Pegasus Row in AP Assembly: అంత హడావుడి చేసి అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఏంటో చూడండి..

ABN , First Publish Date - 2022-09-20T22:26:34+05:30 IST

పెగాసస్‌ స్పైవేర్‌ను (pegasus spyware) ఉపయోగించి ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping) జరిపారంటూ వచ్చిన ఆరోపణలపై..

Pegasus Row in AP Assembly: అంత హడావుడి చేసి అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఏంటో చూడండి..

అమరావతి: పెగాసస్‌ స్పైవేర్‌ను (pegasus spyware) ఉపయోగించి ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping) జరిపారంటూ వచ్చిన ఆరోపణలపై అధ్యయనానికి ఏర్పాటైన సభా సంఘం తన మధ్యంతర నివేదికను మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు (AP Assembly) సమర్పించింది. కాల్‌ ట్యాపింగ్‌ నుంచి సమాచారం దొంగించారన్న కోణంలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి (bhumana karunakar reddy) నేతృత్వంలోని ఈ కమిటీ విచారణ జరిపింది. సోమవారం సమావేశమై.. మధ్యంతర నివేదికకు తుదిరూపు ఇచ్చింది. అయితే.. శాసనసభకు భూమన సమర్పించిన మధ్యంతర నివేదికలో డేటా చోరీపై కమిటీ ఇప్పటికీ ఎటువంటి నిర్దారణకు రాలేదని మాత్రం స్పష్టమైంది. సమాచారం బయటకు వెళ్లింది కానీ, ఎవరికి వెళ్లిందో తేల్చకపోవడం గమనార్హం. ఐపీ అడ్రస్ వివరాల కోసం గూగుల్‌ను (Google) అడిగినా లాభం లేకపోయిందంటూ నివేదికలో సభా సంఘం స్పష్టం చేసింది. గుర్తు తెలియని ఐపీ అడ్రస్సుకు (IP Adress) డేటా వెళ్లిందంటూ నివేదికలో వెల్లడించారు.


గుర్తు తెలియకున్నా డేటా చౌర్యం (Data Theft) మాత్రం జరిగిందనే నిర్దారణకు వచ్చేశామంటూ నివేదికలో కమిటీ పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. డేటా చౌర్యం వ్యవహారంపై వివరాల కోసం గూగుల్‌కు భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ లేఖ రాసింది. స్టేట్ డేటా సెంటర్ సర్వర్ల (SDC Servers) నుంచి గుర్తు తెలియని సర్వర్ ఐపీలకు (Unknown Server IPs) వెళ్లిన వివరాలను ఇవ్వాల్సిందిగా గూగుల్‌ను కోరింది. సభా సంఘం పంపిన ఐపీ అడ్రస్సుల వివరాలను గుర్తించలేమని గూగుల్ సంస్థ (Google) తేల్చి చెప్పింది. సదరు ఐపీ అడ్రస్సులు గూగుల్‌కు చెందినవే అయినా ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించనందున గుర్తింపు కష్టమని గూగుల్ పేర్కొంది. దీనిపై తదుపరి సంప్రదింపుల కోసం తమ న్యాయ విభాగానికి ఈమెయిల్ (Email) పంపాలని గూగుల్ సూచించింది. వేర్వేరు సర్వర్లలోని ఐపీ అడ్రస్‌ల జాబితాను నివేదికలో కమిటీ పొందుపర్చింది.



డేటా చౌర్యంపై సభా సంఘంలోని నివేదిక వివరాలు:

* ఏపీ కంప్యూటర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ పర్యవేక్షణలో రాష్ట్రంలోని కంప్యూటర్ నెట్ వర్క్, డేటా భద్రత, సర్వర్ల వివరాలను ఇంటెలిజెన్స్ విభాగం విశ్లేషించింది

* డేటా చౌర్యానికి సంబంధించిన లావాదేవీలు లాగ్స్ రూపంలో సేకరించాం

* రాష్ట్రంలోని 18 స్టేట్ డేటా సెంటర్ల నుంచి పెద్ద మొత్తంలో డేటా చౌర్యం

* 2018 నవంబర్ 30 నుంచి 2019 మార్చి 31 తేదీ వరకూ ఈ డేటా చౌర్యం

* అధికారిక అనుమతుల్లేకుండా డేటా ట్రాన్స్‌ఫర్ జరిగింది

* రాష్ట్ర డేటా సెంటర్ సర్వర్ల నుంచి బయట సర్వర్లకు మార్పిడి జరిగిన ఈ డేటా వివరాలు, ఐపీ  అడ్రస్‌లను కూడా గూగుల్ గుర్తించలేకపోయింది

* రాష్ట్రంలోని పౌరులకు సంబంధించిన సున్నితమైన సమాచారం 2018 నవంబర్ 30 నుంచి 2019 మార్చి 31 తేదీ మధ్య ఎస్డీసీ నుంచి గుర్తు తెలియని సర్వర్లకు డేటా చౌర్యం



ఇదిలా ఉంటే.. నిజానికి, బెంగాల్‌ సహా ఇతర రాష్ట్రాల్లో పెగాసెస్‌ స్పైవేర్‌ వినియోగంపై వచ్చిన అభియోగాలు సుప్రీంకోర్టులో వీగిపోయాయి. పెగాసస్‌ పరికరాలు ప్రభుత్వాలు కొనుగోలు చేసినట్లు.. ప్రతిపక్ష సభ్యులపై ప్రయోగించినట్లు సుప్రీం కోర్టు వేసిన ప్రత్యేక కమిటీ గుర్తించలేకపోయింది. ఈ క్రమంలోనే భూమన కమిటీ తన నివేదికలో పెగాసస్‌ అంశాన్ని చేర్చలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మధ్యంతర నివేదికను కమిటీ సమర్పించినప్పటికీ పెగాసెస్ వాడినట్లు అనుమానం ఉందని నివేదికలో చెప్పలేకపోవడం గమనార్హం. అసెంబ్లీలో ప్రభుత్వం తప్పుడు సమాచారం అందిస్తోందని ఇప్పటికే అంటున్న టీడీపీ.. ప్రభుత్వ తప్పుడు సమాచారానికి కౌంటర్లు సిద్ధం చేసింది. వాస్తవాలపై నేతలతో ప్రజెంటేషన్లు ఇప్పించాలని టీడీపీ నిర్ణయించింది.

Updated Date - 2022-09-20T22:26:34+05:30 IST