లాహిరి.. లాహిరి.. లాహిరిలో

ABN , First Publish Date - 2022-05-17T05:08:20+05:30 IST

సోమవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు వసంతో త్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.

లాహిరి.. లాహిరి.. లాహిరిలో
తెప్పలపై విహరిస్తున్న స్వామి, అమ్మవార్లు

 నేత్రపర్వంగా పెంచలస్వామి తెప్పోత్సవం

వైభవంగా చక్రస్నానం, వసంతోత్సవాలు


మిరుమొట్లు గొలిపే విద్యుత్‌ దీపాలంకరణ.. ప్రత్యేక పుష్పాలతో నేత్రానందంగా అలంకరించిన తెప్ప... అద్దంలా ప్రతిబింబించే పుష్కరిణి.. నలువైపులా భక్తజనం మధ్య కోనలోని ఉభయదేవేరులతో కలిసి శ్రీవారు సోమవారం రాత్రి తెప్పపై విహరించారు. ఈ వైభోగాన్ని కనులారీ వీక్షించిన భక్తులు పెంచలో.. గోవిందా... లక్ష్మీ నరసింహ..  గోవిందా.. అంటూ స్వామివారి నామస్మరణలు చేస్తూ పరవశించిపోయారు.


రాపూరు మే 16 : సోమవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు వసంతో త్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. తొలుత ఉత్సవమూర్తులపై వసంతాలు చల్లి పిదప ఆలయ ఽకమిటీ సభ్యులు కుటుంబాలతో కలసి, దేవదాయశాఖాధికారులు, అర్చకులు, వేదపండితులు, రంగులు పూసుకుంటూ, వసంతాలు పోసుకున్నారు. అనంతరం డప్పులు, మోగిస్తూ, నృత్యం చేస్తూ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు.   పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీవారి శ్రీచక్రాన్ని ఆలయ అర్చకులు మూడుసార్లు నీళ్లలో ముంచి తాము మునుగుతూ చక్రస్నానాన్ని నిర్వహించారు. 


అశ్వవాహనంపై క్షేత్రోత్సవం

సోమవారం రాత్రి తన దేవేరులతో కలిసి స్వామివారం కోనేరులో తెప్పపై మూడు సార్లు విహరించారు. అనంతరం అశ్వవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.  మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అశ్వవాహనంపై స్వామివారు కోన వీధుల్లో స్వారీ చేస్తూ దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఎగురవేసిన గరుత్మంతుడి చిత్రపటాన్ని కిందకు దించి ధ్వజావరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.


 ఘనంగా పూర్ణాహుతి

బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి నిర్వహిస్తున్న హోమాల్లో రాత్రి పూర్ణాహుతి కార్యక్రమాన్ని టీటీడీ, ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. పూర్ణాహుతిలో  పాల్గొంటే బ్రహ్మోత్సవాల్లో అన్నిరోజులు పాల్గొన్న పుణ్యఫలం  వస్తుందని భక్తుల నమ్మకం.


గోనుపల్లిలో  నేడు  గ్రామోత్సవం

బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం రాత్రి గోనుపల్లిలో గ్రామోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాల కోసం కోనకు వెళ్లిన స్వామివారు తిరిగి గోనుపల్లికి  చేరుకోవడంతో ఉత్సవాలు ముగుస్తాయి.





Updated Date - 2022-05-17T05:08:20+05:30 IST