దివిసీమలో కోడి పందేల బరులు

ABN , First Publish Date - 2021-01-10T05:48:48+05:30 IST

సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, పేకాట తదితర జూద క్రీడలకు దూరంగా ఉండాలంటూ పోలీస్‌ శాఖ ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా లెక్క చేయకుండా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు చోట్ల పందేలు నిర్వహించేందుకు బరులను సిద్ధం చేస్తున్నారు.

దివిసీమలో కోడి పందేల బరులు
ఎడ్లంక మామిడి తోట వద్ద కోడి పందేలకు బరిని సిద్దం చేస్తున్న నిర్వాహకులు

అవనిగడ్డ టౌన్‌, జనవరి 9: సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, పేకాట తదితర జూద క్రీడలకు దూరంగా ఉండాలంటూ పోలీస్‌ శాఖ ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా లెక్క చేయకుండా అవనిగడ్డ నియోజకవర్గంలో పలు చోట్ల పందేలు నిర్వహించేందుకు బరులను సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డ సమీపంలో మూడు చోట్ల, మోపిదేవి మండలంలో రెండు చోట్ల, కోడూరులో రెండు చోట్ల, ఘంటసాలలో మూడు చోట్ల, నాగాయలంకలో రెండు చోట్ల బరులు నిర్వహించేందుకు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నిర్వాహకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీస్‌ శాఖ నుంచి ఎలాంటి గ్రీన్‌ సిగ్నల్‌ రానప్పటికీ అనుమతులు వచ్చి తీరతాయన్న నమ్మకంతో నిర్వాహకులు పందెపు బరులను సిద్ధం చేస్తున్నారు. 

 నీకెన్ని.. నాకెన్ని..?

రాజకీయంగా నిత్యం విమర్శలు ప్రతివిమర్శలతో వాతావరణాన్ని వేడెక్కించే దివి ప్రాంతానికి చెందిన రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కోడి పందేల విషయంలో మాత్రం కలిసి సాగుదామన్న అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అవనిగడ్డ పాత ఎడ్లంక సమీపంలో రెండు చోట్ల, గొట్టం మిల్లు ప్రాంతంలో ఒక చోట కోడి పందేలను నిర్వహించేందుకు మామిడి తోటల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోడూరు  మండలంలో దింటిమెరక, రామకృష్ణాపురం వద్ద ఇప్పటికే పొలాలను చదును చేసే పనులు ప్రారంభించారు. మోపిదేవి మండలం వెంకటాపురం సమీపంలో భారీ బరిని ఏర్పాటు చేసేందుకు ప్రధాన పార్టీలు కలిసికట్టుగానే కృషి చేస్తూ బరిని సిద్ధం చేస్తున్నాయి. ఘంటసాల మండలంలో నదీతీర గ్రామాల్లో రెండు చోట్ల చిన్నచిన్న బరులు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా నియోజకవర్గంలో అతిపెద్ద బరి అయిన కొడాలి బరిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై ఇంకా స్పష్టత రానప్పటికీ బరి ఏర్పాటు చేయటం మాత్రం ఖాయమని, ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలను ఏకం చేసేలా ఇటీవల కొందరు ప్రముఖులు ప్రయత్నాలు చేయగా ఇరువురూ ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

 ఓ వైపు దాడులు.. మరో వైపు ఏర్పాట్లు... 

సంక్రాంతి సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగవంటూ ఎస్పీ ఆదేశాలతో అవనిగడ్డ సబ్‌డివిజన్‌ పోలీసులు ఇప్పటికే పలు చోట్ల దాడులు నిర్వహించి కోడి కత్తుల తయారీదారులను అదుపులోకి తీసుకొని బైండోవర్‌ చేసుకుంటున్నారు. మరోవైపు నిర్వాహకులు మాత్రం ఎక్కడికక్కడ బరులు ఏర్పాటు చేసుకొనేందుకు కావలసిన సన్నాహాలు చేసుకుంటూనే వివిధ ప్రాంతాల్లోని పందెపు రాయుళ్లకు తమ బరులకు రావల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారు. ఓవైపు పోలీస్‌ దాడులు మరోవైపు నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లతో ఏం జరుగుతుందోనని సామాన్యులు ఆసక్తిగా గమనిస్తున్నారు. 


Updated Date - 2021-01-10T05:48:48+05:30 IST