కొత్త PRC అమలు విషయంలో పంతం నెగ్గించుకున్న Jagan సర్కార్..!

ABN , First Publish Date - 2022-02-01T06:12:15+05:30 IST

కొత్త పీఆర్సీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది....

కొత్త PRC అమలు విషయంలో పంతం నెగ్గించుకున్న Jagan సర్కార్..!

  • కోసేశారు..!
  • తొలి దెబ్బ పెన్షనర్ల మీదే
  • జనవరి నెల బిల్లులు పాస్‌
  • సీఎఫ్‌ఎంఎస్‌లో పెన్షన స్టేటస్‌
  • ఐదు డీఆర్‌లు కలిపి.. పెరిగినట్లు మాయ
  • వచ్చే నెల నుంచి  వేలాది రూపాయల కోత


అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జనవరి 31: కొత్త పీఆర్సీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల నిరసనను ఏమాత్రం లెక్కచేయకుండా కొత్త పీఆర్సీని అమలు చేసేసింది. మొదట ప్రభుత్వ పెన్షనర్లను ఎంచుకుంది. కొత్త పెన్షన వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌ స్టేట్‌సలో సోమవారం ఉంచింది. సవరణ ఉత్తర్వుల మేరకు.. 70 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్న పెన్షనర్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్ మొత్తంలో కోత పెట్టింది.


ఐఆర్‌లో 4 శాతం కోత విధించింది. ఇదెక్కడా కనిపించకుండా ఐదు డీఆర్‌లను కలిపి.. మసిపూసి మారేడుకాయ చేసింది. ఒకేసారి ఐదు డీఆర్‌లను (కరువు భత్యం) విడుదల చేసి పెన్షన్ పెరిగినట్లు చూపించింది. ఐదు డీఆర్‌లను పక్కనబెడితే, 23 శాతం ఐఆర్‌, 30 శాతం డీఆర్‌ కలిపి వచ్చే నెల నుంచి ఒక్కో పెన్షన్‌దారు రూ.3 వేల నుంచి రూ.10 వేలకుపైగా కోల్పోతారు. 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల పెన్షనర్లదీ అదే పరిస్థితి. వీరు కూడా 4 శాతం ఐఆర్‌ నష్టపోతున్నారు. దీంతో ఒక్కొక్కరికి రూ.1000 నుంచి రూ.3 వేల వరకూ పెన్షన తగ్గుతుంది. దీనిపట్ల పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. కొత్త పీఆర్సీ ప్రకారం 30 శాతంతో ఐదు డీఆర్‌లు ఒకేసారి కలిపి, 27 శాతం ఉన్న ఫిట్‌మెంట్‌ను 23 శాతానికి కుదించింది. అటు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన రద్దు చేసింది. దీన్ని పెన్షనర్లు వ్యతిరేకిస్తున్నారు. తమకు ప్రతినెలా ఒక డీఆర్‌ మాత్రమే ఇస్తారని, ఇప్పుడు ఐదు డీఆర్‌లు ఇచ్చినట్లు చూపారు కాబట్టి ఎక్కువ కనిపిస్తోందని అంటున్నారు. తాము అడిగిన మేరకు 27 శాతం ఫిట్‌మెంట్‌, క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షనను కలిపి ఉంటే పెన్షన మరింత పెరిగేదని విశ్రాంత ఉద్యోగులు అంటున్నారు.


చాలా నష్టం..

కొత్త పీఆర్సీతో జిల్లాలోని ఒక్కొక్క పెన్షనదారు ప్రతి నెలా రూ.3 వేల నుంచి రూ.10 వేలకుపైగా కోల్పోయారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా జిల్లాలోని అన్ని సబ్‌ ట్రెజరీల అధికారులు జిల్లాలోని 30 వేల మంది పెన్షనర్ల జనవరి నెల పెన్షన బిల్లులను సీఎఫ్ఎంఎస్‌కు పంపారు. వీరిలో 10 వేల మందికిపైగా 60 నుంచి 70 ఏళ్ల వయస్సు వారు ఉన్నారు. ఇకపై ప్రతినెలా రూ.1000 నుంచి రూ.3 వేలు నష్టపోతారు. 70 నుంచి 80 ఏళ్ల వయసువారు 14 వేల మందిదాకా ఉన్నారు. వీరు మరింత ఎక్కువ నష్టపోతారు. వీరిలో 70 నుంచి 75 ఏళ్ల వరకూ 10 శాతం, 76 నుంచి 80 ఏళ్ల వరకూ 15 శాతం క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షనను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనికితోడు ఫిట్‌మెంట్‌లో 4 శాతం నష్టపోతున్నారు. ఈ కారణంగా ఒక్కొక్క పెన్షనదారు రూ.3 వేల నుంచి రూ.10 వేలకుపైగా నష్టపోతారు. తమకు అన్యాయం చేయవద్దని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పెన్షనర్లు వాపోతున్నారు.


ఇదీ అసలు లెక్క

రూ.25,840 పెన్షన తీసుకునే ఓ విశ్రాంత ఉద్యోగికి డీఆర్‌ 30 శాతం, ఐఆర్‌ 27 శాతం, అదనపు పెన్షన 10 శాతం, మెడికల్‌ అలవెన్స్ రూ.300 కలిసి మొత్తం నెలకు రూ.43,553 పెన్షన్ వచ్చేది. కొత్త పీఆర్సీ మేరకు ఈయనకు ఐదు డీఆర్‌లు, 23 శాతం ఐఆర్‌ కలిపి రూ.65,105 చూపించారు. కానీ వచ్చే నెల నుంచి ఇంత మొత్తం రాదు. కారణం.. ఈ ఐదు డీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నవే. ప్రతి నెల ఒక డీఆర్‌ మాత్రమే వస్తుంది. ఈ లెక్కన వచ్చే నెల నుంచి 30 శాతం డీఆర్‌ రూ.7,853, 23 శాతం ఐఆర్‌ రూ.5,943, మెడికల్‌ అలవెన్స్ రూ.500 కలిపి కేవలం రూ.40,136 వస్తుంది. అంటే.. వచ్చే నెల నుంచి పెన్షన్ రూ.3,417 తగ్గుతుంది. ఇది రూ.25 వేలు పెన్షన తీసుకునే వారికి జరిగే నష్టం. అదే రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకూ పెన్షన్ తీసుకునే వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకుపైగా కోత పడుతుంది.


వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం

కొత్త పీఆర్సీ మాకొద్దు బాబోయ్‌ అని నెత్తీనోరు కొట్టుకుంటున్నా ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. బలవంతంగా అమలు చేసి పెన్షనర్లకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. చరిత్రలో ఇంత దరిద్రపు ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. నాకు పెన్షన రూ.50 వేలు వస్తుంది. ఈ నెల ఐదు డీఆర్‌లు కలిపి రూ.53 వేలు చూపారు. అంటే రూ.3 వేలు ఎక్కువ అనుకోవాలన్నమాట. కానీ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షనను కలిపితే రూ.60 వేలకుపైగా రావాలి. మరి ఎక్కడ వచ్చింది..? ఇదంతా మోసపూరిత చర్య. వచ్చే ఎన్నికల్లో సీఎం జగనకు తగిన బుద్ధి చెబుతాం. - పెద్దనగౌడ్‌, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు


పెరిగిందేమీ లేదూ

కొత్త పీఆర్సీతో ఒరిగింది ఏమీ లేదు. రూ.3 వేలు కో త పడుతుంది. ఈ నెల ఐదు డీఆర్‌లు ఇచ్చారు కాబట్టి నాకు రూ.45 వేలకుపైగా వచ్చింది. వ చ్చే నెల నుంచి క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన రాదు. దీనికితోడు ఐఆర్‌లో 4 శాతం తగ్గింది. దీంతో ప్రతి నెలా రూ.3 వేల వరకూ కోల్పోతాను.

-  రామాంజనేయులు, పెన్షనర్‌


Updated Date - 2022-02-01T06:12:15+05:30 IST