పెన్షనర్ల.. పడిగాపులు

ABN , First Publish Date - 2022-07-02T05:31:39+05:30 IST

గతంలో ఏ నెలకు ఆ నెల కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేసేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం పింఛన్ల భారం తగ్గించుకునే క్రమంలో కోతల మొదలుపెట్టింది.

పెన్షనర్ల.. పడిగాపులు

నూతన దరఖాస్తుల ఆమోదం వాయిదా

మూడు జిల్లాల్లో 30 వేల మంది నిరీక్షణ

జూన్‌ నెల ముగిసి జూలైలోకి వచ్చినా నిరాశే

కొతలతో కొంత.. వాయిదాలతో మరికొంత మిగులు


గుంటూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): గతంలో ఏ నెలకు ఆ నెల కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేసేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం పింఛన్ల భారం తగ్గించుకునే క్రమంలో కోతల మొదలుపెట్టింది. ఆ తర్వాత నూతన దరఖాస్తుల ఆమోదాన్ని ఏడాదిలో రెండు సార్లకే పరిమితం చేసింది. ఆ ప్రకారం జూన్‌లో కొత్త దరఖాస్తులను పరిశీలించి పింఛన్లు మంజూరు చేయాలి. అయితే జూన్‌ ముగిసి జూలై నెలలోకి ప్రవేశించినా పింఛనర్ల పడిగాపులు పడాల్సి వస్తోంది. జూన్‌లో మంజూరు చేయాల్సిన కొత్త పింఛన్ల ఆమోదాన్ని వాయిదా వేసింది. తమ దరఖాస్తులకు ప్రభుత్వం ఎప్పుడు ఆమోద ముద్ర వేస్తుందో.. ఎప్పుడు పింఛను వస్తుందో తెలియక మూడు జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. జూన్‌లో ఆమోదం పొందాల్సిన పింఛన్లు జూలైకి వాయిదా పడ్డాయి. జూలైని ప్రామాణికంగా తీసుకుని ఆగస్టులో ఇస్తారా లేక ఆమోదం పొందిన తర్వాత నుంచి పేర్లు లాగిన్లలోకి వస్తాయి గనుక ఆగస్టు నెలను పరిగణనలోకి తీసుకుని ఆ నెల పింఛను సెప్టెంబరులో ఇస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం జూలైలో ఆమోదం పొందితే సెప్టెంబరు దాక లబ్ధిదారులు వేచి చూడక తప్పకపోవచ్చు.


భారం తగ్గించుకునేందుకు నిబంధన

సామాజిక భద్రతా పింఛను దరఖాస్తుల పరిశీలన, ఆమోదం గత ప్రభుత్వ హయాంలో ఏడాదంతా కొనసాగేది. అర్హులైనవారు ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే ఆ నెలలోనే పరిశీలించి 15 రోజుల్లోగా పింఛను మంజూరు చేసేవారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై పింఛన్ల భారం ప్రతి నెలా పెరిగిపోతుండేది. ఈ భారాన్ని తగ్గించుకోవాలిని భావించిన వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో మాత్రమే పెన్షన్లకు ఆమోద ముద్ర వేసేలా కొత్త నిబంధన తీసుకువచ్చింది. దీంతో లబ్ధిదారులు ఆరు నెలలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ పద్ధతికి కూడా ప్రభుత్వం స్వస్తి చెబుతోంది. దరఖాస్తులను ఆమోదించి జూన్‌లో పింఛన్‌ మంజూరు చేయాల్సి ఉండగా దానిని అనధికారికంగా వాయిదా వేసింది. జూన్‌ నెల మొదలు నెలాఖరు వరకూ పరిశీలన పేరుతో తాత్సారం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తై పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో లాగిన్లలో దరఖాస్తులు ఓకే అయినా జిల్లా అధికారుల స్థాయిలో వాటికి ఆమోదం లభించలేదు. జూన్‌ 16న అని ఒకసారి, జూన్‌ 28న అని మరో సారి చెబుతూ వచ్చిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తాజాగా జూలై 19కి మంజూరవుతాయని చెబుతున్నారు. దీనిపై కూడా అధికారుల్లో స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.  


 

Updated Date - 2022-07-02T05:31:39+05:30 IST