Abn logo
Oct 28 2021 @ 01:59AM

పెగాసస్‌పై కేంద్రానికి సుప్రీం షాక్‌!

 • దాని పర్యవేక్షకుడిగా జస్టిస్‌ రవీంద్రన్‌
 • ఆయనకు మాజీ ఐపీఎస్‌ అలోక్‌ జోషీ,
 • సందీప్‌ ఒబెరాయ్‌ సహకారం
 • ముగ్గురు నిపుణులతో సాంకేతిక కమిటీ
 • ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశం
 • ఇది గోప్యతా హక్కు ఉల్లంఘనకు సంబంధించిన అంశం
 • ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలను ఖండిస్తే చాలదు
 • కేంద్రం వివరణకు తగు సమయమిచ్చాం
 • కానీ పరిమిత అఫిడవిట్‌ మాత్రమే వేసింది
 • జాతీయ భద్రత సాకుతో తప్పించుకోలేరు
 • అది న్యాయసమీక్షకు అతీతం కాదు
 • వ్యక్తిగత జీవితాలపై నిఘాపెట్టే సంపూర్ణాధికారం కేంద్రానికి లేదు
 • చీఫ్‌ జస్టిస్‌ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంచలన తీర్పు


చట్టబద్ధ పాలన జరిగే ప్రజాస్వామ్య దేశంలో.. వ్యక్తులపై విచక్షణరహిత గూఢచర్యాన్ని అనుమతించలేం. కొన్ని రాజ్యాంగ నిబంధనలకు లోబడి చట్టబద్ధ ప్రక్రియలకు అనుగుణంగా అనుమతి ఇవ్వవచ్చు.

ఆరోపణలపై విచారణకు కేంద్రమే నిపుణుల కమిటీని నియమించడం నిర్దేశిత న్యాయసూత్రాలకు విరుద్ధం. కోర్టు న్యాయం చేయడమే కాదు.. చేసినట్లు కనిపించాలి కూడా.

పెగాసస్‌ గూఢచర్యానికి సంబంధించి పిటిషనర్లు చేసిన ఆరోపణలను కేంద్రం నిర్దిష్టంగా ఖండించలేదు. దాఖలుచేసిన పరిమిత అఫిడవిట్‌లో కూడా అస్పష్టంగా ఖండించింది. ఇది చాలదు. ఈ పరిస్థితుల్లో గూఢచర్యం ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయన్న పిటిషనర్ల వాదనను అంగీకరించడం తప్ప మాకు మరో అవకాశం లేదు.

- సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంలో కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రజల పవిత్ర, వ్యక్తిగత జీవితాలపై నిఘాపెట్టే సర్వసత్తాక అధికారం కేంద్రానికి లేదని స్పష్టంచేసింది. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలపై ఇజ్రాయెల్‌కు చెందిన ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణకు నిపుణుల కమిటీని నియమించింది. సైబర్‌ భద్రత, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, నెట్‌వర్క్స్‌, హార్డ్‌వేర్‌ నిపుణులైన నవీన్‌కుమార్‌ చౌధురి, ప్రబాహరన్‌ పి., అశ్విన్‌ అనిల్‌ గుమస్తేలతో కూడిన ఈ కమిటీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ పర్యవేక్షణలో పనిచేస్తుంది. మాజీ ఐపీఎస్‌ అధికారి అలోక్‌ జోషీ, డాక్టర్‌ సందీప్‌ ఒబెరాయ్‌ ఆయనకు సహకరిస్తారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. వచ్చిన ఆరోపణలపై వీలైనంత త్వరగా దర్యాప్తు జరపాలని నిర్దేశించింది. 8 వారాల తర్వాత జరిగే విచారణనాటికి తమకు నివేదిక సమర్పించాలని పేర్కొంది. పెగాసస్‌ గూఢచర్యం ఆరోపణలను కేంద్రం ఊరకే ఖండిస్తే చాలదని.. ప్రతిసారీ జాతీయ భద్రత పేరు చెప్పి తప్పించుకోజాలదని స్పష్టంచేసింది. గూఢచర్యం జరిగిందో లేదో స్పష్టం చేసేందుకు తగు సమయమిచ్చినాస్పందించలేదని, ఖండనలోనూ స్పష్టత లేదని ఆక్షేపించింది. ఆరోపణలపై విచారణకు నిపుణుల కమిటీని నియమిస్తామన్న కేంద్రం అభ్యర్థనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. అది నిర్దేశిత న్యాయసూత్రాలకు విరుద్ధమని తేల్చిచెప్పింది.


నేరుగా గూఢచర్యం బాధితులే కోర్టును ఆశ్రయించారని పేర్కొంది. న్యాయం చేయడమే కాదు.. చేసినట్లు కనిపించాలని కూడా వ్యా ఖ్యానించింది. పెగాసస్‌ స్పైవేర్‌తో 300 భారతీయ ఫోన్‌ నంబర్లపై నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కన్సార్టియం వా ర్తలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలకు మాత్రమే విక్రయించే పెగాసస్‌ స్పైవేర్‌ టెక్నాలజీతో ప్రముఖ జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు తదితరులపై గూఢచర్యం జరిగిందని.. దీనిపై విచారణ జరపాలని ప్రముఖ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండి యా, న్యాయవాది ఎంఎల్‌ శర్మ, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిటాస్‌ తదితరులు దాఖలుచేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది.

జాతీయ భద్రతలో జోక్యం చేసుకోం కానీ..

‘దేనినైనా రహస్యంగా ఉంచదలచుకుంటే.. దానిని నీ నుంచీ దాచిపెట్టాలి’ అని ‘1984’ పుస్తక రచయిత జార్జి ఆర్వెల్‌ను ఉటంకిస్తూ.. 46 పేజీల తీర్పును చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రారంభించారు. ‘ప్రస్తుత ప్రపంచంలో గోపనీయతను నియంత్రించడం అంటే.. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి. కానీ ప్రతిసారీ జాతీయభద్రతపై ఆందోళన వ్యక్తంచేసి.. ప్రభుత్వం తప్పించుకోజాలదు. జాతీయ భద్రత పేరుతో దానిని ప్రస్తావించకుండా న్యాయవ్యవస్థను భయపెట్టలేరు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోదు. కానీ మౌనప్రేక్షకుడిగా మాత్రం ఉండదు. న్యాయసమీక్ష జరపకుండా ఎలాంటి నిషేధమూ లేదు. కేంద్రం ఈ వ్యవహారంలో కోర్టును మౌనప్రేక్షకుడిలా మార్చకుండా.. తన వైఖరిని స్పష్టంచేసి ఉండాల్సింది’ అని పేర్కొన్నారు. టెక్నాలజీని దుర్వినియోగపరిచారని పిటిషనర్లు ఆందోళన వ్యక్తంచేశారని.. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడంలో తాము ఏనాడూ వెనుకంజ వేయబోమని న్యాయమూర్తులు తెలిపారు. గోపనీయ హక్కుపై చర్చించాల్సి ఉందన్నారు. ‘ఉగ్రవాదంపై పోరుకు కేంద్ర భద్రతా సంస్థలు నిఘా పెడతాయి. గోప్యతా హక్కులో చొరబడాల్సిన అవసరమూ ఉండొచ్చు. గోపనీయ హక్కుకు పరిమితులు ఉన్నా.. ఆ పరిమితులు రాజ్యాంగ సమీక్షకు నిలబడాలి’ అని తెలిపారు.


దర్యాప్తునకు కారణాలివీ..

దర్యాప్తు కమిటీని నియమించడానికి చీఫ్‌ జస్టిస్‌ రమణ కారణాలను వివరించారు. ‘ఏదైనా అంశం సుప్రీంకోర్టు ముందు న్యాయసమీక్షకు వచ్చినప్పుడల్లా జాతీయ భద్రత వాదనను తెరపైకి తెచ్చి తప్పించుకోజాలరు. దేశ రక్షణ సమాచారం ఇవ్వకుం డా నిరాకరించడానికి కేంద్రానికి అధికారం ఉందనడం నిర్వివా దం. కానీ ప్రతిసారీ ఆ మంత్రదండాన్ని అడ్డుపెట్టుకోజాలదు. ఇలాంటి కేసుల్లో.. అడిగిన సమాచారం రహస్యంగా ఉంచాలని,   బహిర్గతం చేస్తే జాతీయ భద్రతను ప్రభావితం చేస్తుందని రుజువుచేసే ఆధారాలను కేంద్రం సమర్పించాలి. ఊరకే జాతీ య భద్రత పేరుచెప్పి కోర్టును మౌనప్రేక్షకుడిగా ఉంచలేరు. చట్టబద్ధ పాలన జరిగే ప్రజాస్వామ్య దేశంలో.. వ్యక్తులపై విచక్షణరహిత గూఢచర్యాన్ని అనుమతించలేం. నిఘా పర్యవేక్షణలో తాను ఉన్నానన్న సమాచారం ముందుగానే ఉంటే.. ఆ వ్యక్తి తనకు నచ్చినట్లుగా జీవించే హక్కుకు ప్రమాదంగా పరిణమిస్తుంది. ఇది స్వీయ సెన్సార్‌షి్‌పకు దారితీస్తుంది. పెగాసస్‌ స్పైవేర్‌ దాడి జరిగిందని రెండేళ్ల కింద బయటపడింది. అప్పటి నుంచి ఏమేం చర్యలు తీసుకున్నదీ కోర్టుకు తెలియజేసేందుకు కేంద్రానికి కావలసినంత సమయం ఇచ్చాం. జాతీయ భద్రత, దేశరక్షణకు సంబంధించిన వివరాలు చెప్పాలని తాము ఒత్తిడి తీసుకురాబోమని భారత సొలిసిటర్‌ జనరల్‌కు పలు సార్లు స్పష్టం చేశాం. పదే పదే మేం హామీ ఇచ్చినా.. అవకాశాలు ఇచ్చి నా.. కేంద్రం కేవలం పరిమిత అఫిడవిట్‌ మాత్రమే  దాఖలుచేసింది. దాని ద్వారా వాస్తవాలకు సంబంధించిన సమాచారం ఏమీ తెలియలేదు. ఈ పరిస్థితు ల్లో జాతీయ భద్రత అనిచెప్పి సరిపెట్టడం న్యాయ సమీక్ష జరపకుండా అడ్డుకోజాలదు. పెగాసస్‌ గూఢచర్యానికి సంబంధించి పిటిషనర్లు ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను కేంద్రం నిర్దిష్టంగా ఖండించలేదు. దాఖలుచేసిన పరిమిత అఫిడవిట్‌లో కూడా అస్పష్టంగా ఖండించింది. ఇది చాలదు. ఈ పరిస్థితుల్లో గూఢచర్యం ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయన్న పిటిషనర్ల వాదనను అంగీకరించడం తప్ప మాకు  మరో అవకాశం లేదు. భారత పౌరులపై విదేశీ సంస్థలు గూఢచర్యం చేశాయన్న పిటిషనర్ల వాదనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇలాంటి గూఢచర్యానికి అవకాశం ఉన్నందునే నిపుణుల కమిటీ దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది’ అని తెలిపారు.


కమిటీ నియామకం క్లిష్టతరం..

స్వతంత్ర నిపుణులను ఖరారుచేయడం చాలా కష్టతరమైందని ధర్మాసనం పేర్కొంది. ‘చాలా మంది సున్నితంగా తిరస్కరించారు. ఇంకొందరు వ్యక్తిగత కారణాలు చూపారు. వ్యక్తిగతంగా సమాచారం సేకరించి నియామకాలు జరిపాం. పారదర్శకత, సామర్థ్యం ఆధారంగా కమిటీని ఏర్పాటుచేశాం’ అని వివరించింది. పెగాసస్‌ స్పైవేర్‌ ఆరోపణలను ఇతర దేశాలు తీవ్రం గా పరిగణించాయని.. ఈ నేపథ్యంలో మన దేశం మౌనంగా ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఉగ్రవాదం, నేరాలు, అవినీతిపై పోరాటానికి నిఘా సంస్థలు వివిధ రూపాల్లో నిఘాల ద్వారా డేటాను సేకరిస్తాయని.. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించిన నిబంధనలేనని తెలిపింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం నిఘా పెట్టడానికి, డేటా సేకరించేందుకు వీల్లేదని పిటిషనర్లు చెప్పడం లేదని గుర్తుచేసింది. ‘పౌరుల గోపనీయ హక్కును ఉల్లంఘించి టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారన్నది వారి ప్రధాన వాదన. ఈ దిశగా జరిపే దర్యాప్తు.. జాతీయ భద్రతకు గానీ, జాతీయ భద్రతకు తాను తీసుకునే చర్యలకు గానీ ముప్పుగా పరిణమించరాదని కేంద్రం కూడా అంటోంది. విస్తృత ఏకాభిప్రాయాన్ని బట్టి చూస్తే.. జాతీయ భద్రతతో సంబంధం లేకుండా ఇతర కారణాలపై పౌరుల ఫోన్లు/పరికరాలపై అనధికార నిఘా, డేటా సేకరణ చట్టవిరుద్ధం.. అభ్యంతరకరం.. ఆందోళన కలిగించే అంశమని స్పష్టమవుతోంది’ అని పేర్కొంది.


కమిటీ బాధ్యతలు ఇవీ.. 

డేటా పొందడానికి, సమాచారాన్ని ఇంటర్‌సెప్ట్‌ చేయడానికి.. భారత పౌరుల ఫోన్లు, ఇతర పరికరాలపై పెగాసస్‌ స్పైవేర్‌ను వాడారో లేదో ఈ కమిటీ దర్యాప్తు చేయాలి. స్పైవేర్‌ దాడికి గురైనవారి వివరాలు సేకరించాలి. పెగాసస్‌ ద్వారా భారత పౌరుల వాట్సాప్‌ ఖాతాలను హ్యాక్‌ చేశారని 2019లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఆ నాటి నుంచి కేంద్రం తీసుకున్న చర్యలేంటి? ఈ స్పైవేర్‌ను భారత ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, కేంద్ర/రాష్ట్ర దర్యాప్తు సంస్థలు గానీ ఉపయోగించాయా? అయితే ఏ చట్టం, ఏ నిబంధన, ఏ మార్గదర్శకం, ఎలాంటి ప్రొటోకాల్‌, ఎలాంటి చట్టబద్ధ ప్రకియ్ర ప్రకారం దానిని వినియోగించాయి? దేశీయ సంస్థ లేదా వ్యక్తి భారత పౌరులపై ఈ పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించారా? ఇందుకు సంబంధిత అథారిటీ ఆమోదం పొందారా? నిర్దేశిత నియమ నిబంధనలు కాకుండా.. దర్యాప్తు చేయదగిన అంశాలుంటే వాటిపైనా విచారణ జరపొచ్చు. అలాగే నిర్దిష్ట సిఫారసులను ఈ కమిటీ చేయాల్సి ఉంటుంది. నిఘాకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టాలు, నిబంధనలకు సవరణలు లేదా కొత్త చట్టాలు తేవడం, గోపనీయత హక్కు రక్షణను మరింత మెరుగుపరచడం; దేశ సైబర్‌ భద్రతను మెరుగుపరచడం; పౌరుల గోపనీయ హక్కు ఉల్లంఘన జరగకుండా నివారించే చర్యలు సూచించడం; అక్రమంగా తమ పరికరాలపై నిఘా పెట్టారని అనుమానం వస్తే పౌరులు ఫిర్యాదు చేయడానికి అవసరమైన వ్యవస్థ ఏర్పాటు; సైబర్‌ భద్రత లోపాలు, సైబర్‌ దాడుల ముప్పు, సదరు దాడులపై దర్యాప్తునకు స్వతంత్ర సంస్థ ఏర్పాటు; పౌరుల హక్కుల పరిరక్షణకు పార్లమెంటు చట్టం చేయని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు చేపట్టాల్సిన  తాత్కాలిక చర్యలు మొదలైనవాటిపై సాంకేతిక కమిటీ సిఫారసులు చేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ‘దర్యాప్తునకు సంబంధించి ఎవరి నుంచైనా వాంగ్మూలాలు నమోదుచేయవచ్చు. కమిటీ సభ్యులను సంప్రదించి వారికి చెల్లించాల్సిన గౌరవ వేతనాన్ని ఆయన ఖరారుచేయాలి. ఆ మొత్తాన్ని కేంద్రం తక్షణమే చెల్లించాలి’ అని తెలిపింది. కమిటీకి, జస్టిస్‌ రవీంద్రన్‌కు, కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య సమాచార సమన్వయ బాధ్యతలను నిర్వర్తించాలని సుప్రీంకోర్టు ఓఎ్‌సడీ/రిజిస్ట్రార్‌ వీకే బన్సల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అన్ని అంశాల్లో కూలంకషంగా దర్యాప్తు చేసి నివేదికను సిద్ధం చేయాలని, వీలైనంత త్వరగా కోర్టు ముందుంచాలని నిర్దేశించింది.


ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ కీలకం..

‘గోపనీయత కేవలం జర్నలిస్టులు, రాజకీయ నాయకులకే కాదు.. ప్రతి వ్యక్తికీ సంబంధించిన హక్కు. ప్రజాస్వామ్యానికి మీడియా కీలక మూలస్తంభం. పత్రికాస్వేచ్ఛ గురించిన కీలక అంశాలను, జర్నలిస్టుల సోర్సుల పరిరక్షణ గురించి కూడా పిటిషనర్లు లేవనెత్తారు.  పత్రికా స్వేచ్ఛపై నిఘా విధిస్తే అది భావ ప్రకటనా స్వేచ్చపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరైన, విశ్వసనీయ సమాచారాన్ని పత్రికలు అందించలేవు. నిఘా పెట్టడం గోపనీయ హక్కుకు, ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించడమే. సదరు టెక్నాలజీతో గూఢచర్యం పత్రికా స్వేచ్ఛపై పెనుప్రభావం చూపుతుంది’ అని న్యాయమూర్తులు తెలిపారు.సభ్యులు వీరే..

జస్టిస్‌ రవీంద్రన్‌: 2005-11 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. పదవీవిరమణ తర్వాత కూడా హదియా కేసు సహా పలు కేసుల దర్యాప్తును పర్యవేక్షించారు. 2013-19 నడుమ న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎన్‌బీఎ్‌సఏ) చైర్మన్‌గా పనిచేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సిటింగ్‌ జడ్జిపై కుట్రచేశారన్న ఆరోపణలపై విచారణకు కొద్దినెలల కింద ఏపీ హైకోర్టు ఆయన్ను నియమించడం గమనార్హం.

అలోక్‌ జోషీ: 1976 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. విస్తృత దర్యాప్తు అనుభవం, సాంకేతిక నైపుణ్యం కలిగిన వ్యక్తి. కేంద్ర నిఘా విభాగం జాయింట్‌ డైరెక్టర్‌గా, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) కార్యదర్శిగా, జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్‌టీఆర్‌వో) చైర్మన్‌గా పనిచేశారు.

డాక్టర్‌ సందీప్‌ ఒబెరాయ్‌: ప్రపంచంలోనే పేరుగాంచిన సైబర్‌ భద్రత నిపుణుడు. ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్టాండర్డైజేషన్‌/ఇంటర్నేషనల్‌ ఎలకో్ట్ర-టెక్నికల్‌ కమిషన్‌/జాయిట్‌ టెక్నికల్‌ కమిటీ (ఐఎ్‌సవో/ఐఈసీ జేటీసీ1 ఎస్‌సీ7) చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవలి వరకు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎ్‌సకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సర్వీస్‌సకు గ్లోబల్‌ హెడ్‌గా ఉన్నారు.

డాక్టర్‌ నవీన్‌కుమార్‌ చౌధురి: సైబర్‌ సెక్యూరిటీ-డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ ప్రొఫెసర్‌. గుజరాత్‌లోని జాతీయ ఫోరెన్సిక్‌ విశ్వవిద్యాలయం డీన్‌. విద్యావేత్తగా, సైబర్‌ భద్రత నిపుణుడిగా 2దశాబ్దాల అనుభవం ఉంది.

డాక్టర్‌ ప్రబాహరన్‌.పి: స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌, అమృత విశ్వవిద్యాపీఠం (కేరళ). కంప్యూటర్‌ సైన్స్‌, భద్రత అంశాల్లో 2 దశాబ్దాల అనుభవం.

డాక్టర్‌ అశ్విన్‌ అనిల్‌ గుమస్తే: ఐఐటీ (బోంబే) కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరరింగ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌. ఆయన పేరిట 20 యూఎస్‌ పేటెంట్లు మంజూరయ్యాయి. 150 పరిశోధన పత్రాలను ప్రచురించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో మూడు పుస్తకాలను రచించారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోవిజిటింగ్‌ శాస్త్రవేత్త కూడా.


పెగాసస్‌ పరిణామ క్రమమిదీ..

జూలై 18: భారత్‌ సహా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన జర్నలిస్టులు, రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలపై ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ మిలిటరీ గ్రేడ్‌ స్పైవేర్‌ పరిజ్ఞానంతో గూఢచర్యానికి పాల్పడినట్లు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి.

జూలై 22: ఈ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో అడ్వకేట్‌ ఎంఎల్‌ శర్మ పిటిషన్‌. 

జూలై 27: స్వతంత్ర దర్యాప్తు జరపాలని సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ పిటిషన్‌.

ఆగస్టు 5: సుప్రీంకోర్టులో పెగాస్‌సపై విచారణ ప్రారంభం.

ఆగస్టు 16: ఊహాపోహలు, నిర్ధారణ కాని మీడియా వార్తల ఆధారంగా ఈ ఆరోపణలు చేశారంటూ పరిమిత అఫిడవిట్‌ దాఖలుచేసిన కేంద్రం.

ఆగస్టు17: ఆయా పిటిషన్లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు.

సెప్టెంబరు 13: సుప్రీంకోర్టు తీర్పు వాయిదా

అక్టోబరు 27: పెగాసస్‌ స్పైవేర్‌ ఆరోపణలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీం తీర్పు.