‘పెగాసస్‌’ వేడి!

ABN , First Publish Date - 2021-07-22T08:49:00+05:30 IST

పెగాసస్‌ నిఘా వ్యవహారం నానాటికీ వేడెక్కుతూ భారత్‌ సహా అనేక దేశాలను కుదిపేస్తున్నది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఒకరోజు ముందు వెలుగుచూసిన...

‘పెగాసస్‌’ వేడి!

పెగాసస్‌ నిఘా వ్యవహారం నానాటికీ వేడెక్కుతూ భారత్‌ సహా అనేక దేశాలను కుదిపేస్తున్నది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఒకరోజు ముందు వెలుగుచూసిన ఈ వ్యవహారాన్ని అదేదో స్థానికంగా జరిగిన కుట్రలాగా, బురదజల్లే యత్నంగానూ తీసిపారేసిన మోదీ ప్రభుత్వంతో ప్రతిపక్షాలు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. సభలో రభసకు తోడుగా స్టాడింగ్‌ కమిటీకి ఫిర్యాదుచేయడం ద్వారా, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌తో నోటీసులు ఇప్పించి, మూడు కీలకమైన ప్రభుత్వశాఖలను కమిటీ ముందుకు రప్పించి వివరణ ఇచ్చుకొనేట్టు చేస్తున్నాయి. మరోపక్క పెగాసస్‌ నిఘా చాలాదేశాలను కుదిపేస్తున్న నేపథ్యంలో, సదరు ఆరోపణలను పరిశీలించి, దాని దుర్వినియోగం లోతుపాతుల్ని నిగ్గుతేల్చే లక్ష్యంతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఒక మంత్రిత్వస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. 


ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసిన ఎన్‌ఎస్‌వో సంస్థ తన పని ప్రభుత్వాలకు విక్రయించడమే తప్ప వారి తరఫున డేటాను నిర్వహించడం కాదని అంటున్నది. ఓ యాభైవేల ఫోన్‌నెంబర్లు బయటపెట్టి, అవి నిఘానీడలో ఉన్నాయంటూ తనను నిలదీసినంత మాత్రాన తాను జవాబుదారీని కాబోననీ, ఫ్రాన్స్‌ ‘ఫర్‌బిడెన్‌స్టోరీస్‌’ సహా ప్రపంచ మీడియా సంస్థల బురదజల్లే యత్నాలకు భయపడననీ ఆ ఇజ్రాయెలీ సంస్థ ఘాటుగా జవాబు ఇస్తున్నది. సాఫ్ట్‌వేర్‌ అమ్మేసిన తరువాత ఒక టెక్నాలజీ కంపెనీగా దాని నిర్వహణతో తనకు ఇక ఏ సంబంధమూ ఉండదనీ, కొనుగోలుదారులు దానితో ఏం చేస్తున్నారన్నదీ తనకు తెలియదని చెబుతోంది. ఇజ్రాయెల్‌ జాతీయభద్రతామండలి ఆధ్వర్యంలో పనిచేసే మంత్రుల బృందం సదరు సంస్థను ఏ మేరకు కట్టడి చేయగలదో చెప్పలేం. ఈ కంపెనీ దేశీయచట్టాలను ఉల్లంఘించలేదనీ, అందువల్ల ఇప్పటివరకూ జరిగిన ‘ఎగుమతుల’ జోలికి పోకుండా, కొత్తగా కొన్ని నిబంధనలు విధించవచ్చునని అంటున్నారు. ఇజ్రాయెల్‌ మీడియా మాత్రం ఆ సంస్థను దుమ్మెత్తిపోస్తున్నది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ ఫోన్‌కూడా ట్యాపింగ్‌ జాబితాలో ఉండడంతో ఆ దేశం దర్యాప్తుకు ఆదేశించింది. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రాంఫోసా, పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీ హత్యోదంతంతో ముడిపడినవారు కూడా లీకైన లిస్టులో ఉన్నారు.


భారతదేశంలో ‘ది వైర్‌’ ప్రచురించిన జాబితాలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయనాయకులు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలు, విద్యార్థులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోవడం వెనుక పెగాసస్‌ కుట్ర పనిచేసిందని విమర్శలు వస్తున్నాయి. ఈ నిఘా వెలుగుచూసిన తరువాత ఇక భీమా–కోరేగావ్‌ కుట్రకేసుకు విలువేముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలకు మాత్రమే ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ అమ్మాలన్న ఇజ్రాయెల్‌ ప్రభుత్వ నిబంధనను తాను ఉల్లంఘించలేదనీ, ఆయా దేశాలు ఉగ్రవాదాన్నీ, నేరాన్నీ నివారించేందుకు మాత్రమే దీనిని వినియోగించాలని ఎన్‌ఎస్‌వో చెబుతున్నది కనుక ప్రభుత్వం మీద, దాని నిఘా సంస్థలమీద అనుమానం కలగడం సహజం. కనీసం పదిదేశాల్లో ఆయా మీడియా సంస్థలు వందలాది ఫోన్‌నెంబర్లు ఎవరివో గుర్తించాయి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో వాటిలో కొన్నింటికి ఫోరెన్సిక్‌ పరీక్షలు జరిగి నిఘా సాగినట్టుగా తేలింది కూడా. అత్యంత ఖరీదైన ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయడం, నిర్వహించడం ప్రభుత్వాలకూ, వాటి నిఘావ్యవస్థలకు మాత్రమే సాధ్యమని నిపుణులు అంటున్నారు. తమ పదవిని రక్షించుకోవడంలో భాగంగా ఎదుటివారిపై ఓ కన్నేయాలన్న కోర్కెను అణుచుకోవడం అధికారంలో ఉన్నవారికి కష్టమే. ఒకసారి అందుకు సిద్ధపడితే దుర్వినియోగం ఏ స్థాయికైనా చేరవచ్చు. విపక్షాల ఆరోపణలు ప్రజాస్వామ్యానికి మచ్చతెస్తున్నాయని దాడిచేసే బదులు, ప్రభుత్వమే దీనిపై సమగ్రదర్యాప్తుకు ఉపక్రమించి నిజం నిగ్గుతేల్చగలిగితే, విదేశీ నిఘా అరువుతెచ్చుకున్న అప్రదిష్ట తొలగి, రాజ్యాంగ విలువలకు కట్టుబడిన గౌరవం దక్కుతుంది.

Updated Date - 2021-07-22T08:49:00+05:30 IST