పింఛన్లలో కోత

ABN , First Publish Date - 2022-08-02T05:17:09+05:30 IST

సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వీటిలో అందిన కాడికి కోత విధిస్తోంది. ఖర్చు తగ్గించుకోనేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.

పింఛన్లలో కోత

ఒప్పంద కార్మికుల కుటుంబాలలో ఉన్నవారి పింఛన్లు నిలిపివేత

 

నరసరావుపేట, ఆగస్టు1: సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వీటిలో అందిన కాడికి కోత విధిస్తోంది. ఖర్చు తగ్గించుకోనేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. విద్యుత్‌ బిల్లులు తదితర సాకులతో ఎంతోమంది ఫించన్‌లను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఒప్పంద కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలపై వేటు వేసింది. ఈ కుటుంబాల్లో ఉన్న వృద్ధాప్య వివిధ రకాల పింఛన్‌లను నిలిపివేసింది. దీంతో సదరు లబ్ధిదారులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

 జిల్లాలో వేలాదిమంది ఒప్పంద కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. అత్యధికంగా మునిసిపాల్టీలో వారు పనిచేస్తున్నారు. వీరిలో పారిశుధ్య కార్మికులు అధికంగా ఉన్నారు. ఇటువంటి ఉద్యోగుల కుటుంబాల్లో ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల పింఛన్‌లను ప్రభుత్వం నిలిపివేసింది. మీకు పింఛన్‌ నిలిపివేశారు అని  వలంటీర్‌లు చెప్పడంతో వారు ఆందోళనకు గురయ్యారు. కుటుంబంలోని ఒప్పంద ఉద్యోగులతో కలిపి ఒకే కార్డులో ఉన్నవారికి పింఛన్లు నిలిచాయి. వీరు తిరిగి పింఛన్‌ పొందాలంటే కుటుంబసభ్యుల కార్డులో ఉన్న పేరును తొలగింపజేసుకొని కొత్తగా కార్డు పొందాల్సిందే. మళ్ళీ పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే ఎంత కాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వ పింఛన్‌దారుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం బాధితుల నుంచి వ్యక్తమవుతోంది. తమ పింఛన్‌లను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. కాగా డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్‌ను వివరణ కోరగా పింఛన్‌లు నిలిచిపోవడంపై పరిశీలిస్తున్నామని తెలిపారు. 

 

Updated Date - 2022-08-02T05:17:09+05:30 IST