కర్ర పెండలం సాగుకు సమాయత్తం

ABN , First Publish Date - 2021-06-13T06:55:29+05:30 IST

మెట్ట, ఏజెన్సీల్లో వర్షాధారంతో పండించే ప్రధాన పంటగా కర్ర పెండలం దుంప పంటను పండిస్తుంటారు.

కర్ర పెండలం సాగుకు సమాయత్తం
జగ్గంపేట ప్రాంతంలో మెట్ట నేలల్లో విత్తన కర్రను సిద్ధం చేస్తున్న రైతులు.

వర్షాలు పడడంతో మెట్ట, ఏజెన్సీల్లో మొదలైన విత్తన కర్ర సేద్యం

సామర్లకోట/జగ్గంపేట, జూన్‌ 12: మెట్ట, ఏజెన్సీల్లో వర్షాధారంతో పండించే ప్రధాన పంటగా కర్ర పెండలం దుంప పంటను పండిస్తుంటారు. వేసవిలో దుక్కి దున్నుకుని, ఎర్ర రేవడి నేలను సాగుకు అనుకూలంగా మల్చుకుని ఈ సమయంలో వర్షం కోసం రైతులు ఎదురుచూసేవారు. ఈసారి జూన్‌ మొదటి వారంలోనే అడపాదడపా వర్షాలు కురవడంతో దుంప సాగుకు విత్తన కర్రతో సాగుకు శ్రీకారం చుట్టారు. ఉష్ణ మండలపు పంటగా ప్రసిద్ధి చెంది, రాష్ట్రంలో మన జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే సాగు చేసే ఈ దుంప సాగుకు నారుమడులు (పళ్లాలు) కట్టే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. రెండ్రోజులుగా వాతావరణం చల్లబడడం, నైరుతి రుతుపవనాలు త్వరగా వస్తాయని వాతావరణశాఖ నిపుణులు పేర్కొనడంతో సామర్లకోట, పెద్దాపురం ఏడీబీ రోడ్డు వెంబడి మెట్ట పొలాల్లో కూడా దుక్కి దున్నడం, నారుమడులకు పళ్లాలు కట్టడం వంటి పనులను చేపట్టారు. ఈ పంటకు ముందుగానే తాము దాచి ఉంచిన విత్తన కర్రను శుభ్రం చేసి తదుపరి ముక్కలుగా నరికి పళ్లా లుగా ఏర్పాటుచేసిన భూముల్లో మొక్క మొలిచేందుకు విత్తన కర్రలు నాటు తారు. ఈ విత్తన కర్ర మొలకెత్తిన వెంటనే వాటిని అక్కడ నుంచి తీసి మొత్తం పొలంలో సాగుకు అనుకూలంగా విత్తన కర్రను నాటుతారు. ఏడు నెలలపాటు సాగు చేసే కర్ర పెండలం పూర్తిగా వర్షాధారపు పంట. ఈ కర్ర పెండలం దుంప నుంచి సగ్గు బియ్యం తయారుచేసే శాగో పరిశ్రమలు సైతం సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లోనే ఉన్నందున ఈ సాగుకు ఇక్కడ ప్రాధా న్యం ఏర్పడింది. కాగా ఈ ఏడాది జిల్లాలో 60 వేల ఎకరాల్లో కర్ర పెండలం సాగుకు రైతులు సిద్ధమైనట్టుగా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.



Updated Date - 2021-06-13T06:55:29+05:30 IST