నేత కార్మికులకు ‘పెహచాన్‌’

ABN , First Publish Date - 2020-11-25T05:35:05+05:30 IST

చేనేత మగ్గంపై ఎన్నో కళాకృతులు... రంగు రంగుల దారాలతో అగ్గిపెట్టెలో అమిరే చీరలు నేసి అబ్బుర పరిచిన కార్మికులు మగ్గం సడుగులు విరుగుతున్నా చేనేత రంగాన్ని వీడడం లేదు. వారికి అండగా ప్రభుత్వ పథకాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పెహచాన్‌’ పేరుతో గుర్తింపు కార్డులను అందించనుంది.

నేత కార్మికులకు ‘పెహచాన్‌’
చేనేత మగ్గం

- కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కొత్త గుర్తింపు కార్డులు

- వాటి ద్వారానే సంక్షేమ పథకాలు అమలు

- జిల్లాలో 175 మగ్గాలు.. 325 మంది కార్మికులు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) 

చేనేత మగ్గంపై ఎన్నో కళాకృతులు... రంగు రంగుల దారాలతో అగ్గిపెట్టెలో అమిరే చీరలు నేసి అబ్బుర పరిచిన కార్మికులు మగ్గం సడుగులు విరుగుతున్నా చేనేత రంగాన్ని వీడడం లేదు. వారికి అండగా ప్రభుత్వ పథకాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పెహచాన్‌’ పేరుతో గుర్తింపు కార్డులను అందించనుంది. తరతరాలుగా చేనేత మగ్గాలను నమ్ముకున్న కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలతో ఆదుకునే దిశగా దృష్టి సారించాయి. రాష్ట్ర ప్రభుత్వం చేనేత జౌళి శాఖ ద్వారా ఇప్పటికే గుర్తింపు కార్డులను అందించడంతో పాటు చేనేత, మరమగ్గాలను జియో ట్యాగింగ్‌ చేసింది. చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందింస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేసే క్రమంలో సరైన గుర్తింపు కార్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కేవలం సొసైటీల్లో ఉండే కార్మికులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘పెహచాన్‌’’ పేరుతో గుర్తింపు కార్డులను అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కార్యక్రమం మొదలు కాగా త్వరలోనే మన రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నారు. దీని ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 175 చేనేత మగ్గాలపై పనిచేస్తున్న 325 మంది కార్మికులకు గుర్తింపు లభించనుంది. ఇందుకోసం కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలో 2018లో మగ్గాలను జియో ట్యాగింగ్‌ చేయడంతో పాటు కార్మికుడి ఫొటో, సెల్‌ నంబర్‌, ఆధార్‌ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. వీటి ఆధారంగా కార్మికులకు కేంద్ర, చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులను జారీ చేయనుంది. చేనేత సర్వీస్‌ సెంటర్‌ ద్వారా కార్మికులకు వచ్చే మెసేజ్‌లో ఓటీపీ చెబితే దాని ద్వారా పెహచాన్‌ కార్డు అందుకునే వీలు అవుతుంది. గుర్తింపు కార్డు ద్వారా రాబోయే కాలంలో బ్యాంక్‌ రుణాలు, అన్‌లైన్‌ మార్కెటింగ్‌, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లలో తమ సరుకులను అమ్ముకునే వీలు కలుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం నూలు, రసాయనాల మీద సబ్సిడీ అందిస్తుండగా పెహచాన్‌ కార్డు ద్వారా మరిన్ని సౌకర్యాలు అందుతాయని భావిస్తున్నారు. 

 వృద్ధులకే పరిమితమైన చేనేత మగ్గాలు..

 

 ఒకనాడు రంగు రంగుల చీరలు, దోవతులు, పంచెలతో కళకళాడిన చేనేత మగ్గాల ఉనికే ప్రశ్నార్థకం గా మారింది. కంటి చూపు ఆనకపోయినా వృద్ధాప్యంలో ఇంకా చేనేత మగ్గాన్ని నమ్ముకొని కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్లలోని యువకులు మరమగ్గాల వైపు వెళ్లడంతో చేనేత మగ్గాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో బతుకమ్మచీరలు వంటి ప్రభుత్వ అర్డర్లతో చేతినిండా పనితో మరమగ్గాల కార్మికుల్లో సిరినవ్వులు విరబూస్తున్నాయి. కానీ  చేనేత మగ్గాన్ని నమ్ముకున్న వృద్ధ కార్మికులు సరైన కూలి లభించక ఇతర పనులు చేయలేక చేనేత మగ్గాన్నే నమ్ముకొని కాలం వెల్లదీస్తున్నారు. జిల్లాలో 175 మగ్గాల ద్వారా రూ 1.50 కోట్ల చేనేత వస్త్రాల టర్నోవర్‌ జరుగుతోంది. చేనేత మగ్గాలపై కొత్త డిజైన్లపై కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి చర్యలు చేపట్టింది. వేములవాడ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం చేనేత క్లస్టర్‌గా గుర్తించింది. క్లస్టర్‌ కింద రూ 1.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనిలో భాగంగా రూ 50 లక్షలతో మౌలిక వసతుల కేంద్రం ఆఽఽధునిక డిజైనతో కార్మికులకు శిక్షణ కార్యక్రమాలను  చేపట్టింది. జిల్లాలో 175 మగ్గాలు ఉండగా అందులో కొన్ని వినియోగంలో లేవు. జిల్లాలో సిరిసిల్లలో 76 మగ్గాలు, వేములవాడలో 4, వేములవాడ మండలంలో 7, చందుర్తిలో 8, బోయినపల్లిలో 27, తంగళ్లపల్లిలో 34, ఇల్లంతకుంటలో 4, గంభీరావుపేటలో 1, కోనరావుపేటలో 14 ఉన్నాయి. ఇందులో సిరిసిల్లలో మహేశ్వర సొసైటీ, సిరిసిల్ల సొసైటీ, జగదాం బ సొసైటీ, వేములవాడ, హన్మాజీపేట, మామిడిపెల్లి సొసైటీలతో పాటు ఖాదీగ్రామోద్యోగ్‌, తంగళ్లపల్లి సొసైటీల్లో చేనేత మగ్గాలు కార్మికులకు ఉపాధిని అందిస్తున్నాయి.

Updated Date - 2020-11-25T05:35:05+05:30 IST