పేల్చెయ్‌.. అమ్మెయ్‌..!

ABN , First Publish Date - 2022-05-26T06:23:21+05:30 IST

అధికార పార్టీ ముసుగులో భూ ఆక్రమణకు తెరలేపారు. డి-పట్టా, ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు.

పేల్చెయ్‌..  అమ్మెయ్‌..!
సర్వే నెంబర్‌ 715లో వేసిన ప్లాట్లు

గుత్తిలో కొండగుట్టలు మాయం

ప్రభుత్వ,  అసైన్డ భూముల్లో ప్లాట్లు

అధికార పార్టీ ముసుగులో భూ ఆక్రమణకు తెరలేపారు. డి-పట్టా, ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. డి-పట్టా భూమి హక్కుదారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, తక్కువ ధరకు కొనుగోలు చేసి రూ.కోట్లు దండుకుంటున్నారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలో అనంతపురం రోడ్డు, తాడిపత్రి రోడ్డులో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ భూములను కొందరు అధికార పార్టీ నాయకులు అడ్డంగా అమ్ముకుంటున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. 

- గుత్తి


యథేచ్ఛగా దందా

-అనంతపురం రోడ్డు సమీపంలోని కొండ, గుట్టల్లో సర్వే నెంబరు 715, 716లో 2.50  ఎకరాలు, సర్వే నెంబరు 725లో మూడు ఎకరాల డి-పట్టా భూమిని నామమాత్రపు ధరకు కొనుగోలు చేశారు. భారీ యంత్రాలతో గుట్టలను చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేందుకు సిద్ధమవుతున్నారు. 

- తాడిపత్రి రోడ్డులోని కొత్తపేట రెవెన్యూలో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో అర్బన హెల్త్‌ సెంటర్‌ నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలోని అసైన్డ, ప్రభుత్వ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కొండలు, గుట్టలను సైతం అధికార పార్టీ నాయకుల సహకారంతో కబళిస్తున్నారు. పేలుడు పదార్థాలతో బ్లాస్ట్‌ చేసి, భారీ యంత్రాలతో  చదును చేసి, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు.

- సర్వే నెంబరు 431లో 3 ఎకరాల్లోని కొండను ధ్వంసం చేసి, ప్లాట్లు వేసి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నెంబరు 588లో 3.9 ఎకరాలు, సర్వే నెంబరు 725/1 లోని 3.5  ఎకరాలు, సర్వే నెంబరు 457/ఏ2 లోని 85 సెంట్లు,  సర్వే నెంబరు 716/2లోని 1.4 ఎకరాలు, సర్వే నెంబరు 715/2లోని 1.69 ఎకరాలు, సర్వే నెంబరు 737, 738లో 2.72 ఎకరాలు.. ఇలా పలు చోట్ల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. దీని వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. 


ఏం చేస్తున్నారు..?

కబ్జా జరుగుతోంది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. నిత్యం అధికారులు వచ్చిపోయే ప్రధాన రహదారుల్లో. ఓ చిన్న పట్టణంలో.. కళ్లెదుటే ప్రభుత్వ భూములను, కొండ గుట్టలను ఆక్రమించి, నిలువునా అమ్ముతుంటే అధికారులు మౌనం వహించడాన్ని ఏమనుకోవాలి..? ప్రభుత్వ, అసైన్డ, పొరంబోకు భూములు ఒక్కొక్కటిగా ప్లాట్లు అవుతున్నాయి. అయినా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కొండ, గుట్టలను బ్లాస్ట్‌ చేస్తున్నా స్పందించడం లేదు. ఎప్పుడైనా ప్రజలు ప్రశ్నిస్తే ఓ ప్రకటన ఇచ్చి మిన్నకుండిపోతున్నారు. దీనిపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. 



 ఆక్రమిస్తే చర్యలు...

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. అసైన్డ భూముల్లో లే ఔట్లు వేసి ప్లాట్లు వేసి విక్రయిస్తే, వాటిని స్వాధీనం చేసుకుంటాం. కొండ, గుట్టలను పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం.

- మహబూబ్‌ బాషా,  తహసీల్దారు

Updated Date - 2022-05-26T06:23:21+05:30 IST