ఉద్దానానికి వంశధార నీరు

ABN , First Publish Date - 2020-10-20T08:23:52+05:30 IST

ఉద్దానం ప్రజలకు శుభవార్త. ఇంటింటికీ రక్షిత నీరు అందించేందుకు నిర్మించ తలపెట్టిన సమగ్ర తాగునీటి పథకానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి.

ఉద్దానానికి వంశధార నీరు

సమగ్ర తాగునీటి పథకానికి ఏటా 1.12 టీఎంసీలు

ఉత్తర్వులు జారీచేసిన జల వనరుల శాఖ

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ఉద్దానం ప్రజలకు శుభవార్త. ఇంటింటికీ రక్షిత నీరు అందించేందుకు నిర్మించ తలపెట్టిన సమగ్ర తాగునీటి పథకానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా గొట్టాబ్యారేజీ నుంచి ఏటా 1.12 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతిస్తూ సోమవారం జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వంశధార నీటిని మళ్లించి ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలు, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో ఇంటింటికీ రక్షిత నీరు అందించాలన్నది సమగ్ర తాగునీటి పథకం ఉద్దేశం. రూ.600 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. గొట్టాబ్యారేజీ నుంచి ప్రత్యేక పైపులైన్‌ ద్వారా నీటిని తరలించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి డీపీఆర్‌ను తయారుచేసి ప్రభుత్వానికి నివేదించడంతో పాటు టెండర్లు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.   


 గత ప్రభుత్వ హయాంలో శ్రీకారం

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికం. ఇందుకు తాగునీరు కూడా ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వం సమగ్ర తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి అవసరమైన డీపీఆర్‌ సిద్ధం చేసింది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు జరగ్గా.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్‌ పాదయాత్రలో భాగంగా ఉద్దానంలో పర్యటించిన సందర్భంలో సురక్షిత నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయన కిడ్నీ రీసెర్చ్‌ యూనిట్‌కు శంకుస్థాపన  చేశారు.

ఈ నేపథ్యంలో సమగ్ర తాగునీటి పథకం తెరపైకి వచ్చింది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించింది. ఇప్పుడు తాజాగా వంశధార జలాల వినియోగానికి ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పథకం పనులు మరింత వేగవంతం కానున్నాయని ఉద్దానం ప్రాంతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


 తొమ్మిది క్లస్టర్లుగా విభజించి

 తొమ్మిది క్లస్టర్లుగా విభజించి తాగునీటిని అందించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పలాస నియోజకవర్గంలోని పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలు, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురంతో పాటు పాతపట్నం నియోజకవర్గంలోని మెళియాపుట్టి, పాతపట్నం మండలాలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. గొట్టా బ్యారేజీ నుంచి పైపులైన్‌ నిర్మించి  వివిధ మండలాలకు తాగునీరు అందించాలన్నది లక్ష్యం.

వంశధార జలాల వినియోగం విషయంపై  ఎస్‌ఈ తిరుమలరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు.  ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల ప్రతిపాదన మేరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. 

 


Updated Date - 2020-10-20T08:23:52+05:30 IST