ప్రజాపద్దులో జీతం.. అయ్యాగారింట్లో ఊడిగం

ABN , First Publish Date - 2021-03-05T04:50:00+05:30 IST

‘‘నేను అంగన్‌వాడీ హెల్పర్‌ను సార్‌. నన్ను జేసీ బంగ్లాలో పని చేయమని పంపారు. అక్కడ ఆ అధికారి కుటుంబ సభ్యులు నా చేత కాళ్లు పట్టించుకునేవారు. మాలిష్‌ చేయించుకునేవారు. ఒక రోజు డ్యూటీకీ రాలేదని జేసీ సీసీ, కారు డ్రైవర్‌ ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి నాపై దాడి చేశారు. అంతేకాదు.. దొంగతనం కేసూ మోపారు.

ప్రజాపద్దులో జీతం..  అయ్యాగారింట్లో ఊడిగం

జిల్లాలో విచ్చలవిడిగా ఆర్డర్లీ వ్యవస్థ

చట్టాన్ని అమలు చేయాల్సిన వారే..

ఒక్కో ఉన్నతాధికారి ఇంట్లో పదుల సంఖ్యలో ఉద్యోగులు

రాజకీయ నాయకుల ఇళ్లలోనూ అంతే!

ఊడిగం చేయలేదంటే ఉద్యోగం ఉఫ్‌!

జేసీ ఇంట...అంగన్‌వాడీ వ్యవహారంతో గుట్టు రట్టు 


నెల్లూరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : ‘‘నేను అంగన్‌వాడీ హెల్పర్‌ను సార్‌. నన్ను జేసీ బంగ్లాలో పని చేయమని పంపారు. అక్కడ ఆ అధికారి కుటుంబ సభ్యులు నా చేత కాళ్లు పట్టించుకునేవారు. మాలిష్‌ చేయించుకునేవారు. ఒక రోజు డ్యూటీకీ రాలేదని  జేసీ సీసీ, కారు డ్రైవర్‌ ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి నాపై దాడి చేశారు. అంతేకాదు.. దొంగతనం కేసూ మోపారు. 

- ఓ అంగన్‌వాడీ హెల్పర్‌ చేసిన ఈ అభియోగాలు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జేసీ దగ్గర పనిచేసే ఉద్యోగులు ఈమెపై చేయి చేసుకున్నారా!? లేదా!?  నిజంగానే ఈమె దొంగతనం చేసిందా!? లేదా!? అన్న విషయాలు పక్కన పెడితే అంగన్‌వాడీ హెల్పర్‌ అయిన ఈమె అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు సేవ చేయాల్సింది పోయి జేసీ బంగ్లాలో అమ్మగారికి సేవ చేయడం ఏమిటి!? ఇది అసలు పశ్న. ప్రజల సొమ్మును జీతంగా తీసుకొంటూ, పౌరులకు సంబంధించిన పనులు చేయకుండా ఉన్నతాధికారి ఇంట్లో ఊడిగం చేయించడం ఏమిటీ!? ఇలాంటిది ఒదొక్కటేనా!? ఇంకా ఉన్నాయా..!? అనే విషయాల్లోకి వెళితే..

చూసే కొద్దీ కడుపు రగిలిపోయే నిజాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో నాల్గవ శ్రేణి ఉద్యోగులు ఒక్కో ఇంట్లో పదుల సంఖ్యలో పని చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఇళ్లలో కింది స్థాయి ఉద్యోగుల చేత ఊడిగం చేయించే ఆర్డర్లీ వ్యవస్థను మూడు దశాబ్దాల క్రితమే రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయినా ఏం లాభం. ప్రభుత్వ ఉత్తర్వులను పరిరక్షించాల్సిన అధికారులే వాటిని తుంగలోతొక్కి తమ బంగ్లాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను ఊడిగాల కోసం వినియోగించుకొంటున్నారు. ఇలాంటి ఉదాహరణలు మచ్చుకు కొన్ని.....


ఆ నలుగురి ఇళ్లల్లో 40 మంది..


సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 17 మంది నాల్గవ తరగతి ఉద్యోగులు, బీసీ వెల్ఫేర్‌ శాఖ నుంచి 12 మంది, ట్రైబల్‌ వెల్ఫేర్‌ నుంచి 8మంది, ఐసీడీఎస్‌ నుంచి ముగ్గురు.. మొత్తం 40 మంది. వీరంతా సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే వంట వాళ్లు, హెల్పర్లు. ఇంతమంది వంట వాళ్లు కేవలం నలుగురు అధికారుల ఇళ్లలో పని చేస్తున్నారు. సంక్షేమ శాఖ హాస్టళ్లలో సిబ్బంది లేక అల్లాడుతుంటే ఉన్నతాధికారుల మెప్పుకోసం మౌఖిక ఆదేశాలతో ఈ 40 మందిని ఆ ఉన్నతాధికారుల బంగ్లాల్లో వివిధ రకాల పనుల నిమిత్తం నియమించారు. 


కార్పొరేషన్‌ నుంచి పలువురు


కార్పొరేషన్‌ పరిధిలోని ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పదుల సంఖ్యలో కొందరు ఉన్నతాధికారుల ఇళ్లలో పనులు చేస్తున్నారు. ఒకమాటలో చెప్పాలంటే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల ఇళ్లలో ఊడిగాలకు మనుషులను సరఫరా చేసే కార్యాలయంగా కార్పొరేషన్‌ మారిపోయింది. అటెండర్ల క్యాడర్‌లో తీసుకున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని పలువురు ఉన్నతాధికారుల బంగ్లాలకు పదుల సంఖ్యలో పంపడంతో పాటు పనిలో పనిగా కార్పొరేషన్‌లో పనిచేసే పలువురు శాఖాధిపతులు సైతం తమ ఇళ్లలో ఐదు నుంచి ముగ్గురు చొప్పున ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని ఊడిగాల కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల నాయకులు తక్కువేం కాదు. కేవలం ముగ్గురు మనుషులున్న ఒక నాయకుడి ఇంట్లో కార్పోరేషన్‌కు చెందిన ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ముగ్గురు పని చేస్తున్నారంటే వీరికి మానవ సేవలు ఎంత చౌకగా లభిస్తున్నాయో ఊహించుకోవచ్చు. విద్యా శాఖకు ఇందులో మినహాయింపేమీ లేదు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఇంట్లో వర్సిటీకి చెందిన ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.   


చట్టాన్ని రక్షించాల్సిన శాఖలోనూ.. 


ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకోవాల్నిన పోలీస్‌ శాఖలోనూ ఊడిగం విచ్చలవిడిగా సాగుతున్నట్లు సమాచారం. పోలీసు శాఖలో హోంగార్డులను అన్ని స్థాయిలోని పోలీసు అధికారులు ఉపయోగించుకొంటున్నారు. చివరకు ఏసీబీ కార్యాలయంలో కూడా కార్పొరేషన్‌ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీయే శాఖ పరిధిలోని అధికారులు సైతం హోం గార్డులను తమ కోసం వినియోగించుకొంటున్నారు. 


అన్నీ మౌఖిక ఆదేశాలే..


ఉన్నతాధికారుల ఇళ్లలో వందల సంఖ్యలో నాల్గవ శ్రేణి, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నా ఏవీ రికార్డుల్లో  కనిపించవు. అన్ని ఊడిగాలు మౌఖిక ఆదేశాల మేరకే జరుగుతాయి. అక్కడ పని చేయలేమంటే మీ ఉద్యోగాలు పోయాయి వెళ్లండి అని బెదిరిస్తున్నారు. బుధవారం అంగన్‌వాడీ హెల్పర్‌ అన్న మాటలే ఇందుకు ఉదాహరణ. ఈ ఊడిగాలు ఎంత దాష్టీకంగా ఉంటున్నాయో అంగన్‌వాడీ హెల్పర్‌ ఆరోపణలే నిదర్శనం. ఒక్కరోజు కూడా సెలవు పెట్టడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. చేయి చేసుకొంటున్నా నోరు మెదపలేని సంఘటనలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కార్పొరేషన్‌ నుంచి ఇద్దరు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మౌఖిక ఆదేశాల మేరకు ఓ ఉన్నతాధికారి ఇంటికి వెళ్లారు. అక్కడ బాత్‌రూంలు కడగమనడంతో వీరు ఎదురు తిరిగారు. తమ కార్యాలయానికి  వచ్చి తాము ఆ పనులు చేయలేమన్నారు. అయితే మీ ఉద్యోగాలు పోయాయి వెళ్లండి అనే సమాధానం వచ్చింది. దీంతో వీరు ఉద్యోగ సంఘ నాయకులను ఆశ్రయించడంతో వారి ప్రమేయంతో సమస్య సద్దుమణిగింది. వీరి స్థానంలో వేరే వారిని అక్కడికి పంపారు. నిన్నటికి నిన్న తన చేత కాళ్లు పట్టించుకునేవారని, తల మాలిష్‌ చేయించుకునేవారని ఓ అంగన్‌వాడీ హెల్పర్‌ పోలీసులకు పిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల ఇళ్లలో కింది స్థాయి సిబ్బందికి ఎదురవుతున్న అవమానకర పరిణామాలకు ఇవి నిదర్శనాలు.


అధికారుల విచక్షణకే..


విధి నిర్వహణలో బిజీగా ఉండటం వల్ల వ్యక్తిగత పనులు చేసుకోవడానికి వీలుపడని ఉన్నతాధికారులు తమ కుటుంబ అవసరాలు తీర్చడం కోసం ఒకరిద్దరు సహాయకులను నియమించుకోవడాన్ని పెద్దగా తప్పు పట్టలేము. అయితే, ఈసాకుతో ఒకరిని చూసి ఇంకొకరు పదుల సంఖ్యలో ఊడిగాలకు పెట్టుకోవడమే అన్యాయం. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేస్తూ, దానిని ఉల్లఘించడం నేరమని చట్టం చేసినా, దానిని పరిరక్షించి అమలు చేయాల్సిన అధికారులే ఇలా విచ్చలవిడిగా వ్యవహరిస్తే ప్రశ్నించేవారు ఎవరు!? అధికారులే తామంతట తాముగా ఆలోచించాలి. మనసాక్షికి భయపడాలి. 

Updated Date - 2021-03-05T04:50:00+05:30 IST