కాషాయీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యం కావాలి

ABN , First Publish Date - 2021-03-03T04:47:06+05:30 IST

కాషాయీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యం కావాలి

కాషాయీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యం కావాలి
మహబూబాబాద్‌లో మాట్లాడుతున్న మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి

మాదిగలకు 12 శాతం రిజర్వేషన్‌ను ప్రకటించాలి  

మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి

మహబూబాబాద్‌ రూరల్‌, మార్చి 2 : దేశంలో కాషాయికరణకు వ్యతిరేకంగా వెనుబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌ 25 సంవత్సరాల నుంచి మాదిగలకు చేస్తున్న మోసాలను ఎండగడుతూ 12 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌తో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగల జాగృతి రధయాత్రకు మంగళవారం మానుకోటకు చేరుకుంది. స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ బీజేపీ నాయకులు  ప్రజలను వర్గాలుగా విభజిస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. గుడి కట్టిస్తే బిచ్చగాళ్లు తయారవుతారని, బడి కట్టిస్తే ఆర్‌ఎస్‌ ప్రవీన్‌కుమార్‌ లాంటి మేధావులు తయారవుతారని చెప్పారు. 100 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని విమర్శించారు. మాదిగలు చెప్పులు కుట్టడం, మేకులు వేయడమే కాదు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసి కేంద్రంలో గద్దె దించుతామని స్పష్టం చేశారు. 

 12 శాతం రిజర్వేషన్‌ను ప్రకటించాలి 

తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 20 శాతం అందులో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్‌ ప్రకటించాలని మాదిగ జేఏసీ పిడమర్తి రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా బీసీలకు 50, ఎస్టీలకు 12, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏడు శాతం రిజర్వేషన్‌తో మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌ను మాదిగ, మాల, ఉపకులాల కార్పొరేషన్లుగా విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరనున్నట్లు చెప్పారు. యూనిట్‌కు రూ.25లక్షల కేటాయించడంతో పాటు దళితుల మూడెకరాల భూమి కోసం ఒక్కొక్కరికి రూ.30 లక్షల కేటాయించి ఎంత భూమి వస్తే అంత భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి రోజు నుంచి బ్లూషర్ట్‌ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని, మహానీయుల జయంతి, వర్ధంతుల రోజున బ్లూషర్ట్‌లు ధరించి రావాలని కోరారు. ఈనెల 3న భువనగరిలో రథయాత్ర ముగింపు సభ నిర్వహిస్తామని, మాదిగలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కొత్తపల్లి వెంకటస్వామి, కత్తుల ఎలెంధర్‌, నర్సింగరావు, దర్శనం రామకృష్ణ, మంగలంపల్లి రాజ్‌కుమార్‌, దేవేందర్‌, సంతోష్‌, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-03-03T04:47:06+05:30 IST