వాళ్లకు పింఛన్‌ ఇచ్చారు

ABN , First Publish Date - 2020-02-20T10:02:16+05:30 IST

‘నచ్చినోళ్లకే పింఛన్‌’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో బుధవారం ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులు స్పందించడంతో...

వాళ్లకు పింఛన్‌ ఇచ్చారు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదిలిన యంత్రాంగం
  • అర్హులకు అందని పింఛన్లపై విచారణ
  • సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు
  • బాధితుల ఇళ్లకెళ్లి పింఛను మంజూరు



కడప, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘నచ్చినోళ్లకే పింఛన్‌’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో బుధవారం ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులు స్పందించడంతో జిల్లా అధికారులు బాధితుల ఇళ్లకు పరుగులు పెట్టారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంలోని బాధితుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టాలని కడప జిల్లా అధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి. దీంతో కడప జిల్లా డీఆర్‌డీఏ పీడీ మురళి ఆయా మండలాల ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో విచారణ చేయించారు. అర్హులైన వారికి పింఛన్‌ మంజూరు చేశారు. గాలివీడు మండలం నాయనోరిపల్లెకు చెందిన రంగాని లక్ష్మిదేవి పుట్టకతోనే దివ్యాంగురాలు. మనిషి సాయంలేనిదే కదలేని పరిస్థితి. ఈమెకు 2005 నుంచి వికలాంగుల పింఛన్‌ వస్తోంది. రేషన్‌కార్డు సక్రమంగా లేదని ప్రస్తుతం పింఛన్‌ రద్దు చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ ఆమె ఆవేదనను ప్రచురించింది. గాలివీడు ఎంపీడీవో అయూబ్‌ గ్రామానికి వెళ్లి ఆమె తల్లి శివలక్ష్మితో మాట్లాడారు. పింఛన్‌ మంజూరు చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా.. కదల్లేని స్థితిలో ఉన్నట్లు డాక్టరు సర్టిఫికెట్‌ తీసుకొస్తే రూ.5 వేలు పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. చెన్నూరు మండలం కొండపేటకు చెందిన తాడిగొట్ల చెన్నయ్య (68) ఎన్నో ఏళ్లుగా పింఛన్‌ అందుకుంటున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడి పింఛన్‌ వస్తోందంటూ వృద్ధాప్య పింఛన్‌ రద్దు చేశారు. ఎంపీడీవో మహబూబీ విచారించి పింఛన్‌ మంజూరు చేశారు. ఆ మెసేజ్‌ చూసుకున్న చెన్నయ్య ఆనందంలో మునిగిపోయారు. ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడుకు చెందిన వేమన సీతమ్మకు రద్దు చేసిన పింఛన్‌ తిరిగి ఇస్తామని అధికారులు తెలిపారు. లింగాలకు చెందిన కె.నాగేశ్వరరెడ్డితో పాటు ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన బాధితులందరినీ విచారించి అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్‌ అందేలా చూస్తామని డీఆర్‌డీఏ పీడీ మురళి వివరించారు.

పింఛను రాక.. ఆగిన గుండె

తాడిపత్రి, ఫిబ్రవరి 19: పింఛను రావడం లేదన్న ఆవేదనతో వృద్ధుడి గుండె ఆగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి సీపీఐ కాలనీకి చెందిన షేక్‌ హుస్సేన్‌పీరా (65) బుధవారం గుండెపోటుతో మృతిచెండాడు. హుస్సేన్‌కు 2 నెలల ముందు వరకూ వృద్ధాప్య పింఛను వచ్చేది. వయసులో తేడా ఉందంటూ మున్సిపల్‌ సిబ్బంది ఆయన పింఛన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. పింఛను రావడంలేదన్న బాధ, ఆందోళనతో ఆయన గుండెపోటుకు గురై చనిపోయాడని భార్య బాదాబీ, కుమారుడు షామీర్‌ వాపోయారు. 



Updated Date - 2020-02-20T10:02:16+05:30 IST