తప్పదు:చంద్రశేఖర్‌రెడ్డి, మోతుకుపల్లి

రోజూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఎంత పెరిగినా కొనుగోలు చేయాల్సిందే. మరింత పెరుగుతుందని నగల వ్యాపారులు చెబుతున్నారు. కొంతైనా కొందామని వచ్చాం. కరోనా కాలంలో బంగారం ధర ఇలా పెరుగటం పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది.


అత్యవసరమైన వారే కొంటున్నారు:నంబూరి శంకర్‌, నగల వ్యాపారి

పసిడి ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరింది. శుభకార్యాలున్న వారు, తప్పనిసరి అయిన వారు మాత్రం బంగారు కొనుగోలు చేస్తున్నారు. గత శ్రావణంతో పోల్చితే చాలా వరకు కొనుగోళ్లు మందంగించాయి. హిందూపురంలో వంద రోజులకుపైగా బంగారు దుకాణాలు తెరుచుకోలేదు. లాక్‌డౌన్‌కు ముందు ఆర్డర్లు తీసుకున్న వారికి చెల్లిస్తున్నాం. దుకాణాలు తెరిచినా రోజు మార్చి రోజు 12 గంటలకే బంద్‌ చేయాలి. అందరినీ ఒకేసారి అనుమతించలేం. అందుకే దుకాణాల వద్ద జనం కనిపిస్తున్నారు. సడలింపు సమయం పెంచితే రద్దీ తగ్గుతుంది.

Updated Date - 2020-08-08T21:59:26+05:30 IST