ప్రజలకు ఉపాధి కల్పన కోసమే పెరల్‌ డిస్టిలరీ

ABN , First Publish Date - 2022-08-20T06:03:09+05:30 IST

వెనుకబడిన జిల్లాలోని ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెరల్‌ డిస్టిలరీని స్థాపించామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పాతసింగరాయకొండ పంచాయతీ సమీపంలోని పెరల్‌ డిస్టిలరీని ప్రారంభించి 25 ఏళ్లు అయిన సందర్భంగా శుక్రవారం అక్కడ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్ని మాగుంట మాట్లాడుతూ 1991లో మాగుంట సుబ్బరామిరెడ్డి ఎంపీగా గెలుపొందిన తరువాత పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.

ప్రజలకు ఉపాధి కల్పన కోసమే పెరల్‌ డిస్టిలరీ
ఫ్యాక్టరీ సిల్వర్‌ జూబ్లీ శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న మాగుంట

ఫ్యాక్టరీ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ఎంపీ మాగుంట

సింగరాయకొండ, ఆగస్టు 19 : వెనుకబడిన జిల్లాలోని ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెరల్‌ డిస్టిలరీని స్థాపించామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పాతసింగరాయకొండ పంచాయతీ సమీపంలోని పెరల్‌ డిస్టిలరీని ప్రారంభించి 25 ఏళ్లు అయిన సందర్భంగా శుక్రవారం అక్కడ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్ని మాగుంట మాట్లాడుతూ 1991లో మాగుంట సుబ్బరామిరెడ్డి ఎంపీగా గెలుపొందిన తరువాత పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. 1992లో దాదాపు 200 ఎకరాల్లో డిస్టిలరీ నిర్మాణాన్ని ప్రారంభించారని తెలిపారు.  ప్రత్యక్షంగా, పరోక్షంగా 3000 మందికి ఉపాధి కల్పించడమే ఈ ఫ్యాక్టరీ ముఖ్యఉద్దేశమన్నారు. సుబ్బరామిరెడ్డి అకాల మరణానంతరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి 1997 ఆగస్టు 14న ఫ్యాక్టరీని ప్రారంభించామని చెప్పారు. డిస్టిలరీ వ్యాపారమనేది ఆటుపోట్లతో కూడుకున్నదన్న మాగుంట.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి వ్యాపారంలో పెనుమార్పులు సంభవిస్తూ ఉంటాయన్నారు. ప్రస్తుతం వ్యాపారంలో వచ్చిన ఆటుపోట్ల వలన ఫ్యాక్టరీ సామర్థ్యం తగ్గిందన్నారు.  రాబోయే రోజుల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని చెప్పారు. అనంతరం 25 ఏళ్లు ఫ్యాక్టరీలో పనిచేసిన ఉద్యోగులకు జ్ఞాపికలు, ప్రశంశా పత్రాలను అందజేశారు. అంతకుముందు ఫ్యాక్టరీ సిల్వర్‌ జూబ్లీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.శివకుమార్‌రెడ్డి, డైరెక్టర్లు గౌతమ్‌రెడ్డి, ఎం.విజయ్‌బాబు, ఎస్‌వీ సుధాకర్‌రెడ్డి, ఎస్‌.రామచంద్రరావు వై.శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌, శివకుమార్‌రెడ్డి, సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-20T06:03:09+05:30 IST