ప్రశాంతంగా ఎస్‌ఐ ప్రిలిమ్స్‌

ABN , First Publish Date - 2022-08-08T06:23:13+05:30 IST

పోలీసు శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష కరీంనగర్‌లో ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా ఎస్‌ఐ ప్రిలిమ్స్‌
ప్రిలిమినరి రాత పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీపీ వి సత్యనారాయణ

 - 11,854 మంది అభ్యర్థులకుగాను 662 గైర్హాజరు

- ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులకు అనుమతి నిరాకరణ

- పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీపీ వి సత్యనారాయణ

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 7: పోలీసు శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష కరీంనగర్‌లో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు రాత పరీక్ష కొనసాగింది. జిల్లాలో మొత్తం ఆరు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమై బందోబస్తు చేశారు. పలువురు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో లోపలికి అనుమతించ లేదు. ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రాల వద్ద గేట్‌లు మూసివేసి లోపలికి ఎవరినీ అనుమతించలేదు. దీంతో ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న పలువురు అభ్యర్థులు సెంటర్‌ల వద్ద ఉన్న పోలీసు అధికారులను ఎంత రిక్వెస్ట్‌ చేసినప్పటికీ అనుమతించకపోవటంతో కంటతడి పెట్టి వెనుదిరిగారు. మొత్తం 11,854 మంది అభ్యర్థులకుగాను 11,192 మంది పరీక్షకు హాజరవగా, 662 మంది గైర్హాజరయ్యారు. ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించి 200 మీటర్ల దూరం వరకు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకున్నారు. బయోమెట్రిక్‌ విధానంతో అభ్యర్థుల హాజరును తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలను పోలీస్‌ కమిషనర్‌ వి స్యతనారాయణ, అడిషనల్‌ డీసీపీలు ఎస్‌ శ్రీనివాస్‌, జి చంద్రమోహన్‌ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును ఏసీపీలు తుల శ్రీనివాసరావు, టికరుణాకర్‌రావు, జి విజయ్‌కుమార్‌ పర్యవేక్షించారు. 

- హాల్‌టికెట్‌కు బదులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కార్డుతో పరీక్షకు....

కరీంనగర్‌లోని శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగిన ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షకు మానకొండూర్‌ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన అభ్యర్థి తాళ్లపెల్లి రమేష్‌ ఉదయం 9:30 గంటలకే పరీక్ష కేంద్రంలోకి చేరుకున్నాడు. అతను పరీక్ష హాల్‌టికెట్‌కు బదులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కార్డును వెంట తీసుకువచ్చాడు. ఈ విషయం పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు చెప్పగా ఇది చెల్లుబాటు కాదని పరీక్ష కేంద్రంలో నుంచి రమేష్‌ను బయటకు పంపించారు. వెంటనే తన సోదరుడి ద్వారా హాల్‌టికెట్‌ తీసుకుని 10:30 గంటలకు మళ్లీ పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోగా అధికారులు అప్పటికే గేట్‌ మూసివేయటంతో లోపలికి అనుమతించలేదు. నాలుగు నెలల నుంచి తాను పరీక్షకు ప్రిపేర్‌ అయ్యానని, ఇప్పుడు తన తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడని, ఆ హడావుడిలో హాల్‌టికెట్‌ మరిచిపోయానని వాపోయాడు.

- సిద్ధిపేట జిల్లా కేశవాపూర్‌కు చెందిన  ప్రశాంత్‌ శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాల కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. అతను 9 గంటకే తిమ్మాపూర్‌లోని శ్రీచైతన్య ఇంజనీరింగ్‌ కళశాలకు చేరుకుని అక్కడే తన పరీక్ష కేంద్రంగా భావించాడు. వాస్తవానికి అతనికి కరీంనగర్‌లోని శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాలలో కేటాయించారు. హాల్‌ టికెట్‌లో కూడా స్పష్టంగా ఉంది. హాడావుడిలో అది గమనించకపోవటంతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఆరు నెలలుగా కోచింగ్‌ తీసుకుంటూ ఎస్‌ఐ ఉద్యోగానికి సన్నద్ధమై ఈ రోజే స్వగ్రామం నుంచి కారులో వచ్చానని... ఇలా జరిగిందని బోరున విలపించాడు. ఆలస్యానికి కారణాన్ని పోలీసు అధికారులకు వివరించినప్పటికీ వారు అనుమతించలేదు. 10 గంటల వరకు అనుమతి ఉందని, తాము నిబంధనల మేరకే నడుచుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-08-08T06:23:13+05:30 IST