ఆదివాసుల సమగ్రాభివృద్ధికి పెద్దపీట

ABN , First Publish Date - 2022-08-10T06:12:31+05:30 IST

ఆదివాసుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా గిరిజనులకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు.

ఆదివాసుల సమగ్రాభివృద్ధికి పెద్దపీట
అడ్డాకుల గిడుగులు ధరించి, విల్లంబులు ఎక్కు పెట్టిన మంత్రులు రాజన్నదొర, అమర్‌నాధ్‌, ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ రవిబాబు

- ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదొర 

- ఘనంగా ఆదివాసీ దినోత్సవం 

పాడేరు, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఆదివాసుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా గిరిజనులకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. స్థానిక అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవం లో ఆయన మాట్లాడారు. గిరిజన హక్కులు, చట్టాలు పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌లో మిన్నగా ఉందన్నారు. అంతకు ముందు మంత్రులు రాజన్నదొర, అమర్‌నాథ్‌లు తుడుము కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాల, పార్వతీపురంలో ఇంజనీరింగ్‌ కళాశాలను నిర్మిస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చింతపల్లి మండలం తాజంగిలో రూ.35 కోట్లతో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మిస్తున్నామన్నారు. అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ ఏజెన్సీలో 1/70, పీసా చట్టాల పరిరక్షణ బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాష్ట్ర ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కుంభా రవిబాబు, జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, టీడబ్ల్యూ డైరెక్టర్‌ ఎం.జాహ్నావి, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ సతీశ్‌కుమార్‌, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌, జీసీసీ ఎండీ సురేశ్‌కుమార్‌, ట్రైకార్‌ ఎంపీడీ ఈ.రవీంద్రబాబు, ట్రైకార్‌ ఈడీ జి.చినబాబు, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



రూ.134 కోట్ల అభివృధ్ది పనులకు శ్రీకారం 

 ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో రూ.134 కోట్ల అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర,  పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ సంయుక్తంగా మంగళవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలోని ఎనిమిది ఐటీడీఏల పరిధిలోని రూ.119 కోట్ల వ్యయంతో చేపట్టే ఐదు అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపనలు, మరో రూ.15 కోట్లతో చేపట్టిన తొమ్మిది పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎస్‌హెచ్‌సీ మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కును అందించారు. 

అల్లూరి పోరాటంపై పుస్తకావిష్కరణ

రాష్ట్ర గిరిజన సంస్కృతిక, పరిశోధన, శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో మన్యంలో అల్లూరి సీతారామరాజు చేపట్టిన మన్యం పితూరిపై కరణం సత్యనారాయణ రచించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆవిష్కరించారు. 

Updated Date - 2022-08-10T06:12:31+05:30 IST