దళితురాలని పింఛన్‌ ఆపేసి.. దూషించి..

ABN , First Publish Date - 2020-08-07T10:04:34+05:30 IST

ఫోన్‌ డేటాలో చనిపోయినట్లు చూపి 4 నెలల నుంచి పింఛన్‌ రాకుండా వలంటీర్‌ ఇబ్బంది పెడుతున్నాడంటూ జిల్లాలోని ..

దళితురాలని పింఛన్‌ ఆపేసి.. దూషించి..

పెదపారుపూడి, ఆగస్టు 6 : ఫోన్‌ డేటాలో చనిపోయినట్లు చూపి 4 నెలల నుంచి పింఛన్‌ రాకుండా వలంటీర్‌ ఇబ్బంది పెడుతున్నాడంటూ   జిల్లాలోని పెదపారుపూడి మండలం అప్పి కట్ల దళితవాడకు చెందిన 72 ఏళ్ల జుజ్జవరపు కోటేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.  కోటేశ్వ రమ్మ ఆవేదన ఆమె మాటల్లో... భర్త రాఘవులు 20 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్‌ వస్తోంది. ఇటీవల వచ్చిన వలంటీర్ల వ్యవస్థతో ఇంటి వద్దకే పింఛన్‌ వస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఆనందించాను. అయితే ఆ ఆనందం కొద్ది రోజుల్లోనే ఆవిరైంది. గ్రామానికి చెందిన వలంటీరు ‘నువ్వు మా ఇంటికి వస్తేనే పింఛన్‌ఇస్తాను, మీ దళితవాడకు వచ్చి పింఛన్‌ ఇవ్వను’ అని చెప్పాడు.


నేను రాలేననీ, ఆరోగ్యం సహకరించడం లేదనీ, చెప్పినా వినలేదు. అదేమిటని ప్రశ్నిస్తే ‘నీ పేరు 50 కుటుంబాల లిస్ట్‌లోకి వచ్చింది. నీ కుటుంబం వేరొక వలంటీరు చూసుకోవాలి. నాకు సంబంధం లేదు’ అని సమాధానం చెప్పాడు. పింఛన్‌ ఇవ్వకపోగా కులం పేరుతో దూషించాడు.  ఆరా తీస్తే మే 23వ తేదీన చనిపోయినట్లు ఉంది. బతికి ఉన్న నన్ను చంపేశాడు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ జోక్యం చేసుకొని పింఛన్‌ వచ్చేలా చూడాలని ఆమె కోరారు. ఆధార్‌ నెంబర్‌ 6127 4949 7194, పెన్షన్‌ ఐడి నెంబరు 106289405, రేషన్‌ కార్డు నెంబరు డబ్ల్యూఎపీ 064000800470పై ఎమ్డీవో యుద్దనపూడి రామకృష్ణను వివరణ కోరగా పింఛన్‌ రద్దుపై విచారణ కమిటీ వేశామని వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2020-08-07T10:04:34+05:30 IST