Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెదవాగుకు మహర్దశ

తెలంగాణలో ప్రాజెక్టు.. ఆంధ్రలో ఆయకట్టు

కొన్నేళ్లుగా నిర్వహణ లేక రైతులకు కడగండ్లు

గోదావరి బోర్డుకు అప్పగింతతో సరికొత్త ఆశలు


పెదవాగు ప్రాజెక్టు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల పరిధిలోని ఉమ్మడి ప్రాజెక్టు. ఇప్పటివరకు ఉభయ రాష్ట్రాల నిర్లక్ష్యా నికి గురై.. రైతులకు కడగండ్లు మిగిల్చిన ప్రాజెక్టు.. ఇకపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిలోకి వెళ్లనుండడంతో తమ కష్టాలు తీరనున్నాయని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


వేలేరుపాడు, అక్టోబరు 21 : రెండు రాష్ట్రాల పరిధిలో వున్న పెదవాగు ప్రాజెక్ట్‌ సమన్వయ లోపం కారణంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రాజెక్ట్‌ తెలంగాణలోని అశ్వరావుపేట మండలం గుమ్మడిపల్లిలో ఉండగా ఆయకట్టు 80 శాతానికి పైగా మన రాష్ట్రంలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణ తెలంగాణ ఆధీనంలో ఉండటంతో ప్రాజెక్ట్‌ నీటిని అధిక భాగం తమ అవసరాలకే ఉపయోగించుకుంటుంది. ప్రాజెక్ట్‌ కింద కేవలం 2,700 ఎకరాలు మాత్రమే తెలంగాణ ప్రాంత సాగు భూమి ఉండగా, మిగిలిన నీటిని సాగు నీటి అవసరాలకు నిల్వ చేస్తోంది. దీని కారణంగా ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని భూములకు సాగు నీరందడం లేదు. ఒకవేళ కాల్వలకు నీళ్లు అందించినా ఎక్కడికక్కడ గండ్లు పడటంతో భూములకు నీళ్లు రావడం లేదు. ఆంధ్రకు నీరు వదలాలంటే ప్రాజెక్ట్‌ నిర్వహణకు నిధులు విడుదల చేయాలని 2015లోనే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రాకు స్పష్టం చేసింది. అయితే దీనిపై ఇటు నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో కేవలం తమ అవసరాలకు సరిపడినంత వరకు మాత్రమే ప్రాజెక్ట్‌ను ఉపయోగిస్తోంది. 


ఇదీ ప్రాజెక్టు స్వరూపం


1979లో పెద్దవాగు ప్రాజెక్ట్‌ వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు సాగు నీరందించేలా నిర్మించారు. నీటి నిల్వ సామర్థ్యం 0.50 టీఎంసీలు. మూడు గేట్లను అమర్చారు. మొత్తం ఆయకట్టు 16 వేల ఎకరాలు. ప్రాజెక్టుకు కుడి, ఎడమల కాలువలను నిర్మించారు. 

ప్రాజెక్ట్‌ కింద తెలంగాణలోని గుమ్మడిపల్లి, కొత్తూరు గ్రామాల పరిధిలోని 2,700 ఎకరాలు, కుడి, ఎడమ కాలువల కింద వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 13,300 ఎకరాలకు సాగు నీరందేలా ప్రధాన కాలువలు, ఉప కాలువలు నిర్మించారు. ప్రాజెక్ట్‌ నిర్మించిన కొన్నేళ్లపాటు ఈ రెండు మండలాల కాలువల ద్వారా సాగు నీరందింది. 

2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ప్రాజెక్టు తెలంగాణలోను ఉండిపోయింది. ఏపీలో ఏడు మండలాలు విలీనం కావడంతో ఆయకట్టు ఇక్కడ ఉంది. దీంతో రెండు రాష్ట్రాల పరిధిలోని ఉమ్మడి ప్రాజెక్టుగా మారింది. 


పెద వాగు దశ మారేనా..?


విభజన తర్వాత ప్రాజెక్ట్‌ నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడం, కాలువలకు గండ్లు పడిపోవడంతో సాగు నీరు సక్రమంగా అందలేదు. కుడి, ఎడమ కాలువలు పూర్తిగా ధ్వంసమ య్యాయి. ఆంధ్ర ప్రభుత్వం నిధులు విడుదలకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం తమ భూభాగంలోని కాలువలకు మాత్రమే మరమ్మతులు చేసుకుని సాగు నీరందిస్తోంది. పెద వాగు ప్రాజెక్ట్‌ అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణ బాధ్యతలను గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అప్పగించేందుకు ఇటీవల రెండు రాష్ట్రాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ప్రాజెక్ట్‌ ఆధునీకరణకు బోర్డు నిర్వహణకు రూ.8 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఈ మీడియం ప్రాజెక్ట్‌కు మహర్దశ పట్టినట్టే. ఏ లక్ష్యంతో ప్రాజెక్ట్‌ను నిర్మించారో ఆ లక్ష్యం నెరవేరుతుంది. జీఆర్‌ఎంబీ పరిఽధిలోకి వస్తే దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం పూడికతో నిండిపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. పూర్తిగా దెబ్బతిన్న కుడి, ఎడమ ప్రధాన కాలువలను, అలాగే ఉపకాలువల పునరుద్దరణ పనులు చేపట్టే అవకాశం ఉంది. సరైన నిర్వహణ లేక ప్రాజెక్ట్‌కు వున్న మూడు గేట్లు మరమ్మతులకు గురై శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఈ గేట్ల స్థానంలో కొత్త గేట్లను అమర్చే వీలుంది. ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రాజెక్ట్‌కు మహర్దశ పట్టినట్టే.

Advertisement
Advertisement