గుళి రాగి సాగు లాభదాయకం

ABN , First Publish Date - 2022-08-12T06:25:31+05:30 IST

గుళి రాగి సాగు లాభదాయకమని స్థానిక వ్యవసాయ సహాయక సంచాలకులు(ఏడీఏ) కంటా జాహ్నవి అన్నారు.

గుళి రాగి సాగు లాభదాయకం
రైతులకు సూచనలు ఇస్తున్న ఏడీఏ జాహ్నవి

నూతన విధానం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు

ఏడీఏ జాహ్నవి

చింతపల్లి, ఆగస్టు 11: గుళి రాగి సాగు లాభదాయకమని స్థానిక వ్యవసాయ సహాయక సంచాలకులు(ఏడీఏ) కంటా జాహ్నవి అన్నారు. గురువారం మండలంలోని తాజంగి, లంబసింగి ఆర్‌బీకేలను ఏడీఏ సందర్శించారు. చిన్నగెడ్డ గ్రామంలో ఆదివాసీలు సాగు రైతులు సాగుచేస్తున్న గుళి రాగి పంట పొలాలను పరిశీలించారు. ఈ సంద్భంగా స్థానిక రైతులతో ఏడీఏ మాట్లాడుతూ రాగి(చోడి) సాగులో నూతన విధానం గుళి పద్ధతిని పాటించడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చునన్నారు. గతంలో గిరిజన రైతులు సంప్రదాయ పద్ధతిలో రాగి సాగుచేసేవారన్నారు. దీంతో ఆశించిన దిగుబడులు వచ్చేవికావన్నారు. గుళి పద్ధతిలో రాగి సాగుచేసుకోవడం వల్ల ఎకరాకు 12-13 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. మార్కెట్‌లో రాగి ఆహార ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందని తెలిపారు. దీంతో రాగికి మంచి ధర లభిస్తుందన్నారు. రైతులు నూతన విధానాలను పాటిస్తూ అధిక విస్తీర్ణంలో రాగి సాగు చేపట్టాలన్నారు. అలాగే రాగి సాగులో వివిధ దశల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను క్రమంగా పాటించాలన్నారు. అపరాల పంటైన రాజ్‌మా విత్తనాలు 90శాతం రాయితీపై పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నెల 20తేదీ తరువాత ఆర్‌బీకేల్లో రాజ్‌మా విత్తనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాజ్‌మా సాగుకి రైతులు సన్నద్ధం కావాలన్నారు. రైతులు పంటలను సేంద్రియ పద్ధతిలో సాగుచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T06:25:31+05:30 IST