Jul 30 2021 @ 22:45PM

కెమెరా ముందుకు దర్శకేంద్రుడు

శతాధిక చిత్రాల దర్శకుడిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు. దశాబ్దాల సినీ ప్రయాణంలో  దర్శకుడిగా కెమెరా వెనుక ఉన్న ఆయన ఇప్పుడు నటుడిగా కెమెరా ముందుకు వచ్చారు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి ‘పెళ్లి సంద-డి’ చిత్రం తెర కెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాఘవేంద్రరావు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన విశేషాలతో రూపొందించిన ప్రోమో వీడియోను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ‘100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన మన మౌనముని తొలిసారి కెమెరా ముందుకొచ్చారు’ అని రాజమౌళి పేర్కొన్నారు. వశిష్ట అనే పాత్రలో రాఘవేంద్రరావు స్టైలిష్‌లుక్‌లో కనిపించారు. 


పవన్‌ అభినందన

నటుడిగా అరంగేట్రం చేస్తున్న కె. రాఘవేంద్రరావుకు ఈ సందర్భంగా నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ‘‘దర్శకులు రాఘవేంద్రరావు, ఇకపై నటులు కావడం సంతోషకరం. మీ దర్శకత్వంలో సినిమాలు చేయాలని నటులు ఎలా ఉవ్విళ్లూరారో, ఇకపై తమ దర్శకత్వంలో మీరు నటించాలని దర్శకులు కోరుకుంటారు. దర్శకుడిగా ఘన విజయాలను సొంతం చేసుకున్న మీరు నటుడిగానూ విజయవంతం కావాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో ఆకాంక్షించారు.