నిర్లక్ష్యం తోడై.. ఆసరా కరువై..!

ABN , First Publish Date - 2021-07-22T05:22:23+05:30 IST

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యసేవలు పొంది ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న బాధితుల కోసం నెలకు కొంత మొత్తాన్ని చెల్లించేందుకు వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.

నిర్లక్ష్యం తోడై..  ఆసరా కరువై..!
జీజీహెచ్‌ ప్రసూతి ఆసుపత్రిలో బాలింతలు

ప్రభుత్వ పథకాన్నే అటకెక్కించారు!

కంప్యూటర్‌ ఆపరేటర్‌ లేరంటున్న వైద్యశాఖ

19 నెలలుగా అమలుకాని ‘ఆరోగ్య ఆసరా’

పేద బాలింతలకు చేరని ప్రోత్సాహకం

19వేల మందికి అందని రూ.9.50 కోట్లు 

కో ఆర్డినేటర్‌ చొరవతో వెలుగులోకి..

ఆరోగ్యశ్రీ మిత్రలకు బాధ్యతల అప్పగింత 


పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల అమలులో అధికారులే కీలకం. ప్రజల్లో అవగాహన కల్పించి, లబ్ధిదారుల ఎంపిక మొదలు పథకం ఫలాలు వారి దరి చేరే వరకు ప్రభుత్వ యంత్రాంగమే అన్నింటా తామే వ్యవహరిస్తుంది. అయితే, బాలింతల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకం విషయంలో మాత్రం అలా జరగలేదు. కేవలం డెటా ఎంట్రీ ఆపరేటర్‌ లేడన్న సాకుతూ 19 నెలలుగా పథకాన్ని అటకెక్కించారు. దీనివల్ల ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో ప్రసవించిన  19వేల మంది బాలింతలకు ఆ పథకం చేరువకాలేదు. ఇటీవల ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌ రికార్డులను పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. 


నెల్లూరు (వైద్యం), జూలై 21 : ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యసేవలు పొంది ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న బాధితుల కోసం నెలకు కొంత మొత్తాన్ని చెల్లించేందుకు వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 2019, డిసెంబరు 1వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ పథక్నాన ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. గర్భవతుల వివరాలు ముందుగా ఆసుపత్రి నిర్వాహకులు నమోదు చేసుకోవాలి. ప్రసవం అయిన వెంటనే ఆరోగ్య ఆసరా పథకం కింద బాలింతల బ్యాంక్‌ ఖాతాలో రూ.5వేలు జమ చేయాలి. ఇంటికి వెళ్లి ఆరోగ్య సేవలు పొందుతున్న క్రమంలో మందులు ఇతర ఖర్చులకు ఈ మొత్తాన్ని అందచేస్తారు. కేవలం గర్భవతులకే కాకుండా వైద్యులు, సిబ్బందిని ప్రోత్సహించేలా మరో రూ.3వేలు అందచేయనున్నారు. 


వేల మందికిపైగా అందని ఫలాలు

ప్రతి ఏడాది ప్రభుత్వం ఆసుపత్రులలో 13వేలకు పైగా ప్రసావాలు జరుగుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభమై 19 నెలలకుపైగా అయింది. ఈ క్రమంలో 19 వేల మందికిపైగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేయించుకున్నారు. ఒక్కొక్కరికి రూ.5వేలు  చొప్పున సుమారు రూ.9.50 కోట్లు బాధితులకు  చెల్లించాల్సి ఉంది. అయితే, నిబంధనల ప్రకారం ప్రసవం జరిగినప్పుడే ఆరోగ్య ఆసరా మొత్తాన్ని చెల్లించాలి. వైద్యాధికారుల తీరువల్ల వేలమంది నిరుపేద గర్భవతులు పథకం ప్రయోజనాన్ని పొందలేకపోయారు. జిల్లావ్యాప్తంగా జీజీహెచ్‌ ప్రసూతి ఆసుపత్రితోపాటు ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి, కావలి, గూడూరు ఏరియా ఆసుపత్రులతోపాటు 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 27 ప్రత్యేక ప్రసూతి ఆసుపత్రులు ఉన్నాయి. ఇంతపెద్ద నెట్‌వర్క్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా ప్రభుత్వ పథకం అమలులో మాత్రం నిర్లక్షమే తాండవిస్తోంది. ఆరోగ్య ఆసరాపై అవగాహన లేక వైద్యాధికారులు పథకాన్ని పక్కన పెట్టేశారని అనుకున్నా ఏడాదిన్నరపైగా పథకం అమలు చేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతన్నాయి.


ఆరోగ్యమిత్రలకు బాధ్యతలు

ప్రసూతి ఆసుపత్రులలో ఆరోగ్య ఆసరా పథకం అమలులో డేటా ఎంట్రీ ఉద్యోగి లేరని అధికారులు కుంటి సాకులు చెబుతుండటంతో ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌  చంద్రశేఖర్‌ ఆ బాధ్యతలను ఆరోగ్య మిత్రలకు అప్పగించారు.  ఇదిలా ఉంటే గర్భవతులకు ఆరోగ్య ఆసరా పథకం ఉందన్న విషయంపై ప్రజలలో ఏడాదిన్నరపైగా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు. ఇప్పటి కైనా ఈ పథకంపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం

గర్భవతులకు ఆరోగ్య ఆసరా పథకం ప్రభుత్వ ఆసుపత్రులలో అమలు కావడం లేదు. డేటా నమోదుకు ఉద్యోగులు లేరని చెబుతున్నారు. అందుకే వైద్యులు, సిబ్బందికి ఆరోగ్య ఆసరాపై ఇటీవల శిక్షణ ఇచ్చాం. గర్భవతుల డేటా ఎంట్రీ బాధ్యతలు ఆరోగ్య మిత్రలకు అప్పగించాం. ఇలాంటి ప్రత్యేక చర్యలు ద్వారా ఆరోగ్య ఆసరా పథకం గర్భవతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.

- డాక్టర్‌ చంద్రశేఖర్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌



Updated Date - 2021-07-22T05:22:23+05:30 IST