Oct 20 2021 @ 12:10PM

దీపావ‌ళికి ‘పెద్దన్న’ సోలో మ్యాజిక్

సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా.. శివ దర్శకత్వంలో రూపొందిన హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పెద్దన్న’. ‘అన్నాత్త’ తమిళ చిత్రానికి డబ్బింగ్ వెర్షన్ గా రాబోతున్న ఈ సినిమా.. ‘దర్బార్’ తర్వాత తలైవా నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే టీజర్ ఇటీవలే విడుదలైంది. అందులోని రజినీగెటప్, డైలాగ్స్ ,మేనరిజమ్స్ అభిమానుల్ని ఎంతగానో మెప్పించాయి. కొంత కాలంగా సరైన హిట్స్ లేని రజినీకాంత్ ఈ సినిమాతో మళ్ళీ తన రేంజ్ ఏంటో తెలియచెప్పబోతున్నారని కోలీవుడ్ టాక్. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ‘అన్నాత్త’ మూవీ.. అదే రోజున తెలుగులో కూడా విడుదల కాబోతోంది.  



అయితే ‘పెద్దన్న’ విడుదల నేపథ్యంలో దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో సినిమా విడుదల కావడం లేదు. అందుకే  ‘పెద్దన్న’ సినిమా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. ఆ టైమ్ లో టాలీవుడ్ లో వేరే సినిమాలేవీ విడుదల కావడం లేదు. దాంతో దీపావళికి ‘పెద్దన్న’ గా రజినీ సోలో మ్యాజిక్ షురూ అవుతుందని చెప్పక తప్పదు. కోలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై చాలా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. రజినీ సినిమా  అక్కడ హిట్టైతే.. దాదాపుగా ఇక్కడా హిట్టే. మరి పెద్దన్న ఏ రేంజ్ హిట్ కొడతారేమో చూడాలి.