ఎన్నాళ్లో వేచిన పింఛన్‌!

ABN , First Publish Date - 2022-08-10T10:08:14+05:30 IST

ఎన్నాళ్ల నుంచో ఆసరా పింఛను కోసం వేచి చూస్తున్న అర్హులకు.. సీఎం కేసీఆర్‌ ఇటీవల చేసిన ప్రకటన ఊరనిచ్చింది.

ఎన్నాళ్లో వేచిన పింఛన్‌!

సీఎం ప్రకటనతో ఆసరాపై ఆశలు..10,90,553 మంది నిరీక్షణ


హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నాళ్ల నుంచో ఆసరా పింఛను కోసం వేచి చూస్తున్న అర్హులకు.. సీఎం కేసీఆర్‌ ఇటీవల చేసిన ప్రకటన ఊరనిచ్చింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో 10 లక్షల మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి  చేసిన ప్రకటనతో 10,90,553 మంది దరఖాస్తుదారుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామన్న సీఎం ప్రకటనకు అనుగుణంగా ఈ నెలాఖరు నాటికి అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆసరా కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఈ నెలలోనే తమకు పింఛను మంజూరవుతుందని ఆశిస్తుండగా.. అధికారులు మాత్రం దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛను అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో.. 2021లో 57-65 మధ్య వయసువారు 7,98,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతకుముందు నాలుగేళ్ల క్రితం 65 ఏళ్లు పైబడిన వయసువారు, ఇతరులు ఆసరా పింఛను కోసం దరఖాస్తు చేశారు. వీటిలో 2,92,553 మంది దరఖాస్తులు గతంలోనే ఆమోదం పొందాయి. వీరిలో వృద్ధాప్య పింఛన్లు (65 ఏళ్లు పైబడినవారు) 62,500 మంది, దివ్యాంగులు 54,000, వితంతువులు 1,40,530, ఒంటరి మహిళలు 16500, నేత కార్మికులు 3,356, గీత కార్మికులు 6,300, బీడీ కార్మికులు 5640, పైలేరియా బాధితులు 3,727మంది ఉన్నారు.


వీరిని పింఛనుకు అర్హులుగా గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా స్థాయిలో అధికారులు ఆమోదించారు. అయినా రాష్ట్ర స్థాయిలో పింఛను మంజూరు నిలిచిపోయింది. అర్హత వయసు తగ్గింపుతో వచ్చిన దరఖాస్తులతో కలిపి మొత్తం 10,90,553 మంది పింఛను కోసం ఎదురుచూస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నపుడు ఆధార్‌, రేషన్‌కార్డు, ఇతర ధ్రువ పత్రాలను సమర్పించామని.. వయసు, కుటుంబ పరిస్థితులన్నీ ఆధార్‌ నంబర్‌ ఆధారంగానే తెలిసిపోతాయని దరఖాస్తుదారులు గుర్తు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయి పరిశీలనంటూ కాలయాపన చేయడమెందుకని ప్రశ్నిస్తున్నారు. ఆసరా లబ్ధిదారుల్లో మరణించిన వారి స్థానంలో కొత్తగా మంజూరు చేయడంలేదు. ఆసరా పింఛను పొందుతున్న వ్యక్తి (భర్త గానీ, భార్య గానీ) చనిపోతే ఆ స్థానంలో కుటుంబంలో మరొకరికి పింఛను రావాల్సి ఉండగా.. దానిపై ప్రభుత్వం ఇప్పటిదాకా దృష్టి పెట్టలేదని, ఈ దఫా వాటినీ మంజూరు చేయాలని అర్హులు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-10T10:08:14+05:30 IST