పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి: సీఐటీయూ

ABN , First Publish Date - 2022-08-20T06:01:37+05:30 IST

స్వచ్ఛ భారత్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి: సీఐటీయూ
ఆత్మకూరులో మాట్లాడుతున్న సీఐటీయూ నాయకుడు

నంద్యాల టౌన్‌, ఆగస్టు 19: స్వచ్ఛ భారత్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం డిమాండ్‌ చేశారు. నంద్యాలలోని సీపీఎం జిల్లా కార్యాలయంలోని నరసింహాయ్య భవన్‌లో శుక్రవారం రామాంజనేయులు అధ్యక్షతన సీఐటీయూ జిల్లా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఏసురత్నం మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ పనిచేస్తున్న స్వచ్ఛ భారత్‌ కార్మికులకు వేతనాలను రెగ్యులర్‌గా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో అల్లాడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. 1999లోనే స్వచ్ఛ భారత్‌ కార్మికులకు గుర్తింపు కార్డులు, కనీస వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం అమలు చేస్తూ జీవో నెంబర్‌ 551ని ప్రభుత్వం జారీ చేశారని, అయితే నేటికీ ఆ జీవో అమలు కాలేదని అన్నారు. కార్మికులను కష్టాల పాలు చేసి, ఉద్యోగ భద్రత లేకుండా పాలక ప్రభుత్వాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈనెల 26వ తేదీన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. సీఐటీయూ నాయకులు సుబ్బరాయుడు, నారాయణ, శేఖర్‌, రవి, మహేష్‌, హనుమంతు, వెంకటేశ్వర్లు, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. 


ఆత్మకూరు: మున్సిపల్‌ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం,  మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గొడుగు రాజు, పెద్దనాగరాజు డిమాండ్‌ చేశారు. ఆత్మకూరులోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహించిన మున్సిపల్‌ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇటీవల ఆరు మంది మున్సిపల్‌ కార్మికులు మృతిచెందారని వారి కుటుంచాలకు ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం ఇవ్వలేదని చెప్పారు. మున్సిపల్‌ కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రణధీర్‌, రామ్‌నాయక్‌, ఆ సంఘం నాయకులు తిమ్మయ్య, జోసఫ్‌, నాగన్న, దానమ్మ, రవి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-08-20T06:01:37+05:30 IST