ఆసిఫాబాద్‌ జిల్లాలో బూస్టర్‌ డోసుపై ప్రజల అనాసక్తి

ABN , First Publish Date - 2022-08-08T04:21:06+05:30 IST

కొద్ది రోజులుగా కరోనా కేసులు తిరిగి నమోదు అవుతన్నందున బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో బూస్టర్‌ డోసుపై ప్రజల అనాసక్తి

-ప్రత్యేక కార్యక్రమాలకు ఆరోగ్యశాఖ కసరత్తు 

-ప్రజల్లో కరువైన స్పందన

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 7: కొద్ది రోజులుగా కరోనా కేసులు తిరిగి నమోదు అవుతన్నందున బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఐనా టీకా తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో బూస్టర్‌ డోస్‌ అందరికీ వేయాలని ప్రభుత్వం పేర్కొన్నా జనం నుంచి స్పందన కరువైంది. ఇప్పటికి 5శాతం మందే బూస్టర్‌ డోసు వేసుకున్నారంటే ప్రజలకు దీనిపై ఏమేరకు ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 18ఏళ్ల నుంచి 59ఏళ్ల వయస్సున్న వారికి ఈనెల నుంచి బూస్టర్‌ డోస్‌ పంపిణీ చేస్తోంది. ప్రజలు రాక వాక్సినేషన్‌ కేంద్రాలు బోసిపోతున్నాయి. కొవిడ్‌ మూడో దశలో స్వల్పంగా లక్షణాలు ఉండి తగ్గిపోవడంతో జనం బూస్టర్‌ డోస్‌పై అంతగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. ఈ మధ్యనే తిరిగి నాలుగోదశ కేసులు నమోదు అవుతున్నా వారు పట్టంచుకోవడం లేదు. వానాకాలం ప్రారంభమై జలుబు, జ్వరం వస్తుండడంతో ఇది మామూలేనని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విధమైన అజాగ్రత్త సరికాదని డాక్టర్లు పేర్కొంటున్నారు. వైద్యాధికారులు కేంద్రాలు ఏర్పాటు చేసినా అవగాహన కల్పించకపోవడంతోనే ప్రజలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. అర్హులందరికీ బూస్టర్‌ డోసు టీకాలను త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకొనేందుకు అదనపు కలెక్టర్‌ ఆదేశాలతో యాక్షన్‌ప్లాన్‌ తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. 

జిల్లాలో స్వల్పంగానే నమోదు..

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా బూస్టర్‌ డోసులు తీసుకునే అర్హులు ఇంకా 2 లక్షల మంది ఉన్నారని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఇప్పటివరకు 5శాతం మంది డోసులు తీసుకున్నారని మరింత మందికి ఇచ్చేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధిక వర్షాలు, తదితర కారణాలతో బూస్టర్‌ డోసు ప్రక్రియ అంతటా నెమ్మదిగానే జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 3,90093 మంది 18ఏళ్లు పైబడిన అర్హులున్నారు. అయితే వీరిలో 100శాతం మొదటి డోసు, 87శాతం రెండో డోసు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే బూస్టర్‌ డోసును ప్రారంభించి ఇప్పటేకే 22రోజులు దాటింది. బూస్టర్‌ డోసుపై సరైన అవగాహన కల్పించి వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నారు. చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇలాగే వదిలేస్తే వైరస్‌ మరింత విజృంభించే ప్రమాదం ఉంది. కేసులు తక్కువగా ఉన్నప్పటికీ అప్రమత్తం కావాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని సూచిస్తున్నారు. గతనెల 15నుంచి ప్రారంభించిన బూస్టర్‌ డోసు ప్రక్రియ మూడు వారాలు దాటినా పుంజుకోవడం లేదు. 60ఏళ్లు పైబడిన వారికి గత 6నెలలుగా ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కందరికీ టీకాలు వేస్తున్నారు.

జాగ్రత్తలు పాటించాలి

జిల్లాలో అక్కడక్కడ కొవిడ్‌ కేసులు నమోదవుతున్నందున జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. అయితే జనాల్లో మాత్రం కొవిడ్‌ తగ్గిందనే భావన ఉంది. కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటిస్తోంది. 

అవగాహన కల్పిస్తున్నాం..

-కృష్ణప్రసాద్‌, డీఐవో

కొవిడ్‌ మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు కొవిడ్‌ బారిన పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు విధిగా ధరించాలి. కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. జిల్లా వ్యాప్తంగా జ్వరాలు, ఇతర ఇబ్బందులున్న వారికి ఏఎన్‌ఎంలు చికిత్స కొనసాగుతున్నాయి. బూస్టర్‌ డోసుపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీఒక్కరికి డోసు ఇచ్చేలా కృషిచేస్తున్నాం.

Updated Date - 2022-08-08T04:21:06+05:30 IST