పింఛన్‌.. ముంచెన్‌!

ABN , First Publish Date - 2020-06-05T10:33:35+05:30 IST

అది ప్రభుత్వ నిబంధనో లేక సాంకేతిక సమస్యో తెలియదు కానీ ఆ ప్రభావం మాత్రం పేదలపై పడింది.

పింఛన్‌.. ముంచెన్‌!

ఒక్క రోజులోనే క్లోజ్‌ అయిన సర్వర్‌

13,682 మందికి అందని నగదు

డయాలసిస్‌ రోగుల అవస్థలు


నెల్లూరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : అది ప్రభుత్వ నిబంధనో లేక సాంకేతిక సమస్యో  తెలియదు కానీ ఆ ప్రభావం మాత్రం పేదలపై పడింది. ప్రతి నెలా మూడు రోజుల పాటు ఇస్తున్న సామాజిక పింఛన్లను ఈ నెల ఒక్క రోజు మాత్రమే పంపిణీ చేయడంతో వేల మంది పింఛన్‌ అందుకోలేకపోయారు. ఒకటో తేదీ రాత్రి పది గంటలకే సర్వర్‌ క్లోజ్‌ అయినట్లు క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్ల లబ్ధిదారులు 3,37,045 మంది ఉండగా  3,23,363 మందికే పింఛన్లు పంపిణీ చేశారు. ఇంకా 13,682 మందికి పింఛను అందాల్సి ఉంది. వారిలో డయాలసిస్‌ రోగులు కూడా ఉన్నారు. ఒకటో తేదీన డయాలసిస్‌ కోసం ఆసుపత్రులకు వెళ్లడంతో ఆ రోజు పింఛన్‌ తీసుకోలేకపోయారు.


వీరికి నెలకు రూ.10 వేలు అందుతుంది. అయితే ఒక నెల తీసుకోకపోతే మిగిలిన పింఛన్ల మాదిరిగా తర్వాతి నెలలో ముందు నెల పింఛన్‌ను కలిపి ఇవ్వరు. ప్రస్తుతం పింఛను అందకపోవడంతో వారు నానా కష్టాలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు మరో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీనిపై డీఆర్డీఏ పీడీ శీనానాయక్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ పింఛన్ల సర్వర్‌ క్లోజ్‌ అయిపోతే వచ్చే నెలలోనే పింఛన్‌ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

Updated Date - 2020-06-05T10:33:35+05:30 IST