రాజువయ్యా... మహరాజువయ్యా!

ABN , First Publish Date - 2020-08-11T10:12:05+05:30 IST

జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు (87) కన్నుమూశారు.

రాజువయ్యా... మహరాజువయ్యా!



వైసీసీ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి

ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం

నిజాయితీ గల నేతగా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు

జిల్లాలో వైసీపీకి పునాదులు వేసిన పెద్దాయన

తొలినాళ్లలో జగన్‌కు అండగా నిలిచిన ఒకే ఒక్కడు

పార్టీ పటిష్టానికి విశేష కృషి

ఎటువంటి పదవులకు నోచుకోని వైనం

స్వగ్రామం మొయిదలో విషాదం

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు 


సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడిగా పేరొందిన ‘పెద్దాయన’ ఇకలేరు. ఓ రాజకీయ శిఖరం నేలకొరిగింది. రాజకీయ కురువృద్ధుడు...ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా... మంత్రిగా.. సేవలందించిన పెనుమత్స సాంబశివరాజు మృతితో జిల్లా పెద్ద దిక్కును కోల్పోయింది. జిల్లా రాజకీయాల్లో ‘పెను’మార్పులు తీసుకొచ్చిన సాంబశివరాజు మరణాన్ని జిల్లా నేతలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎనిమిది పదుల వయసులోనూ కార్యకర్తలందరినీ పేరుపేరునా పలుకరిస్తూ...తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘రాజు గారి’ మరణంతో జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి.


నెల్లిమర్ల, ఆగస్టు 10 : జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు (87) కన్నుమూశారు. కొద్ది రోజులుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధ పడుతున్న ఆయనను కుటుంబీకులు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. 1933 ఆగస్టు 17న జన్మించిన ఆయన మరో వారం రోజుల్లో 88వ జన్మదిన వేడుకలు చేసుకోవాల్సింది. సాంబశివరాజుకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు ప్రసాద్‌బాబు, సురేష్‌బాబు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలలో ఒకరు చిన్నవయసులో మరణించగా.. మరో కుమార్తె అమెరికాలో స్థిరపడ్డారు.


కుమారులు, భార్య స్థానికంగా ఉన్నారు. చిన్న కుమారుడు డాక్టర్‌ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్‌బాబు) తండ్రిని అనుసరిస్తూ రాజకీయ రంగంలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సాంబశివరాజు మరణ వార్త విని స్వగ్రామం నెల్లిమర్ల మండలం మొయిదతో పాటు పరిసర గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సాంబశివరాజు తండ్రి జగన్నాఽథరాజు విజయనగరం గజపతుల సంస్థానంలో దివాన్‌గా సేవలందించారు. 


రాజకీయ ప్రస్థానం

సాంబశివరాజు తన 35వ ఏట 1958 ఫిబ్రవరి 9న జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే సంవత్సరంలో మొయిద గ్రామానికి తొలిసారిగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1959-64 మధ్య నెల్లిమర్ల సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1962-65, 1965-68 మధ్య కాలంలో అప్పటి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంస్థ విజయవాడ కు ఉపాఽధ్యక్షులుగా వ్యవహరించారు. 1962-64లో ఆంధ్రా వర్సిటీ సెనేట్‌ మెంబర్‌గా వ్యవహరించారు. 1966-77ల మధ్య నెల్లిమర్ల జూట్‌ మిల్లు కార్మిక సంఘం అధ్య క్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 1967లో గజపతినగరం నియోజకవర్గంలో కాంగ్రె స్‌ అభ్యర్థి తాడ్డి సన్యాసినాయుడుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిం చి... తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1968-78 మధ్య కాలంలో విజయనగరం అరుణ జూట్‌మిల్లు శ్రామిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 1969-73 మధ్య విజయనగరం సర్వారాయ నేషనల్‌ మజ్దూర్‌ సంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు. 1972లో తిరిగి గజపతినగరం నియోజకవర్గం నుంచి ఇండిపెం డెంట్‌గా పోటీచేసి ఎమ్మెల్యేగా ఏకగ్రీకంగా ఎన్నికయ్యారు. 


 1973-75 మధ్య కాలంలో రాష్ట్ర స్థాయిలో ఆర్టీసీ బోర్డు సభ్యునిగా, ఆంధ్ర అభివృద్ధి మండలి సభ్యుడిగా వ్యవహరించారు. 1978లో పునర్విభజన తర్వాత సతివాడ నియో జకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1978 నుంచి ఐదేళ్ల పాటు విజయనగరం సెంట్రల్‌ బ్యాంకు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో సతివాడ నియోజకవర్గం నుంచి ఇందిరా కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఎంఎల్‌ఏ గా గెలిచారు. 1984లో ఆనందగజపతిరాజుపై బొబ్బిలి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 1985లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సతివాడ నుంచి మళ్లీ ఎంఎల్‌ఏగా విజయం సాధించారు. 1985 నుంచి 1988 వరకు పీసీసీ సభ్యుడిగా ఉన్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో సతివాడ నుంచి పొట్నూరు సూర్యనారాయణపై పోటీ చేసి ఎంఎల్‌ఏగా విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో అదే పొట్నూరుపై పోటీ చేసి తొలిసారి ఎంఎల్‌ఎ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఎన్‌.జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో 1992 నుంచి 1994 వరకు మంత్రి పదవిలో ఉన్నారు. చక్కెర శాఖ, రవాణా, పౌరసరఫరాల శాఖల బాధ్యతలు చూశారు.


1989లో ప్రోటెం స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. 1999 నుంచి 2002 వరకు జి ల్లా కాంగ్రెస్‌ కమిటీ సారఽథ్య బాధ్యతలను నిర్వహించారు. 2000-02 కాలంలో ప్ర జా పద్దుల కమిటీ చైర్మన్‌గా, నైతిక విలువల కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో సతివాడ నియోజకవర్గం నుంచి మరోసారి ఎం ఎల్‌ఏగా విజయం సాధించారు. 2004లో మంత్రి పదవి ఆశించినా... నిరాశే ఎదురైంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ... సాంబశివరాజుకు మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. 2009 ఎన్నికల్లో ఎంఎల్‌ఎగా పోటీ చేసే అవకాశం లభించినప్పటికీ తిరస్కరించారు. అనంతర కాలంలో వైసీపీలో చేరారు.  


 దివంగత వైఎస్‌ఆర్‌తో అనుబంధం

సాంబశివరాజుకు కాంగ్రెస్‌ పార్టీలో మంచి గుర్తింపు, గౌరవం ఉండేవి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో అత్యంత సాన్నిహిత్యం ఉండేది. కోట్ల విజయభాస్కరరెడ్డి, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, అంజయ్య, దామోదరం సంజీవయ్య, జలగం వెంగళరావు తదితర నేతలతో సాంబశివరాజుకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. జాతీయ స్థాయిలో పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్‌, గులాంనబీ ఆజాద్‌ తదితరులతో కూడా మంచి సంబంధాలు ఉండేవి. 


నిజాయితీకి మారుపేరు 

సుమారు 50 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో అన్ని స్థాయిల్లో రాణించిన సాంబశివరాజు నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. సొంత పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఆయనను అమితంగా అభిమానించే వారు. వివాద రహితుడిగా పేరొందారు.  గ్రామాల్లోనికి వెళ్లినపుడు కార్యకర్తలను పేరు పెట్టి పిలిచి ఆప్యాయంగా పలుకరించేవారు. 


అందరూ శిష్యులే 

ప్రస్తుతం జిల్లా వైసీపీలో చక్రం తిప్పుతున్న మంత్రి బొత్స సత్యనారాయణతో పా టు నాయకుల్లో అధిక శాతం మంది సాంబశివరాజు శిష్యులే. మంత్రి బొత్స, ఆయన సోదరుడు అప్పలనర్సయ్య, ఎమ్మెల్యే వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వీరంతా సాంబశివరాజు శిష్యుల జాబితాలో ఉన్నారు. 




వైసీపీకి పెద్ద దిక్కుగా...

కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రకు జిల్లాకు వచ్చినప్పుడు సాంబశివరాజే తొలుత ఆయన ను విజయనగరంలోకి ఆహ్వానించా రు. చాలా రోజుల వర కూ పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నారు. పల్లెపల్లెకూ తిరు గుతూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఎంతో బాసటగా నిలిచారు. 2019 ఎన్నికల్లో నెల్లిమర్ల ని యోజకవర్గం నుంచి తనకు గానీ, తన కుమారుడుకి గానీ సీటు వస్తుందని ఆశించారు. కానీ పార్టీ అధినేత అవకాశం ఇవ్వలేదు. ఎంఎల్‌సీగా అవకాశం కల్పిస్తానని జగన్‌ హామీ ఇవ్వడంతో మిన్నకుండిపోయారు. తన కుమారుడు సురేష్‌బాబును ఎంఎల్‌ఎగా చూడాలనేది ఆయన చివరి కోరికగా చెప్పేవారని అనుచరులు గుర్తు చేసుకుంటున్నారు.


 ప్రముఖుల నివాళి

మాజీమంత్రి సాంబశివరాజు మరణం పట్ల ఎంఎల్‌ఎ బడ్డుకొండ అప్పలనాయుడు, పార్టీ నాయకులు అంబళ్ల శ్రీరాములునాయుడు, చనమల్లు వెంకటరమణ, జి.సన్యాసినాయుడు, కేవీ సూర్యనారాయణరాజు, చిక్కాల సాంబశివరావు, జనా ప్రసాద్‌, సముద్రపు రామారావు, నల్లి చంద్రశేఖర్‌, నెల్లిమర్ల జూట్‌ మిల్లు శ్రామిక సంఘ ఽఅధ్యక్షుడు పతివాడ అప్పారావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్‌, మాజీ ఎంపీపీ సువ్వాడ వనజాక్షి, పార్టీ నాయకులు గేదెల రాజారావు, బయిరెడ్డి నాగేశ్వరరావు, సీపీఐ నెల్లిమర్ల నియోజక వర్గ నాయకుడు తాలాడ సన్నిబాబు,  సీపీఎం నాయకుడు కిల్లంపల్లి రామారావు తదితరులు నివాళులు సంతాపం తెలిపారు.                            

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు   

                  

 మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తి చేశారు.  మొయిద గ్రామంలోని తన ఇంటి ఎదుట ఉన్న పూలతోటలో సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసు దళం గాలిలోనికి కాల్పులు జరిపి.. గౌరవ వందనం చేశారు. అనంతరం సాంబశివరాజు కుమారుడు సురేష్‌బాబు తండ్రి చితికి నిప్పంటించారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, విజయనగరం ఎంఎల్‌ఎ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నాయకులు కేవీ సూర్యనారాయణరాజు (పులిరాజు), శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ చనమల్లు వెంకటరమణ, మత్స సత్యనారాయణ, గదల సన్యాసినాయుడు తదితరులు సాంబ శివరాజు మృతదే హం వద్ద నివాళులర్పించారు.


Updated Date - 2020-08-11T10:12:05+05:30 IST