పెద్దారెడ్డి కొడుకు..సొంత పార్టీవారికే నచ్చడు

ABN , First Publish Date - 2022-06-12T06:35:31+05:30 IST

తాడిపత్రి అంటే.. జేసీ కుటుంబం కంచుకోట. వారున్న పార్టీ ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా.. వారు తాడిపత్రిలో ఓడిందే లేదు

పెద్దారెడ్డి కొడుకు..సొంత పార్టీవారికే నచ్చడు
తీవ్రంగా గాయపడిన కౌన్సిలర్‌ మల్లికార్జున

పెద్దారెడ్డి కొడుకు!

డబ్బుకే పాధాన్యమిస్తాడని విమర్శ

జేసీ ఇంట్లోకి చొరబాటులో దూకుడు

నిత్యం వివాదాల్లో కేతిరెడ్డి హర్షవర్ధన రెడ్డి

తాజా దాడితో ఆయన తీరుపై ప్రజల్లో చర్చ


తాడిపత్రి అంటే.. జేసీ కుటుంబం కంచుకోట. వారున్న పార్టీ ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా.. వారు తాడిపత్రిలో ఓడిందే లేదు. అలాంటి చోట ‘ఒక్క ఛాన్స’ నినాదం వర్కవుట్‌ అయ్యింది. అనూహ్యంగా పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. శాంతిభద్రతలు.. స్వేచ్ఛ.. అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. దీనికి ఆయన తనయుడే తూట్లు పొడుస్తున్నారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి కాదు.. సొంత పార్టీవారే హర్షవర్ధన రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. హర్ష పేరు చెబితే.. ఆది నుంచి వివాదాలే అని అన్ని వర్గాలూ అంటున్నాయి. తాజా ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోమారు పెద్దారెడ్డి కొడుకు వార్తల్లోకి ఎక్కారు.

- తాడిపత్రి 


మొదట్నుంచీ అంతే..

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు కేతిరెడ్డి హర్షవర్ధన రెడ్డి తీరు మొ దటి నుంచీ అంతే. ఇది ప్రత్యర్థులు అంటున్నమాట కాదు. సొంత పార్టీలోనే ఆయన వ్యవహార శైలిపై ఉన్న విమర్శ ఇది. సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌  మరమ్మతులు చేయిస్తున్న టీడీపీ వర్గీయులపై అనుచరులతో కలిసి శనివారం చేసిన దాడితో మరోమారు హర్ష వర్ధన రెడ్డి గురించి జనంలో చర్చ మొదలైంది. సొంత పార్టీవారితోనే కలుపుగోలుగా ఉండరని, డబ్బుకే ప్రాధాన్యం ఇస్తాడని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. 2020 డిసెంబరులో జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లోకి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చొరబడ్డారు. ఆ నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలలో హర్ష ముందు ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అనుచరులతో కలిసి రాళ్లు విసురుతూ, జేసీ నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించారని, జేసీ అనుచరుల ప్రతిఘటనతో పక్కనున్న ఇంటిలోకి వెళ్లి తలదాచుకున్నాడని చెబుతారు. ఆ సమయంలో డీఎస్పీ చైతన్య, ఇతర పోలీసు అధికారులు హర్షపై దాడి జరగకుండా రక్షణగా నిలిచారు. ఎమ్మెల్యే కొడుకు ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు ప్రాణాలొడ్డారటే అతిశయోక్తి కాదు. జేసీ ఇంటిపై నుంచి అనుచరుల రాళ్లతో ప్రతిదాడి చేస్తుండగా, పోలీసులు తుపాకులతో బెదిరిస్తూ ఆ ఇంటిలో తలదాచుకున్న ఎమ్మెల్యే తనయున్ని తమ వాహనంలో సురక్షితంగా తీసుకువెళ్లారు. ఆ సమయంలో పోలీసులు ఏమరపాటుగా ఉంటే పెద్ద ముప్పు ఏర్పడేది.


ఆయన తీరుతోనే ఓటమి..

హర్ష వ్యవహారశైలి కారణంగానే మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో తాడిపత్రిలో మాత్రమే అధికారపార్టీకి చుక్కెదురైంది. ఆ ఎన్నికల్లో చైర్మన అభ్యర్థిగా హర్షవర్ధన రెడ్డిని ఆయన తండ్రి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎంపికచేశారు. అప్పటికే చైర్మన పదవిపై అనేక మంది పెట్టుకున్న ఆశలు ఎమ్మెల్యే ప్రకటనతో ఆవిరయ్యాయి. నామినేషన్ల సమయంలో చోటుచేసుకున్న సంఘటనలు, అధికార పార్టీ నాయకుల బెదిరింపులు కూడా ఓటమికి కారణమయ్యాయి. ఎన్నికల్లో నిలబడితే గెలుస్తానో లేదో అన్న అనుమానంతో, సామదానబేధ దండోపాయాలతో 31వ వార్డును ఏకగ్రీవం చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓటమితో కొడుకును చైర్మన చేయాలనుకున్న ఎమ్మెల్యే ఆశలు నెరవేరలేదు. హర్షవర్దనరెడ్డి చైర్మన కాకుండా, సొంతపార్టీ వారే వ్యతిరేకంగా పనిచేశారన్న ప్రచారం కూడా జరిగింది. కౌన్సిలర్‌గా ఉన్న ఎమ్మెల్యే తనయుడు,  కౌన్సిల్‌ మీట్‌లో అధ్యక్షస్థానంలో ఉండే చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఏకవచనంతో సంబోధించారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేయగా, చైర్మన జేసీ వారించారు. ఆయన విజ్ఞతకే వదిలేద్దామని శాంతపరిచారు. అదే కౌన్సిల్‌ మీట్‌లో ఒక పత్రిక విలేకరిని అవమానించేలా హర్ష వర్ధన రెడ్డి మాట్లాడారు.


చెప్పి.. దాడి చేశారు..

వైసీపీ వ్యవహారాలపై 30వ వార్డు కౌన్సిలర్‌ మల్లికార్జున సోషల్‌ మీడియాలో ఘాటుగా పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో ఒక ప్రెస్‌మీట్‌లో వైసీపీవారు హెచ్చరించారు. తమ ఆదాయ మార్గాలకు అడ్డువస్తే దాడులకు తెగబడతామని ముందే చెప్పారు. అన్నట్లుగానే ఓ కౌన్సిలర్‌, మరికొందరిపై దాడి చేశారు. 


అనుచరులు, కౌన్సిలర్లతో సమావేశం

దాడి విషయం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన తాడిపత్రికి వచ్చారు. వారం క్రితం హైదరాబాద్‌లో ఆయన కుడికంటికి ఆపరేషన చేయించుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే తాడిపత్రికి వచ్చిన ఆయన, సాయంత్రం తన నివాసంలో టీడీపీ నాయకులు, అనుచరులు, కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. దాడి గురించి చర్చించారు. నాయకులు, కార్యకర్తలు క్షణికావేశానికి లోనుకావద్దని, దాడిచేసిన వారికి ప్రజలే బుద్ధిచెబుతారని సూచించారు. మనం సంయమనం పాటించి, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడదామని అన్నారు.


దాడి చేయించి.. బందోబస్తా? 

దాడి చేయించేది మీరే.. బందోబస్తు వచ్చేదీ మీరేనా? అని తన నివాసం వద్ద బందోబస్తు ఉన్న పోలీసులను జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతీకార దాడులు జరగకుండా, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి నివాసానికి నలువైపులా పోలీసులు మోహరించారు. ఆయన ఇంటి వద్దకు ప్రజలు ఎవరూ రాకుండా బారికేడ్లు, ఖాళీ డ్రమ్ములను నాలుగువైపులా అడ్డుగా పెట్టారు. 


ఎదురు కేసు..

దాడి ఘటన నేపథ్యంలో హర్షవర్ధన రెడ్డితోపాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెడతామని డీఎస్పీ చైతన్య ప్రకటించారు. దీనికి పోటీగా వైసీపీ వర్గీయులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కౌన్సిలర్లు, ఆ పార్టీవారు దళితుడైన తన పై దాడిచేసి గాయపరిచారని వైసీపీ వర్గీయుడు సునీల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దాడిలో తన చేతికి గాయాలయ్యాయని పేర్కొన్నాడు. టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడ్డాడా? లేక ఎమ్మెల్యే తనయుడిపై నమోదైన కేసుకు పోటీగా ఫిర్యాదు చేశారా అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


ఇదేనా స్వేచ్ఛ?

జేసీ ప్రభాకర్‌రెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడామని, ప్రజలకు, మీడియాకు స్వేచ్ఛ కలిగించామని 2019 ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఎమ్మెల్యే పెద్దారెడ్డి పత్రికాముఖంగా వ్యాఖ్యానించారు. ప్రజలకు అండగా ఉంటానని, పత్రికాస్వేచ్ఛను కాపాడతానని, తాడిపత్రిలో ప్రశాంతత నెలకొల్పేందుకు నడుంబిగించానని చెప్పుకున్నారు. అందుకే ఎక్కడో ఉన్న తాను తాడిపత్రికి వచ్చి ఎన్నికల్లో గెలిచానని, ఇక్కడి ప్రజల రుణం ఎప్పటికి తీర్చుకోలేనని పలుమార్లు ప్రకటించారు. కానీ తన కుమారుడే ఇలా వ్యవహరిస్తుంటే.. ఏం సమాధానం చెబుతారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పైప్‌లైన మరమ్మతు పనులు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ పనులను అడ్డుకోవడంతోపాటు.. కవరేజీకి వెళ్లిన విలేకరులపై దాడికి దిగారు. దీనిపై ఎమ్మెల్యే ఏం సమాధానం చెబుతారో అన్న చర్చ జరుగుతోంది. తనయుడి వ్యవహారాల వెనుక తానే ఉన్నా రా..? అన్న అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి.


కౌన్సిలర్లకు రక్షణ ఏదీ..?

ఎమ్మెల్యే తనయుడు హర్షవర్ధనరెడ్డి కౌన్సిలర్‌గా ఉండి కూడా దాడి చేయిస్తుంటే మాకు రక్షణేది..? తాడిపత్రిలో రాక్షసపాలన జరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాడులు చేస్తూ పోతున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? నియంత పాలన ఉందా? ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి. పట్టపగలు పోలీసులు చూస్తుండగానే దాడి చేశారంటే.. పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారిపోయాయో తెలుస్తోంది. 

- రేష్మ, 26వ వార్డు కౌన్సిలర్‌ 


ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తాం..

జరిగిన దాడిపై ఎమ్మెల్యే తనయుడు హర్షవర్ధనరెడ్డితోపాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేస్తాం. ఈ దాడిపై దళిత వర్గానికి చెందిన 30వ వార్డు కౌన్సిలర్‌ మల్లికార్జున, విలేకరి ఎర్రిస్వామి చేసిన ఫిర్యాదును అనుసరించి చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. వివిధ వర్గాల నుంచి వచ్చిన వీడియో ఫుటేజీ సేకరించి, నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేస్తాం. దాడికి ఉపయోగించిన వాహనాలను కూడా సీజ్‌ చేస్తాం.

- డీఎస్పీ చైతన్య




Updated Date - 2022-06-12T06:35:31+05:30 IST