పోటెత్తిన ధాన్యం

ABN , First Publish Date - 2021-05-09T03:54:46+05:30 IST

నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వరి ధాన్యాన్ని రైతులు శనివారం పెద్ద మొత్తంలో తెచ్చారు.

పోటెత్తిన ధాన్యం
నారాయణపేట యార్డుకు విక్రయానికి వచ్చిన వరి ధాన్యం

నారాయణపేట మార్కెట్‌ యార్డుకు 6,000 క్వింటాళ్ల పై చిలుకు రాక

రెండు రోజుల బంద్‌తో శనివారం కిక్కిరిసిన మార్కెట్‌


నారాయణపేట, మే 8: నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వరి ధాన్యాన్ని రైతులు శనివారం పెద్ద మొత్తంలో తెచ్చారు. యార్డులో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు, బస్తాలే కనిపించాయి. రెండు రోజులుగా మార్కెట్‌ బంద్‌ ఉండటంతో రైతులు శనివారం ధాన్యంతో మార్కెట్‌కు తరలొచ్చారు. హంసలు 4,459 క్వింటాళ్లు, సోనా 1,610 క్వింటాళ్లు క్రయ విక్రయాలు జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోలు జరిగాయి.

వివిధ రకాల ధాన్యం విక్రయాలు: మార్కెట్‌ యార్డులో వరితో పాటు వివిధ రకాల ధాన్యం విక్రయాలు కొనసాగాయి. వేరుశనగ 40.80 క్వింటాళ్లు రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.4,855, కనిష్ఠ ధర రూ.3,609 పలికింది. రమారమిగా ధర రూ.4,855 పలికింది. పెసళ్లు 58.31 క్వింటాళ్లు వచ్చాయి. గరిష్ఠ ధర రూ.6,555, కనిష్ఠ ధర రూ.1,430, రమారమిగా ధర రూ.6,360, జొన్నలు 58.31 క్వింటాళ్లు రాగా గరిష్ఠ ధర రూ.3,825, కనిష్ఠ ధర రూ.3,005, రమారమిగా రూ.3,475 ధర పలికింది. వరి హంసలు 1,610.40 క్వింటాళ్లు రాగా గరిష్ఠ ధర రూ.1,569, కనిష్ఠ ధర రూ.901, రమారమిగా రూ.1,356, సోనా 4,459.80 క్వింటాళ్లు రాగా గరిష్ఠ ధర రూ.1,531, కనిష్ఠ ధర రూ.901, రమారమిగా రూ.1,400 ధర పలికింది. 

10 నుంచి యార్డులో స్వచ్ఛంద లాక్‌డౌన్‌: వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ నెల 10 నుంచి 16 వరకు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తామని గంజ్‌ అసోసియేషన్‌ వ్యాపారులు మార్కెట్‌ కమిటీ పాలకులకు, అధికార యంత్రాంగానికి ఇదివరకే వినతిని అందించారు. దాంతో సోమవారం నుంచి యార్డులో ధాన్యం క్రయ విక్రయాలు నిలిచి పోనున్నాయి.

కొనుగోలు కేంద్రానికి రాని గన్నీ బ్యాగులు: నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో శనివారం కూడా గన్నీ బ్యాగులు రాక పోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాగులు సోమవారం వస్తాయని సిబ్బంది రైతులకు నచ్చజెప్పి పంపించారు.

గన్నీ బ్యాగుల కోసం ఎగబడ్డ రైతులు

ఊట్కూర్‌: ఊట్కూర్‌ సింగిల్‌ విండో కార్యాలయానికి శనివారం వచ్చిన గన్నీ బ్యాగులను రైతులు ఎగబడి తీసుకెళ్లారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రానికి గతంలో 70 వేల బ్యాగులు వచ్చాయి. మళ్లీ రాకపోవడంతో రైతులు నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. శనివారం ఉదయం కూడా అవుసులోన్‌పల్లి, బిజ్వార్‌, కొత్తపల్లి గ్రామాల రైతులు బ్యాగుల కోసం వచ్చారు. లేవని చెప్పడంతో నిరసన తెలిపారు. మధ్యాహ్నం 23 వేల బ్యాగులతో లారీ వచ్చింది. ఏ గ్రామానికి ఎన్ని ఇవ్వాలోనని విండో అఽధ్యక్షుడు బాల్‌రెడ్డి, సిబ్బంది కలిసి నిర్ణయించారు. సమాచారం అందుకున్న ఊట్కూర్‌తో పాటు ఇతర గ్రామాల రైతులు కార్యాలయానికి చేరుకుని బ్యాగులు కావాలని అడిగారు. అన్ని గ్రామాలకు కొన్ని ఇవ్వాలని నిర్ణయించారు. లోడ్‌ దింపడానికి హమాలీలు ఇద్దరే ఉండటంతో కొన్ని గ్రామాల వారికి మీరే బ్యాగులు తీసుకోవాలని చెప్పారు. వారు బ్యాగులను తీసి కింద వేస్తుండగానే అందరికీ సరిపోవని రైతులంతా ఎగబడి బ్యాగులను తీసుకెళ్లారు. వందల మంది రైతులు ఉండటంతో విండో సిబ్బంది, పోలీసులు ఏమీ చేయలేకపోయారు. క్షణాల్లో లారీ ఖాళీ అయ్యింది. ఏ గ్రామాల వారు ఎన్ని తీసుకున్నారోనని ఆరా తీయగా 4 వేల బ్యాగుల లెక్క తెలడం లేదని అధ్యక్షుడు బాల్‌రెడ్డి తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని రైతులు అన్నారు.



Updated Date - 2021-05-09T03:54:46+05:30 IST