వేతనాలకు.. పడిగాపులు

ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST

వేతన జీవుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచనుగా వేతనాలు అందుకునే వారికి ఒకటో తేదీ వేతనమనేది కలగా మారిపోయింది.

వేతనాలకు.. పడిగాపులు

కలగా మారిన ఒకటో తేదీ పంపిణీ

వారం తరువాత అందిన ప్రభుత్వోద్యోగుల వేతనాలు

వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి ఒకటో తేదీ పంపిణీ

మరింత దయనీయంగా పెన్షనర్ల పరిస్థితి 

ఒకటో తేదీన వచ్చి ఏళ్లు గడిచిందని ఆవేదన

ప్రతినెలా 75 వేల మంది ఎదురు చూపులు


  అనారోగ్యంతో బాధపడుతున్న ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రతి నెలా వైద్యపరీక్షలు చేయించుకోవాలి. మందులు తీసుకోవాలి. అతడి భార్యదీ అదే పరిస్థితి. ఈనెల 8వ తేదీ వరకూ అతడికి పెన్షన్‌ రాలేదు. దీంతో వైద్య పరీక్షలకు డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అప్పు కోసం చేయి చాచాల్సి వచ్చింది. 

 ఒక ప్రభుత్వ ఉద్యోగి గృహరుణ చెల్లింపుల కింద ప్రతి నెలా ఒకటో తేదీన రూ.30 వేలు చెల్లించాలి. మరో ఉద్యోగి ఈఎంఐ కింద రూ.10వేలు చెల్లించాలి. కానీ ఈనెల 8వ తేదీ వరకూ ప్రభుత్వం వేతనం ఇవ్వలేదు. ఈఎంఐలు, గృహరుణ చెల్లింపులు పీకల మీదకు రావడంతో వారు రూ.4 రూపాయల వడ్డీకి అప్పు చేయాల్సి వచ్చింది. ఇది ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితో కాదు. జిల్లాలో ఉన్న 75 వేల మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి ఇదే!


గుంటూరు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): వేతన జీవుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రతి నెలా ఒకటో తేదీన ఠంచనుగా వేతనాలు అందుకునే వారికి ఒకటో తేదీ వేతనమనేది కలగా మారిపోయింది. ఆగస్టు 1న అందాల్సిన జూలై నెల వేతనం 8వ తేదీ దచ్చే వరకూ వారు కళ్ల చూడలేకపోయారు. కాగా విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటోంది. ఒకటో తేదీ పెన్షను కళ్లజూసి ఏళ్లు గడిచిపోయాయని వారు వాపోతున్నారు. సకాలంలో వేతనాలు రాని కారణంగా వారు పడరాని పాట్లు పడుతున్నారు. 

ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఉద్యోగులకు ఒకటో తేదీన ఇవ్వాల్సిన వేతనాలను ప్రభుత్వం ఇవ్వకపోగా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ఒకటో తేదీన ఇస్తుండడం ఉద్యోగులకు పుండుమీద కారంలా పరిణమిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇటీవల ఉద్యోగాలు క్రమబద్దీకరణ కావడంతో మరో 10 వేల మంది సచివాలయ ఉద్యోగులు వీరికి జతకలిశారు. అయితే వీరికి ఒకటో తేదీనే ప్రభుత్వం వేతనాలు వేసింది. వలంటీర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని కూడా 5వేల నుంచి రూ.5,200కు పెంచి ఒకటో తేదీనే అందజేసింది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం వేతనాలు ఇవ్వలేదు. ప్రనినెలా 25వ తేదీకల్లా ఆ నెలకు సంబంధించిన వేతనాల బిల్లులను డ్రాయింగ్‌ అధికారులు ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తారు. ట్రెజరీ కార్యాలయంలో కూడా జూలై 28కల్లా వేతన బిల్లులన్నీ ఆమోదం పొందాయి. కానీ ఒకటో తేదీ మాత్రం వేతనాలు ఉద్యోగులకు దక్కలేదు.


39 వేల మంది విశ్రాంత ఉద్యోగులు..

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 39 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వారిలో 90 శాతం మంది వయోభారం, అనారోగ్యాల కారణంగా పని చేయలేని స్థితిలో ఉన్నారు. వారంతా పెన్షన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఒకటో తేదీన వచ్చే పెన్షన్‌ కోసం ఎదురు చూస్తుంటారు.    ఒకటో తేదీ వచ్చేసరికి ప్రభుత్వోద్యోగుల ముందు చాలా సమస్యలు వచ్చి నిల్చుంటాయి. నెలవారీ ఈఎంఐలు, గృహ రుణాల చెల్లింపులు, ఇంటి అద్దెలు, ఫైనాన్సులు, పాల బకాయిలు వంటి పలు చెల్లింపులు ఒకటో తేదీకల్లా ఉద్యోగుల ముందుకు వస్తాయి. వేతనాలు పడ్డాయా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా వాటిని చెల్లించాల్సి వస్తోంది. చేసేది లేక అధిక వడ్డీకి అప్పులు తెచ్చిమరీ వాటిని చెల్లించాల్సి వస్తోంది. 

 

ఒకటో తేదీ వేతనం కలగా మారింది.

ఒకటో తేదీ వేతనం అనేది కలగా మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్లు మాత్రమే మాకు ఒకటో తేదీ వేతనం పడింది. ఆర్థిక సమస్యలను సాంకేతిక సమస్యలుగా చూపుతూ ప్రభుత్వం కాలం నెట్టుకొస్తోంది. కానీ ఉద్యోగులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా ఒకటో తేదీకల్లా వేతనాలు ఇవ్వాలి.

 - సతీష్‌. ఏపీఎన్‌జీవో సంఘం జిల్లా కార్యదర్శి గుంటూరు


వైద్య అవసరాలకు కూడా ఇబ్బంది పడుతున్నారు..

నూటికి 70 మంది విశ్రాంత ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షనే ఆధారం. నాలుగు మెతుకులు తినాలన్నా, అవసరమైన వైద్యం చేయించుకోవాలన్నా వారికి పెన్షనే ఆధారం. కానీ ఒకటో తేదీన పెన్షన్‌ వచ్చి చాలా కాలం అయింది. సకాలంలో డబ్బులు రాక సరైన వైద్యాన్ని కూడా పొందలేని స్థితిలో పెన్షనర్లు ఉన్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకునైనా ఒకటో తేదీ పెన్షన్లు ఇవ్వాలి.

- వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

 


 

Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST