పింఛన్‌ నా ఇష్టం వచ్చినప్పుడిస్తా..

ABN , First Publish Date - 2022-07-04T08:26:16+05:30 IST

పింఛన్‌ నా ఇష్టం వచ్చినప్పుడిస్తా..

పింఛన్‌ నా ఇష్టం వచ్చినప్పుడిస్తా..

అసలు ఇవ్వను.. దిక్కున్నచోట చెప్పుకో పో

వితంతువుపై వలంటీర్‌ చిందులు.. బంధువులతో కలిసి దాడి..

బుక్కరాయసముద్రం, జూలై 3: భర్త చనిపోవడంతో అతికష్టమ్మీద జీవనం సాగిస్తున్న ఓ వితంతువు తనకు రావాల్సిన పింఛన్‌ సొమ్ము అడగడమే ఆమె నేరమైంది. సావధానంగా సమాధానం చెప్పాల్సిన ఆ వలంటీర్‌ ‘‘నా ఇష్టం వచ్చనప్పుడు ఇస్తాను.. అస్సలు ఇవ్వను.. నీ దిక్కున్న చోట చెప్పుకో పో..’’ అంటూ బెదిరించింది. బంధువుతో కలిసి దౌర్జన్యానికి దిగింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని పొడరాళ్ల గ్రామంలో ఆదివారం జరిగిన ఈ దాడికి సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొడరాళ్లకు చెందిన కడవకల్లు రమాదేవి టీడీపీ సానుభూతిపరురాలు. భర్త నాలుగేళ్ల క్రితమే చనిపోయారు. టీడీపీ హయాం నుంచి ఆమెకు వితంతు పింఛన్‌ అందుతోంది. కొంతకాలంగా ఆమెకు సకాలంలో పింఛన్‌ అందడంలేదు. ఈనెల 1న కూడా ఇవ్వలేదు. అదే రోజు సాయంత్రం వలంటీర్‌ను ప్రశ్నించింది. ఆగ్రహించిన వలంటీర్‌.. ‘నా ఇష్టం వచ్చినపుడు ఇస్తా... అస్సలు పింఛనే ఇవ్వను.. పో.. నీకు దిక్కున్న చోట చెప్పుకో...’ అంటూ చిందులేసింది. దీంతో బాధితురాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ ఈ నెల 2న సాయంత్రం వచ్చి రమాదేవికి ఫించన్‌ సొమ్ము అందజేశారు. దీనిని వలంటీర్‌ కుటుంబీకులు జీర్ణించుకోలేకపోయారు. ఆదివారం సాయంత్రం వలంటీర్‌, ఆమె తండ్రి రోశయ్య, బంధువులు సాయి, భాస్కర్‌, హనుమంతు, లక్ష్మక్క.. ఇంటి వద్దనున్న రమాదేవిపై కర్రలతో దాడికి దిగారు. అడ్డుకోబోయిన రమాదేవి కుమార్తె సరస్వతి, బంధువులు రాజు, చంద్రమోహన్‌పైనా విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువర్గాలపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రమాదేవి, ఆమె బంధువులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైసీపీ నాయకులు.. పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. వారు కులం పేరుతో దూషించారని వలంటీర్‌ కుటుంబసభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-07-04T08:26:16+05:30 IST