గుడివాడలో గర్జన

ABN , First Publish Date - 2022-09-25T09:21:54+05:30 IST

కవ్వించారు.. తొడలు చరిచారు.. శాంతంగా పడుతున్న అడుగుల్లో అలజడి రేపాలని చూశారు.. రాజధాని రైతులను పదేపదే రెచ్చగొట్టారు. పాదయాత్రికుల సహనంతో చెలగాటం ఆడారు. పాదయాత్ర భగ్నానికి గుడివాడలో కావాలనే వైసీపీ నేతలు

గుడివాడలో గర్జన

వైసీపీ కవ్వింపులతో ఉద్రిక్త వాతావరణం

తొడలు చరుచుకుని సవాళ్లు, ప్రతి సవాళ్లు

మహాపాదయాత్ర భగ్నానికి కుయుక్తులు

వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు

వారికి చెప్పు చూపించిన టీడీపీ నేత మాగంటి

తొడగొట్టిన మహిళా టీడీపీ నాయకురాలు

తోపులాటలు.. పోలీసులతో తీవ్ర వాగ్యుద్ధాలు

‘మద్దతు’ అందకుండా ఖాకీల అత్యుత్సాహం

గుడివాడకు చేరకుండా అన్ని దారులూ కట్టడి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కవ్వించారు.. తొడలు చరిచారు.. శాంతంగా పడుతున్న అడుగుల్లో అలజడి రేపాలని చూశారు.. రాజధాని రైతులను పదేపదే రెచ్చగొట్టారు. పాదయాత్రికుల సహనంతో చెలగాటం ఆడారు. పాదయాత్ర భగ్నానికి గుడివాడలో కావాలనే వైసీపీ నేతలు ఉద్రిక్తతలను రాజేశారు. దీనికితోడు పోలీసుల వైఖరి మరింతగా పరిస్థితిని వేడెక్కించింది. గొడవగానీ, ఘర్షణగానీ లేకుండా ఇన్నాళ్లుగా సాగుతున్న రాజధాని రైతుల అమరావతి మహాపాదయాత్రను  అడ్డుకోవాలని శతథా ప్రయత్నించారు. ఈ క్రమంలో యుద్ధ వాతావరణం నెలకుంది. వైసీపీ నేతలు, యాత్రలో నడుస్తున్న టీడీపీ నేతలు తొడలు చరుచుకుని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. రాజధాని రైతులు ఇంత ఉద్రిక్తతల్లోనూ గుడివాడలో యాత్ర ముగించుకోగలిగారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు కృష్ణా జిల్లా కౌతవరం నుంచి యాత్ర ప్రారంభమైంది. కౌతవరం, గుడ్లవల్లేరు, అంగలూరు, బొమ్ములూరు మీదుగా గుడివాడ పట్టణ శివారు వరకు 19 కిలోమీటర్లమేర సాగింది. 


‘గుడివాడ వచ్చాం...’

బొమ్ములూరు మీదుగా పాదయాత్ర గుడివాడలోకి ప్రవేశించింది. అక్కడి శరత్‌ థియేటర్‌ సెంటర్‌ వద్ద కొంకితల ఆంజనేయ ప్రసాద్‌, మరో ఇద్దరు వైసీపీ నాయకులు పాదయాత్ర చేస్తున్న రైతులను, వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని రెచ్చగొడుతూ తొడలుచరిచారు. పాదయాత్రలో ఉన్నవారు కొంత సంయమనం పాటించినప్పటికీ...మరింతగా వైసీపీ నాయకులు రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీనిని తట్టుకోలేకపోయిన ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు.... వచ్చే ఎన్నికల్లో మీసంగ తి చూస్తామంటూ చెప్పును తీసి చూపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాదయాత్ర చేస్తున్న వారిని ముందుకువెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటుచేశారు.


వైసీపీ నాయకులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో పోలీసులు పాదయాత్ర చేస్తున్న రైతులను నెట్టివేశారు. దీనిపై స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. నెహ్రూ చౌక్‌ సెంటర్‌ వద్దకు యాత్ర రాగానే.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏలూరుకు చెందిన న్యాయవాది, .రైతు అభినయశ్రీ సింధూర ‘అన్నా తొడగొట్టన్నా’ అని కోరారు. ‘నేనెందుకమ్మా నువ్వే పైకివచ్చి తొడగొట్టం’టూ ఆమెను ప్రభాకర్‌ ప్రోత్సహించారు. వ్యాన్‌పైకి వచ్చిన సింధూర తొడగొట్టి ‘గుడివాడ వచ్చా’మంటూ సవాల్‌ విసిరారు. వీకేఆర్‌ అండ్‌ వీఎన్‌వీ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రాంగణంలో మరోసారి ఆమె అదే పనిచేశారు. 


పోలీసుల ‘అతి’..

గుడివాడలో కొనసాగుతున్న పాదయాత్రకు బయటి మద్దతు అందకుండా కంకిపాడు మండల పరిధిలోని దావులూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు కట్టడిచేశారు. ఇతర జిల్లాలనుంచి ఎవరూ తరలివచ్చి యాత్రలో కలవకుండా చేసేందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంతలో గుడివాడకు బయలుదేరిన కృష్ణా జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధను అక్కడకు వచ్చారు. ఆమె కారును టోల్‌గేట్‌ వద్ద సీఐ కాశీవిశ్వనాథ్‌ అడ్డుకున్నారు. కోర్టు అనుమతి ఉంటేనే వెళ్లనిస్తామనడంతో.. వాగ్వాదం జరిగింది. అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పడంతో వెనక్కు వెళ్లి ఆమె పునాదిపాడు, కోలవెన్ను, కుందేరు మీదుగా గుడివాడ వెళ్లారు. పిడుగురాళ్లకు చెందిన ఓ బృందం పెళ్లి చూపులకు భీమవరం వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారిని బలవంతంగా కిందకు దించారు. ఆధార్‌, పాన్‌కార్డులు చూపించాలన్నారు.


వాహనంలో ఉన్న ఓ వ్యక్తి ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు చూపించినా అందరూ చూపించాలంటూ మొండిగా వ్యవహరించారు. వారందరినీ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు... గుడివాడలో జరిగే మహాపాదయాత్రకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతుల తరలిరాకుండా పోలీసులు ఎక్కడకక్కడ నిర్బంధం చేశారు. 


నేతలపై నిఘా.. కట్టడి

ముదినేపల్లి వద్ద కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను పోలీసులు అడ్డుకున్నారు. తాను విజయవాడ వెళ్లాల్సి ఉందని, ఇది అప్రజాస్వామ్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాగ్వావాదాలు పెరిగి ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో పోలీసులు జయమంగళతో పాటు టీడీపీ నాయకులను అరెస్టుచేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా, హనుమాన్‌ జంక్షన్‌ వద్ద జెడ్పీ మాజీ చైర్మన్‌ నల్లగట్ల సుధారాణిలను పోలీసులు అడ్డుకున్నారు. కౌతవరం వద్ద పోలీసులు ప్రత్యేక చెక్‌ పోస్టును ఏర్పాటుచేసి ఇతర ప్రాంతాల రైతులను గుడివాడకు రాకుండా నిలిపివేశారు. అయినా.. పొరుగు ప్రాంతాల రైతులు వాహనాలను పక్కనపెట్టి కొంతదూరం నడుచుకుంటూవచ్చి, అందుబాటులో ఉన్న వాహనాల ద్వారా పాదయాత్ర జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.


అంతిమ విజయం మాదే...

‘‘గుడివాడలో పాదయాత్ర సందర్భంగా పోలీసులు శనివారం టియర్‌గ్యాస్‌, రబ్బరు బుల్లెట్లతో వచ్చారు. ఆ ప్రాంతమంతా యుద్ధవాతావరణం సృష్టించారు. ఇదంతా చూసినప్పుడు మహాపాదయాత్రకు ప్రభుత్వం భయపడుతోందని అర్ధమవుతోంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎంతగా రెచ్చగొట్టినా పాదయాత్రను ప్రశాంతంగా సాగిస్తాం. అంతిమంగా అమరావతి రాజధాని విషయంలో జేఏసీనే విజయం సాధిస్తుంది’’

అమరావతి జేఏసీ నేత కొలిక పూడి శ్రీనివాసరావు




పోలీస్‌ వలయాన్ని ఛేదించుకుని..

పెదవేగి, సెప్టెంబరు 24: పాదయాత్రకు బయలుదేరిన ఏలూరు జిల్లా దెందులూరు మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నించారు. దుగ్గిరాలలోని స్వగృహానికి వెళ్లి నోటీసు ఇవ్వబోగా, ఆయన తీసుకోలేదు.  గృహ నిర్బంధం విధించడానికి సిద్ధమవుతుండగానే... పోలీసుల కళ్లుగప్పి గుడివాడ చేరుకున్నారు. గుడివాడలో పోలీసులు ప్రభాకర్‌ రావడాన్ని గమనించి, నిలువరించే ప్రయత్నం చేశారు. వెంటనే ప్రభాకర్‌ కారునుంచి దిగి, అనుచరుడి ద్విచక్రవాహనంపై ఎక్కి పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ.. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. 

Updated Date - 2022-09-25T09:21:54+05:30 IST