ఏడి‘పింఛన్‌’!

ABN , First Publish Date - 2022-08-04T05:13:40+05:30 IST

సామాజిక పెన్షన్ల విషయంలో రాష్ట్ర సర్కారు చిరుద్యోగులకు షాక్‌ ఇచ్చింది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిపై పనిచేసే వారి కుటుంబాల్లోని సామాజిక పింఛన్లను నిలిపేసింది.

ఏడి‘పింఛన్‌’!

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పింఛన్లు కట్‌

   ఈనెల అందించని వైనం 

  పండుటాకులపైనా దయచూపని సర్కారు 

  లబోదిబోమంటున్న లబ్ధిదారులు

  (పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

సామాజిక పెన్షన్ల విషయంలో రాష్ట్ర సర్కారు చిరుద్యోగులకు షాక్‌ ఇచ్చింది.  జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిపై పనిచేసే వారి కుటుంబాల్లోని సామాజిక పింఛన్లను నిలిపేసింది. పండుటాకులపైనా దయ చూపలేదు.  మొత్తంగా  ఈ నెలలో ఏ స్థాయిలో  పింఛన్ల  తొలగించారో నిర్దిష్టంగా తెలియడం లేదు. దీనిపై సంబంధిత అధికారులకూ సమాచారం లేనట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ, మరోవైపు గత నెల వరకు అందించిన పింఛన్లను రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలో కొత్తగా 6,573 పింఛన్లను మంజూరు చేశారు. గత జూలై నెలలో 1,34,747 మందికి పింఛన్లను పంపిణీ చేశారు. వాటితో కలిపి ఈనెలలో మొత్తంగా 1,41,320 పింఛన్లను పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభించారు. అయితే గత నెలలో అందుకున్న వారికి ఈ నెలలో పింఛన్‌ అందలేదు. అనేక గ్రామాల్లో  ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది రేషన్‌కార్డుల్లో పింఛన్‌ లబ్ధిదారులు ఉంటే వారికీ  పెన్షన్‌  నిలిపివేశారు. దీంతో చాలామంది పింఛన్లకు దూరమయ్యారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పింఛన్లను అర్హులై ఉంటే అందించేవారు.  వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. తాజాగా వారి కుటుంబ సభ్యుల పింఛన్‌ రద్దు చేయడంపై   లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలే చాలీచాలని జీతాలతో బతుకు బండిని నెట్టుకొచ్చే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై సర్కారు కత్తి కట్టడం భావ్యం కాదని వారు వాపోతున్నారు. మొత్తంగా సీఎఫ్‌ ఎమ్‌ఎస్‌ ద్వారా జీతాలు పొందుతూ రేషన్‌ కార్డు, ఆధార్‌, ఈకేవైసీ అనుసంధానం కారణంగా చిరుద్యోగుల కుటుంబాల్లోని లబ్ధిదారులకు నష్టం జరుగుతోంది.  ఇదిలా ఉండగా జిల్లాలో అనేక మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులు రేషను కార్డు నుంచి తొలగింపులు చేసుకుంటున్నారు. వేరేగా రేషన్‌కార్డులు పొందుతున్నారు. దీంతో తల్లిదండ్రులకు ఒక కార్డు, పిల్లలకు ఇతర కార్డులు ఉంటున్నాయి. ఇలాంటి వ్యక్తులకు సామాజిక పింఛను అందుతోంది. అమాయకులైన వారి కుటుంబాల్లో మాత్రం నష్టపోతున్నారు.

 ప్రతి ఆరు నెలలకు ... 

ప్రభుత్వం అందిస్తున్న  పింఛన్లపై ఆరు నెలలకు ఒకసారి ఆరు దశల తనిఖీ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. కొత్త పింఛన్ల మంజూరు సమయంలో అప్పటివరకు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల వివరాలను సేకరించి వడపోసే కార్యక్రమాన్ని చేపడుతుంది. ఆదాయ పరిమితి, విద్యుత్‌ వినియోగం, భూమి, ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయ పన్ను చెల్లింపు, పట్టణ ప్రాంతాల్లో ఇంటి విస్తీర్ణం, తదితర వివరాలను క్షుణ్నంగా తనిఖీ చేసి ఏ మాత్రం అనుమానం ఉన్నా పక్కన పెడుతుంది. తాజాగా వడపోత కార్యక్రమం నిర్వహించి భారీగా పింఛన్‌ లబ్ధిదారులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. గత నెలలో అందుకున్న వారిలో అనేకమందికి ఈ నెలలో పింఛన్లు అందించలేదు. చివరి వరకు ఈ విషయం గ్రామ, వార్డు వలంటీర్లకు కూడా తెలియని పరిస్థితి.   ఈ నెల 1వ తేదీ నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా కొన్ని సచివాలయాల పరిధిలో పింఛను అందుకున్న లబ్ధిదారుల పేర్లు యాప్‌లో కనిపించలేదు. దీంతో గత నెల వరకు అందిన పింఛన్లు ఇప్పుడు ఎందుకు నిలిపివేశారని లబ్ధిదారులు వలంటీర్లను ప్రశ్నిస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 17 రకాల పింఛన్లను అందిస్తుండగా, నిలిపివేసిన వాటిల్లో వితంతు పింఛన్లు ఎక్కువగా ఉన్నాయి.  మరోవైపు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పింఛన్‌ కట్‌ చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

 కొన్నిచోట్ల ఇలా..   

  పార్వతీపురానికి చెందిన ఎస్‌.జయమ్మ ఐదేళ్లుగా పింఛన్‌ను అందుకుంటోంది. ఆమె కొడుకు  ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నందున ఈనెలలో ఆమెకు పింఛన్‌ అందించలేదు.  

  పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన చుక్క జయమ్మకు గత కొన్నేళ్లుగా వితంతు పింఛను అందుతుంది. ఆమె కుమారుడు శివ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్నాడన్న కారణంతో ఆమెకు ఈనెల పింఛన్‌ నిలిపివేశారు.

  పార్వతీపురం పట్టణానికి చెందిన  బొద్దల కృష్ణ అనే దివ్యాంగుని కుమారుడు స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తుండడంతో ఈ నెల పింఛన్‌ అందించలేదు. 

  జియ్యమ్మవలస మండలం ఎం.అల్లువాడ గ్రామానికి చెందిన బొంగు అన్నపూర్ణమ్మ కుమారుడు బి.కాశీనాయుడు కురుపాం పీఐయూ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తుండడంతో పింఛన్‌ నిలిపివేశారు.

   కురుపాం వాసులు రాయిపిల్లి సన్యాసి, పంట్ల తవిటమ్మ పిల్లలు హౌసింగ్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నందుకు ఈ నెల వారికి పింఛన్లు అందించలేదు. 

   భామినికి చెందిన గిరిజనుడు పాలక లక్షుమయ్య కుమారుడు ఉపాధి హామీ పథకంలో ఔట్‌సోర్సింగ్‌లో శ్రీకాకుళంలో విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో ఈ నెల ఆయనకు పింఛన్‌ నిలిపేశారు. 

  సాలూరుకు చెందిన కునిబిల్లి గౌరీ కొడుకు శంకరరావు మున్సిపల్‌ కార్యాలయంలో కాంట్రాక్టు ప్రతిపాదికన పనిచేస్తుండడంతో ఆమెకు ఈనెల పెన్షన్‌ అందించలేదు. 

  సాలూరు మండలం ఖరాసవలసకు చెందిన కొర్ర తారకేశు కుమార్తె కేజీబీవీలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిపై కుక్‌ సహాయకురాలిగా పనిచేస్తుండడంతో ఆయనకు వృద్ధాప్య పింఛన్‌ను ఇవ్వలేదు. 

  బొడ్డవలస బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న పలువురు వితంతవులు,  వారి కుటుంబ సభ్యుల్లో కొందరికి పింఛన్లు నిలిపివేసినట్లు బాధితులు చెబుతున్నారు. 

 

 రద్దు విషయం తెలియదు

 గత నెల అందుకున్న వారికి ఈ నెల పింఛను రద్దు చేసినట్లు మాకు ఎటువంటి సమాచారం లేదు. ఈ విషయాలు మా దృష్టికి వచ్చేవి కావు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులందరికీ ప్రతి నెల పింఛన్‌ను అందిస్తున్నాం. నిబంధనల ప్రకారం పింఛన్లు మంజూరు జరుగుతుంది.

- సత్యంనాయుడు, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ


  

Updated Date - 2022-08-04T05:13:40+05:30 IST