Jun 14 2021 @ 15:37PM

‘పెళ్లి సంద‌D’.. హీరోయిన్ స్పెషల్‌ గ్లింప్స్‌ విడుదల

హీరోయిన్లను అందంగా చూపించడంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు స్టయిలే వేరు. ఎంతో మంది హీరోయిన్లను ఆయన పూలతో, పండ్లతో కొట్టించారు. ఇప్పుడు మరో నూతన తారని ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నారు. ‘పెళ్లి సంద‌D’ టైటిల్‌తో రూపొందుతోన్న చిత్రంతో శ్రీలీల అనే అందాల భామను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడి శతాధిక చిత్రాల దర్శకుడు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న చిత్రం `పెళ్లిసంద‌D`. గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సోమ‌వారం(జూన్ 14) హీరోయిన్‌ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్‌ `పెళ్లిసంద‌D` చిత్రం నుంచి ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ని విడుదల చేసింది. 


రాఘ‌వేంద్రుడి శిష్యురాలు, చిత్ర‌ ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి ఈ చిత్రంలో శ్రీలీలను గ్లామ‌ర‌స్‌గా చూపించినట్లు ఈ గ్లింప్స్‌ చూస్తే అర్థ‌మ‌వుతుంది. శ్రీలీల విషయానికి వస్తే.. బెంగుళూరులో స్థిర‌ప‌డ్డ తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. మెడిసిన్ చ‌దువుతుంది. అయితే న‌ట‌న‌పై ఆస‌క్తితో సినీ రంగంలో అవ‌కాశాల కోసం చూస్తున్న త‌రుణంలో రాఘ‌వేంద్రరావు సూచ‌న మేర‌కు గౌరి రోణంకి శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. హాకీ, స్విమ్మింగ్ వంటి స్పోర్ట్స్‌తో పాటు క్లాసిక‌ల్ డాన్స్‌.. బాలే డాన్స్‌లోనూ శ్రీలీలకు మంచి ప్రావీణ్యం ఉంది. ఎంద‌రో హీరోయిన్స్‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయ‌డం, తెలుగు వారి హృద‌యాల్లో వారికి సుస్థిర‌మైన స్థానాన్ని క‌లిగించిన ద‌ర్శ‌కేంద్రుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న ‘పెళ్లి సంద‌D’ చిత్రంలో న‌టించ‌డం హీరోయిన్‌గా త‌న‌కెంతో ప్ల‌స్ అని హీరోయిన్ శ్రీలీల తెలియ‌జేసింది. 

‘‘మా గురువుగారు రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌ర‌వాణి కీర‌వాణి కాంబినేష‌న్‌లో సూప‌ర్ హిట్ సినిమా రూపొందింద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎన్నో మ్యూజిక‌ల్ సెన్సేష‌న్స్ రూపొందాయి. అదే స్టైల్లో ఈ సినిమాలోని పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఏడు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. లాక్‌డౌన్ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే షూటింగ్‌ను పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం’’ అని డైరెక్ట‌ర్ గౌరి రోణంకి తెలిపారు.