మళ్లీ అదే పని చేస్తున్న వైసీపీ ప్రభుత్వం!

ABN , First Publish Date - 2021-09-14T04:54:26+05:30 IST

నెల తిరగకుండానే..

మళ్లీ అదే పని చేస్తున్న వైసీపీ ప్రభుత్వం!

పెన్షన్.. టెన్షన్!

ఆరంచెల మూల్యాంకనం ఎన్నిసార్లు చేస్తారు!

పింఛన్లు, సంక్షేమ పథకాల్లో కోత పెట్టేందుకే..

మనోవేదనలో పింఛను లబ్ధిదారులు 


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ఆరు అంచెల మూల్యాంకనం పేరుతో నిరుపేదలకు వైసీపీ ప్రభుత్వం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నవరత్నాల పేరుతో ఈ ప్రక్రియని వలంటీర్ల ద్వారా పూర్తి చేయించిన ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు అదే పని చేస్తోంది. కరోన కారణంగా ఏడాదిన్నర నుంచి ప్రతీ ఒక్కరి ఆర్థిక స్తోమత దిగజారింది. ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా మీకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయంటూ సంపన్నులుగా చిత్రీకరించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంతిమంగా సంక్షేమ పథకాల్లో భారీగా లబ్ధిదారులను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకొన్నట్లు స్పష్టమవుతోంది. వలంటీర్లు తమ క్లస్టర్‌ పరిధిలో సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మీ పేరు మీద విద్యుత్‌ కనెక్షన్లు చాలా ఉన్నాయి, పొలం, నివేశన స్థలం ఎక్కువ విస్తీర్ణంలో ఉంది, మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు, మీ పేరు మీద నాలుగు చక్రాల సొంత వాహనం ఉంది అంటూ ఏవేవో చెబుతూ బెదరగొడుతున్నారు.


దీంతో ఎక్కడ తమ పెన్షన్లు నిలిచిపోతాయోనని పండుటాకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. తాజాగా నగరంలోని నల్లపాడు రోడ్డులోని ఒక వృద్ధురాలి నివాసానికి వలంటీర్‌ వెళ్లారు. ఆమె మిర్చి తొడాలు తీసుకొంటూ ఇంటి వద్దనే జీవిస్తుంటారు. అలాంటిది ఆమె పేరు మీద 12 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయని చెప్పి మీ పెన్షన్‌ నిలిచిపోయే అవకాశం ఉందని బెదిరించారు.  


75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇచ్చిన సందేశంలో అన్ని పింఛన్లు కలుపుకొని ప్రతీ నెల 5 లక్షల 85 వేల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. తద్వారా రూ.140.34 కోట్లు వారికి చెల్లిస్తున్నామన్నారు. ఇది జరిగి కనీసం నెల కూడా తిరగకుండానే ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పెన్షన్‌ పంపిణీ నివేదికలో గుంటూరు జిల్లాకు సంబంధించి అన్ని కలుపుకొని 5,69,351 మాత్రమే ఉన్నాయని పేర్కొంది. వారికి ఈ నెల రూ.128.83 కోట్లు చెల్లించినట్లుగా నివేదించింది.


నెలలోనే రూ. 11.51 కోట్లు కోత

నెల తిరగకుండానే అవ్వా తాతల పింఛన్లను నిలిపేసిన వైసీపీ ప్రభుత్వం దాదాపుగా రూ.11.51 కోట్ల కోత విధించింది. సాయం చేసే విషయంలో తాను పది అడుగులు ముందుకేస్తానని పదేపదే డాంబీకాలు పలికే సీఎం జగన్‌ ఈ విధంగా జిల్లాలో పెన్షన్లు కోత విధించడంపై ఏమి సమాధానం చెబుతారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఏరివేత కార్యక్రమం ప్రారంభించి జిల్లాలో 15,649 పింఛన్లు లేపేయడం ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందన్న మాటలు ఒట్టిమాటలేనని తేలిపోయేలా చేస్తున్నాయి. 

Updated Date - 2021-09-14T04:54:26+05:30 IST