అనపర్రు కార్యకర్తల సమావేశంలో కుప్పకూలిన లక్ష్మి
వైసీపీలో ముసలం!
పదవుల పంపిణీలో తీవ్ర అసంతృప్తి
జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు రాజీనామాకు సిద్ధం
తమ వర్గానికి ఎంపీపీ ఇవ్వలేదనే కారణంతో మనస్తాపం
పెదనందిపాడు(గుంటూరు): గతంలో హామీ ఇచ్చి.. ఇప్పుడు తమ వర్గానికి ఎంపీపీ పదవి ఇవ్వడం లేదనే కారణంతో ఓ జడ్పీటీసీ, ఇద్దరు ఎంపీటీసీలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన గురువారం హోంమంత్రి సొంత నియోజకవర్గంలోని చోటు చేసుకుంది. పెదనందిపాడు ఎంపీపీ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. మండలంలోని పుసులూరు ఎంపీటీసీగా గెలిచిన చెల్లి లక్ష్మి ఎంపీపీ పదవి ఇస్తామని సుచరిత గతంలోనే హామీ ఇచ్చారు. కానీ తీరా ఇప్పుడు ఆమెను కాదని వేరే వారికి పదవిని ఇవ్వడంపై లక్ష్మితో పాటు అన్నపర్రు నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన కల్లూరి నాగేశ్వరరావు, ఆయనభార్య పెదనందిపాడు మండల జడ్పీటీసీ అన్నపూర్ణ తీవ్ర అసంతృప్తి చెందారు. దీంతో రాజీనామాకు సిద్ధమై గురువారం రాత్రి అనపర్రు కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.
కార్యకర్తలతో చర్చించి శుక్రవారం ఉదయాన్నే రాజీనామాలు సమర్పిస్తామని వారు చెబుతున్నారు. వార్డు మెంబరుగా కూడా గెలవని వారి మాటలకు ప్రాధాన్యమిస్తూ పార్టీ కోసం పనిచేస్తూ విజయాలు చేకూర్చేవారికి తీరని అన్యాయం చేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన లక్ష్మి కార్యకర్తల సమావేశంలో అస్వస్తతతో కుప్పకూలారు.