పెందుర్తి జంక్షన్‌.. ట్రాఫిక్‌ టెన్షన్‌

ABN , First Publish Date - 2020-12-04T05:37:04+05:30 IST

పెందుర్తి జంక్షన్‌లో వాహనాల రద్దీ ఎక్కువైంది. అడుగడుగునా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

పెందుర్తి జంక్షన్‌.. ట్రాఫిక్‌ టెన్షన్‌
పెందుర్తి జంక్షన్‌లో బారులు తీరిన వాహనాలు

నిత్యం వందలాది భారీ వాహనాల రాకపోకలు

కూడలి నలువైపులా వాహనాల పార్కింగ్‌తో అవస్థలు

అస్తవ్యస్త ట్రాఫిక్‌తో తరచూ ప్రమాదాలు


పెందుర్తి, డిసెంబరు 3: పెందుర్తి జంక్షన్‌లో వాహనాల రద్దీ ఎక్కువైంది. అడుగడుగునా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ఆనందపురం- విశాఖ మార్గంలో ఫ్రీలెఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఆక్రమణలు చోటుచేసుకోవడంతో ట్రాఫిక్‌ సమస్య యథాతథంగా ఉంది. పెందుర్తి నాలుగు రోడ్ల కూడలి మీదుగా నిత్యం వందల సంఖ్యలో  భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. విజయవాడ నుంచి కోల్‌కతా వెళ్లేందుకు పెందుర్తి ప్రధాన మార్గం కావడంతో ఈ జంక్షన్‌ మీదుగా వందల సంఖ్యలో భారీ లారీలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే విశాఖ నుంచి అరకు చేరుకునేందుకు పెందుర్తి మీదుగానే వెళ్లాల్సి ఉండడంతో రద్దీగా ఎక్కువగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటుంది.


పార్కింగ్‌ సదుపాయం లేక..

పెందుర్తి జంక్షన్‌లో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా ఉండడానికి పలు కారణాలు ఉన్నాయి. ఈ జంక్షన్‌ నుంచి అనకాపల్లి, పెందుర్తి, కొత్తవలస రహదారి రెండు వైపులా చెరువు విస్తరించి ఉండడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంలో పార్కింగ్‌ ప్రదేశం లేకపోవడంతో రహదారిపైనే వాహనాలను నిలిపి వేస్తుంటారు. అలాగే పెందుర్తి కూడలిలో గల వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, కొన్ని దుకాణాలకు పార్కింగ్‌ సదుపాయం లేదు. దీనికి తోడు నాలుగురోడ్ల కూడలి నలువైపులా రహదారిపైనే కొందరు వ్యాపారాలు చేస్తున్నారు. అంతేకాకుండా తోపుడుబండ్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. 


తరచూ ప్రమాదాలు

పెందుర్తి జంక్షన్‌ నిత్యం రద్దీగా ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నలువైపులా గల రహదార్లపై గజానికో గొయ్యి ఉండడంతో ద్విచక్ర వాహనచోదకులు అదుపుతప్పి పడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు. పెందుర్తి- విశాఖ మార్గంలో బస్‌ షెల్టర్‌ లేకపోవడంతో రహదారిపైనే బస్సుల కోసం వేచి ఉంటున్నారు. ఈ జంక్షన్‌లో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా ఉండడంతో ఇటుగా ప్రయాణించే వారు భయాందోళనకు గురవుతున్నారు. పోలీస్‌ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ జంక్షన్‌లో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-12-04T05:37:04+05:30 IST