నాడు నై.. నేడు ఓకే

ABN , First Publish Date - 2022-07-21T06:21:42+05:30 IST

పింఛన్ల కోసం పడిగాపులు తీరాయి. మూడేళ్లుగా వివిధ దశల విచారణల పేరుతో పలువురి పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

నాడు నై.. నేడు ఓకే

జిల్లాలో 11.782 పింఛన్లు మంజూరు

వీటిలో 95 శాతం గతంలో తిరస్కరించినవే 

రెండేళ్లు అకారణంగా నష్టపోయామన్న బాధితులు

12,500 పింఛన్‌ దరఖాస్తులకు 11,782 మందికి ఆమోదం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడేళ్లలో 40 వేల పింఛన్ల రద్దు 


గుంటూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): పింఛన్ల కోసం పడిగాపులు తీరాయి. మూడేళ్లుగా వివిధ దశల విచారణల పేరుతో పలువురి పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి దరఖాస్తులు ఆహ్వానించింది. అకారణంగా రద్దు అయిన వారితో పాటు.. కొత్తగా పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే నెలల తరబడి పింఛన్‌ ఆమోదం పొందక ఎదురుచూస్తున్న సామాజిక భద్రతా పింఛను లబ్దిదారుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ప్రతి ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం రెండు నెలలుగా ఇదిగో అదిగో అంటూ నెట్టుకొచ్చింది. చివరకు జూలై చివరకు ఆమోదముద్ర వేసింది. దీంతో జిల్లాలోని పింఛనుదారుల జాబితాలో కొత్తగా మరో 11,782 మంది చేరారు. వీరిలో గతంలో అకారణంగా రద్దు చేయడంతో నష్టపోయినవారే అధికంగా ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 95 శాతం మందికి పింఛన్లు మంజూరు చేశామని, వీరందరికీ ఆగస్టు 1 నుంచి పింఛన్లు అందిస్తామని సంబంధిత అధికారులు ఇటీవల జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. అయితే అకారణంగా రద్దు చేయడం.. ఇప్పుడు కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించడం ఏమిటంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ మూడేళ్లలో పింఛన్‌ అందక తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. జిల్లాలో 12,500 మంది పింఛనుకోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 11,782 మందికి తాజాగా ఆమోదం తెలిపారు. పింఛను భారం తగ్గించుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రకరకాల నిబంధనల పేరుతో గడిచిన మూడేళ్లలో జిల్లాలో వేలాది మంది పింఛను రద్దు చేసేసింది. మూడు దశల్లో జరిగిన ఈ ఏరివేతల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 40 వేల మంది వరకూ పింఛను కోల్పోయారు. అర్హతలు ఉండి పింఛను కోల్పోయిన వీరంతా మూడేళ్లుగా సచివాలయాలు మొదలు కలెక్టరేట్‌లో జరిగే స్పందన వరకూ అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వం వాయిదాలు వేస్తూనే వస్తోంది.


పాపం పండుటాకులు, వితంతువులు

రేషన్‌ కార్డు లేదని, ఇళ్లు, పొలాలు, కార్లు ఉన్నాయని, విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటిందని, ఆదాయపు పన్ను చెల్లించారని, ఇంట్లో ప్రభుత్వ పెన్షనుదారులు ఉన్నారని సవాలక్ష కారణాలు చూపి వృద్ధులు, వితంతువుల పింఛన్లను గతంలో ప్రభుత్వం తొలగించింది. అద్దె ఇళ్లల్లో ఉన్న కారణంగా, కొడుకులు ఆదాయపు పన్ను చెల్లించిన కారణంగా, రేషన్‌ కార్డులు లేని కారణంగా నిజమైన లబ్ధిదారులు పలువురు తీవ్రంగా నష్టపోయారు. ఇలా నష్టపోయినవారిలో వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు 90 శాతం మందికి పైగా ఉన్నారు. తాజా జాబితాలో వయో వృద్ధులు 6,082, వితంతువులు 3,521, దివ్యాంగులు 2,169, కిడ్నీ బాధితులు 10 మంది ఉన్నారు. అంటే వీరంతా పింఛన్లు కోల్పోయి రెండు, మూడేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నవారే కావడం విశేషం.


Updated Date - 2022-07-21T06:21:42+05:30 IST