పెన్షన్ల.. కుదింపు

ABN , First Publish Date - 2021-09-06T05:26:05+05:30 IST

అర్హులైనవారు అడిగిన వారంలోపే పెన్షన్‌ ఇస్తామని ప్రకటించిన వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తటంలేదు.

పెన్షన్ల.. కుదింపు

అనర్హుల పేరుతో వేటు

నెలనెలా తగ్గుతున్న పింఛన్లు

లబోదిబోమంటున్న లబ్ధిదారులు

పెంచుతామని తొలగించారని ఆవేదన

అధికారుల చూట్టూ తిరుగుతున్న వైనం


వారు.. మూడుకాళ్ల ముసలోళ్లు.. విధి వంచితులు.. వైకల్యంతో అవస్థలు పడుతుంటారు.. వీరంతా ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ సొమ్ముపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయినా ఆలోచించలేదు. కనికరించలేదు. పింఛన్ల కుదింపే లక్ష్యంగా తొలగించేశారు. పింఛన్‌ పెంచుతామన్నారు. కాని తుంచేశారు. ఆ తొలగింపులకు కూడా కారణం లేదు. ఎందువల్ల ఆపేశారో ఎవరికీ తెలియదు. ఈ నెలలో పింఛన్‌ ఇవ్వకపోవడంతో మందులు కొనుక్కోలేక కొందరు.. తిండి గింజలు ఎలాగో తెలియక మరికొందరు.. ఆందోళనకు గురయ్యారు. వలంటీర్లను, సచివాలయాల సిబ్బందిని సంప్రదిస్తే సమాధానం రాక అష్టకష్టాలు పడి అధికారులను కలిసినా భరోసా రాక పింఛన్‌దారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జిల్లాలో నెలనెలా తగ్గుతూ వస్తున్న పింఛన్లు చూస్తుంటే.. ఏ నెలలో ఎవరికి నిలిపివేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పింఛన్ల కుదింపునకు రకరకాల సాకు చూపుతూ వాటి సంఖ్య తగ్గించడమే ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  


ఆశ.. నిరాశ..       

ప్రభుత్వం మారింది. పెన్షన్‌ పెంచుతారు. కొత్తగగా  మాకూ వస్తోంది. ఇక మందులు, తిండికి తిప్పలు ఉండవు. అని ఎందరో ఎదురుచూశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర వర్గాలకు చెందిన వారు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అదిగో ఇదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఆ ఎప్పటికైనా పింఛన్‌ వస్తుందని ఆశతో  దరఖాస్తుదారులు ఉన్నారు. అయితే ప్రభుత్వం పెన్షన్ల భారం తగ్గించుకోవాలని.. లబ్ధిదారుల సంఖ్య కుదించాలని చూస్తోంది. 


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

అర్హులైనవారు అడిగిన వారంలోపే పెన్షన్‌ ఇస్తామని ప్రకటించిన వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తటంలేదు. రూ.2 వేల పింఛన్‌ను రూ.3 వేలు చేస్తామన్నారు. ఇప్పుడు పింఛన్‌దారుల సంఖ్యను కుదిస్తూ వెళ్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పింఛన్ల చేయూతతో నెట్టుకొస్తున్న వారు ఆ సొమ్ము నిలిపివేయడంతో జీవనం గడిచేది ఎలా అర్థం కాక ఆందోళనకు గురవుతున్నారు. పింఛన్ల సంఖ్య పెరుగుతుందని కొందరు.. ఇప్పటికే తీసుకుంటున్న వారేమో సొమ్ము పెరుగుతుందని ఆశల్లో ఉండగా ప్రభుత్వం వారి ఆశలను నీరుగారుస్తూ పింఛన్‌దారులను కుదించేస్తోంది. ఇప్పటికి జిల్లాలో సుమారు పదివేల మంది పెన్షన్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ జాబితాలను సచివాలయాలకు పంపినట్లు తెలిసింది. ఆగస్టు నెలలోనే వీరికి చాలావరకు పెన్షన్లు నిలిపివేశారు. దీంతో తమకు ఎందుకు పెన్షన్లు రాలేదో తెలియక.. వలంటీర్లను ప్రశ్నిస్తు తెలియదనే సమాధానాలతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పెన్షన్‌ నగదుపైనే కాలంగడిపే వారికి ఆ మొత్తం అందక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. వీరంతా అధికారులు చుట్టూ తిరుగుతూ తమకు పెన్షన్లు కొనసాగించాలని వినతిపత్రాలు అందజేస్తున్నారు. రెండు, మూడు నెలల నుంచి వివిధ మార్గాలలో అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా పెన్షన్ల తొలగింపు జాబితా సిద్ధం చేశారు. జిల్లాలో ఒంటరి మహిళలు, వితంతు, దివ్యాంగులు, అనారోగ్యంతో పెన్షన్లు పొందుతున్న వారి వివరాలను అధికారులు సేకరించారు. ఆయా జాబితాలను జల్లెడపట్టారు. జిల్లాలో 28,029 మంది ఒంటరి మహిళలు పెన్షన్‌ పొందుతుండగా  వారిలో 14,065 మందిపై అధికారులు విచారణ జరిపారు. ఈ ప్రకారం ఒంటరి మహిళల రేషన్‌కార్డుల్లో వారి భర్తల పేరు ఉన్నట్లు.. వారు ప్రతినెలా బియ్యం తీసుకుంటున్నట్లు గుర్తించారు. కుటుంబకలహాలతో దంపతులు విడిగా ఉండటం, విడాకులు తీసుకోకుండా తల్లిదండ్రులు, బంధువులు, సోదరులు వద్ద ఉంటున్న వారికి గతప్రభుత్వం ఒంటరి మహిళ పేరుతో పెన్షన్‌ మంజూరు చేసింది. దీంతో ఇలాంటి వారికి పెన్షన్‌ తొలగిస్తూ రికార్డు తయారు చేశారని తెలిసింది. ఇక జిల్లాలో 2,07,179 మంది వితంతువులు ప్రతినెలా పెన్షన్‌ పొందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చిన్న వయసులోనే భర్త చనిపోయిన మహిళలకు మానవతాధృక్పథంతో పెన్షన్‌ను మంజూరు చేసింది. పిల్లలు ప్రయోజకులై వారు ఆదాయపన్ను పరిధిలోకి వెళ్లినా ఆ తల్లులు వితంతు పెన్షన్‌ పొదుతున్నట్లు ప్రస్తుతం అధికారుల విచారణలో తేలింది. అదేవిధంగా వరుసగా మూడు నెలలు పెన్షన్‌ తీసుకోని వారి పేర్లను కూడా తొలగించారు. 55,111 మంది దివ్యాంగులు, 4,194 మంది రోగులు పెన్షన్లు పొందుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ద్వారా దివ్యాంగుల పెన్షన్లపై వివరాలు సేకరించారు. అదే తరహాలో రోగుల పెన్షన్లపై డీఎంహెచ్‌వో దారా సేకరించారు. దివ్యాంగులకు ఇతర పెన్షన్లు ఉంటే వాటిని తొలగించారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారాన్ని లబ్ధిదారుడి పేరుతో ట్యాగ్‌చేశారు. దీంతో ఆగస్టు నెలలో పెన్షన్‌లు రాని లబ్ధిదారులు డీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.  నరసరావుపేట పట్టణం, మండల పరిధిలో 221, రొంపిచర్ల మండలంలో 247 మందికి పింఛన్లు నిలిపివేశారు. ప్రత్తిపాడు నియోజవకర్గంలోని 700 వరకు పించన్లు ఆపివేశారు. గురజాల నియోజకవర్గ పరిధిలో సెప్టెంబరులో 500లకుపైగా పింఛన్లకు కోత విఽధించారు. 

- బాపట్లపట్టణంలో ఆగస్టు 10లో 6,284 మందికి పెన్షన్లు మంజూరుకాగా సెప్టెంబరుకి ఆ సంఖ్య 6,197కు తగ్గింది. బాపట్ల మండలంలో ఆగస్టులో 9,775 మందికి మంజూరు కాగా ప్రస్తుతం అవి 9,500కు తగ్గింది. కర్లపాలెం మండలంలో 7,375 మందికి పెన్షన్‌లు ఇవ్వాల్సి ఉండగా అందులో 100 మంది అనర్హులుగా ప్రకటించారు. పిట్టలవానిపాలెం మండలంలో 5,396 మందికి ఉండగా అందులో 121 మందికి నిలిపివేశారు.   గత 2, 3 నెలలుగా పెన్షన్‌ తీసుకొని వారి సంఖ్య బాపట్ల నియోజకవర్గంలో 500 మందికిపైగా ఉండగా  వీరిలో కొందరికే ఈ నెల పెన్షన్‌ మాత్రమే అందిస్తున్నారు. 

- వినుకొండ నియోజకవర్గంలో ఈ నెలలో సుమారు 667 పింఛన్లు నిలిపివేశారు. ఈకేవైసీలో వేలిముద్రలు పడకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. బొల్లాపల్లి మండలంలో 200, నూజెండ్లలో 141, శావల్యాపురం 178, ఈపూరు 48, వినుకొండ మండలంలో 100కు పైగా పింఛన్లు తీసివేసినట్లు సమాచారం.

- తాడికొండ మండలంలో సెప్టెంబరులో సుమారు 46 మందికి పింఛన్‌ను నిలిపివేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పనుల నిమిత్తం ఏడెనిమిది మంది కంతేరు గ్రామాలకు వచ్చిన వారికి పింఛన్‌ పోర్టబులిటీని నిలిపివేయటంతో లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-  సత్తెనపల్లి పట్టణంలో ఆగస్టులో 5,999 పింఛన్లు పంపిణీ చేయగా  సెప్టెంబరులో 5909 మాత్రమే పంపిణీ చేశారు. ముప్పాళ్ల మండలంలో ఆగస్టులో 5,607 మందికి ఇవ్వగా సెప్టెంబరులో 5,482 మందికి మాత్రమే  మంజూరయ్యాయి. నకరికల్లు మండలంలో ఆగస్టులో 8457 పింఛన్లు ఇవ్వగా సెప్టెంబరులో 8,234 మందికే పంపిణీ చేశారు. రాజుపాలెం మండలంలో ఆగస్టులో 6068 మందికి ఇవ్వగా సెప్టెంబరులో 5910 మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేశారు.  

- పొన్నూరు మండలం, పట్టణంలో పింఛన్లు 16,808  ఉన్నాయి. ఎంతోకాలం నుంచి పింఛను పొందుతున్న పొన్నూరు 29 వార్డుకు చెందిన షేక్‌ హమిలున్‌ అనే వితంతువుకు  ఆగస్టులో పింఛన్‌ రద్దు చేశారు. ఆధార్‌కార్డులో పేరు మిస్‌ మ్యాచింగ్‌ అయిందని చెప్పి పింఛను సచివాలయ సిబ్బంది రద్దుచేశారని షేక్‌ హమిలున్‌ ఆవేదన వ్యక్తంచేసింది.  

- చిలకలూరిపేట మునిసిపాలిటీలో ఈ నెలలో 198 మంది పెన్షన్లు నిలిచిపోయాయి. మండలంలో 8,098 మంది పెన్షన్లకు ఈ నెలలో 7,957మందికి నగదు మంజూరైంది. నాదెండ్ల మండలంలో 168, యడ్లపాడు మండలంలో  150 మందికి పైగా పెన్షన్లు నిలిచిపోయాయి.


   

Updated Date - 2021-09-06T05:26:05+05:30 IST