‘అదనపు’ కష్టం

ABN , First Publish Date - 2022-05-03T05:58:44+05:30 IST

పెన్షనర్లకు పెద్ద కష్టమే వచ్చి పడింది.

‘అదనపు’ కష్టం

నాలుగు నెలలుగా జమకాని అదనపు పెన్షన్‌ 

పెండింగ్‌ డీఏ బకాయిలూ చెల్లించడం లేదు 

పెన్షనర్లకు తీవ్ర ఇబ్బందులు

ప్రశ్నిస్తే సమస్య సీఎఫ్‌ఎంఎస్‌తోనే అని సమాధానం


పెన్షనర్లకు పెద్ద కష్టమే వచ్చి పడింది. అదనపు పెన్షన్‌ను అందుకోలేక, కరువు భత్యాన్ని పొందలేక ఉభయ జిల్లాల్లోని పెన్షనర్లు ట్రెజరీ కార్యాలయాల చుట్టూ కాలికి బలపం కట్టుకుని తిరగాల్సి వస్తోంది. అదేమంటే సీఎఫ్‌ఎంఎస్‌ సమస్య అంటున్నారు. ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలియదు. ఎందుకు పరిష్కరించలేకపోతున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అదనపు పెన్షన్‌, కరువు భత్యం చెల్లింపు సమస్యలు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా సులభతరం కావాల్సింది పోయి జఠిలంగా మారి పెన్షనర్లను ఇబ్బంది పెడుతున్నాయి. అదనపు పెన్షన్‌ బకాయిలు, కరువు భత్యం బకాయిలు ఏప్రిల్‌ 22 తరువాత ఉండవని ఓపక్క అధికారులు చెబుతున్నా ఆ తేదీ దాటి కూడా వారం గడిచిపోయింది. అయినప్పటికీ పెన్షనర్ల సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఈ ఏడాది జనవరి 22వ తేదీ నుంచి 70, 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్‌ కలపటం లేదు. సీఎఫ్‌ఎంఎస్‌లో ఈ పోర్టల్‌ ఓపెన్‌ కావటం లేదనేది ట్రెజరీ అధికారుల మాట. 11వ పీఆర్సీని ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమలు చేయాలని కార్యదర్శుల కమిటీని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు కొన్నేళ్లుగా 70, 75 సంవత్సరాలు దాటిన తర్వాత పొందుతున్న 10 శాతం, 15 శాతం అదనపు పెన్షన్‌లను రద్దు చేస్తూ జీవో నెంబర్‌-2 ద్వారా ఈ ఏడాది జనవరిలో ఆదే శాలు జారీ అయ్యాయి. దీనిపై పెన్షనర్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల జేఏసీలతో కలిసి ఉద్యమంలో పాలు పంచుకున్నారు. మొత్తం మీద అదనపు పెన్షన్‌కు సంబంధించి ప్రభుత్వం దిగివచ్చింది. అయితే, దీనిలో కొంతమేర కోత పెట్టింది. 70 సంవత్సరాలు దాటిన వారికి ఏడు శాతం, 75 సంవత్సరాలు దాటిన వారికి 12 శాతం అదనపు పెన్షన్‌ను చెల్లించటానికి అంగీకరించింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 20న జీవో కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో జనవరి 22 నుంచి 70, 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్‌ కలపాల్సి ఉన్నా కలపటం లేదు. అదేమని అడిగితే సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌ ఓపెన్‌ కావటం లేదని ట్రెజరీ అధికారులు సమాధానమిస్తున్నారు. 

Read more