కాంగ్రెస్ అధిష్ఠానంపై సిద్ధూ పరోక్ష వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-02-04T20:12:25+05:30 IST

పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం

కాంగ్రెస్ అధిష్ఠానంపై సిద్ధూ పరోక్ష వ్యాఖ్యలు

చండీగఢ్ : పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నవజోత్ సింగ్ సిద్ధూ ఆ పార్టీ అధిష్ఠానంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గురువారం తన మద్దతుదారులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బలహీన ముఖ్యమంత్రి ఉండాలని పార్టీలోని అగ్ర నేతలు కోరుకుంటున్నారన్నారు. తమ బాణీలకు అనుగుణంగా  నాట్యం చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని భావిస్తున్నారని ఆరోపించారు. 


‘‘నవ పంజాబ్‌ను తీర్చిదిద్దాలంటే, అది ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. మీరు ఈసారి ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలి. అగ్ర స్థానంలో ఉన్నవారు బలహీన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. తమ బాణీలకు నాట్యం చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అవాలనుకుంటున్నారు. మీకు అలాంటి ముఖ్యమంత్రి కావాలా?’’ అని సిద్ధూ తన మద్దతుదారులను అడిగారు. ఆయన వ్యాఖ్యలను విన్న ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 


కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం తప్పించినప్పటి నుంచి ఆ పదవి కోసం సిద్ధూ పోటీపడుతున్నారు. అయితే దళిత నేత అయిన చరణ్ జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రి పదవి వరించింది. ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో చన్నీని రెండు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పోటీ చేయిస్తోంది. దీనినిబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయననే ప్రకటించే అవకాశం ఉందనే సంకేతాలను పంపించిందని సిద్ధూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధూ గురువారం తన ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకున్నారు. వైష్ణోదేవి దేవాలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. 


ఇదిలావుండగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం సిద్ధూ, చన్నీ పోటీ పడుతున్నారు. అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ టెలిఫోన్ సర్వేలు నిర్వహిస్తోంది. ఆ పార్టీ నుంచి ప్రజలకు వెళ్ళే ఫోన్ కాల్స్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్ళాలా? అని అడుగుతోంది. చన్నీ కావాలనుకుంటే 1 నొక్కాలని, సిద్ధూ కావాలనుకుంటే 2 నొక్కాలని, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించవలసిన అవసరం లేదనుకుంటే 3 నొక్కాలని కోరుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే విధంగా భగవంత్ మాన్‌ను ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 


పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 


Updated Date - 2022-02-04T20:12:25+05:30 IST