పింఛన్‌..టెన్షన్‌!

ABN , First Publish Date - 2020-06-06T10:00:04+05:30 IST

ఇలా రకరకాల కొర్రీలతో జిల్లాలో వందలాది మంది వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందడం లేదు

పింఛన్‌..టెన్షన్‌!

నిబంధనల పేరిట వందలాది మంది అర్హుల పింఛ న్ల కోత

ఏ ఆసరా లేనివారికీ అందని వైనం

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం


ఏడు పదుల వయసు దాటిన ఈమె పేరు బిడ్డిక గౌరమ్మ. కొమరాడ మండలం బంజుకుప్ప   గ్రామ వాసి. నా అన్నవారు లేరు. ఒంటరి మహిళగా ఉన్న ఆమెకు గ్రామస్థులే కలో గంజో పెడుతుంటారు. కనీసం వృద్ధాప్య పింఛన్‌ కూడా రావడం లేదు.  కళ్లు లేని కారణంగా ఆధార్‌ కార్డు మంజూరు కాదని అధికారులు తేల్చేశారు. ఆధార్‌ అనుసంధానం కాకపోవడంతో ఉన్న రేషన్‌కార్డు రద్దయ్యింది. ఆధార్‌, రేషన్‌కార్డులు లేకపోవడం  పింఛన్‌  మంజూరుకు అడ్డంకిగా మారాయి. 


ఈయన పేరు పాటూరు రవి. పుట్టుకతోనే దివ్యాంగుడు. అవివాహితుడు కావడంతో విజయనగరం మండలం కొండకరకాంలో తన సోదరి వద్ద ఆశ్రయం పొందుతున్నాడు. రెండేళ్లుగా రేషన్‌కార్డు, పింఛన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు..కానీ మంజూరు కావడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు.



(విజయనగరం, ఆంధ్రజ్యోతి) 

...ఇలా రకరకాల కొర్రీలతో జిల్లాలో వందలాది మంది వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందడం లేదు. నెలల తరబడి వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోంది.  జిల్లాలో 3,21,355 మందికి సామాజిక పింఛన్లు అందుతున్నాయి. ఇందులో వికలాంగ పింఛన్లు 40,712 ఉన్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, వారి స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ ఏడాది జనవరిలో వలంటీర్లు నవశకం పేరిట ఇంటింటా సర్వే చేపట్టారు. ఈ సమయంలో కొన్ని తప్పిదాలు జరిగాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు తరువాత కొంతమంది పింఛన్లు రద్దు కావడం..ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తిరిగి వాటిని పునరుద్ధరించింది.


ఈ క్రమంలో అప్పటివరకూ పింఛన్లు అందుకున్న చాలామందికి రకరకాల కారణాలు చూపుతూ నిలిపివేశారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడని...ఆదాయపు పన్ను కడుతున్నారని..భూమి ఎక్కువగా ఉందని..ఇలా నిబంధనల పేరిట నిలిపివేశారు. వాస్తవంగా చాలామంది అర్హులు సైతం పింఛన్లు కోల్పోయారు. వారంతా ఇప్పుడు పునరుద్ధరణకు ఎదురుచూస్తున్నారు. 


ఒంటరి మహిళలకూ...

గత ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలకు పింఛన్లు మంజూరయ్యాయి. నా అన్నవారి ఆదరణ లేనివారు, వివిధ కారణాలతో వివాహం చేసుకోనివారు, వైకల్యంతో బాధపడుతూ వైవాహి జీవితానికి నోచుకోనివారు...ఇలా ఒంటరి జీవితం గడుపుతున్న మహిళలపై గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీరి కోసం ప్రత్యేకంగా పింఛను పథకాన్ని ప్రవేశపెట్టి ఆదుకుంది. కానీ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం చాలావరకూ ఒంటరి మహిళలకు రకరకాల కారణాలు చూపుతూ నిలిపివేసింది. దీంతో నెలల తరబడి వారు పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి ఆలసిపోయారు. పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో వారిలో నిరాశ అలముకుంది. 


దివ్యాంగులకు కష్టాలు

దివ్యాంగుల పరిస్థితి మరీ ఘోరం. సాంకేతిక కారణాలతో వారికి పింఛన్‌ అందకుండా పోతోంది. పింఛనుకు సదరం సర్టిఫికెట్‌ తప్పనిసరి చేయడంతో చాలామంది వ్యయప్రయాసలకోర్చి పొందారు. కానీ ఇందులో వైకల్య శాతాన్ని ప్రామాణికంగా తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంధులు ఆధార్‌ కార్డు పొందలేకపోతున్నారు. ఆధార్‌ అనుసంధానం కాకుంటే రేషన్‌కార్డు రద్దవుతోంది. అటు ఆధార్‌, ఇటు రేషన్‌కార్డు లేకుండా పింఛన్‌ మంజూరు కావడం లేదు. ఇటువంటి వారి విషయంలో వందలాదిగా ఫిర్యాదులు, వినతిపత్రాలు వస్తున్నా సమస్యకు పరిష్కార మార్గం చూపలేని స్థితిలో అధికారులు ఉన్నారు. 

Updated Date - 2020-06-06T10:00:04+05:30 IST