శాంతి దౌత్యం

ABN , First Publish Date - 2022-09-20T06:43:07+05:30 IST

సర్వసాధారణంగా కాస్తంత చప్పగా గడిచిన గతంతో పోల్చితే, ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో ఇటీవల ముగిసిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి అంతర్జాతీయంగా...

శాంతి దౌత్యం

సర్వసాధారణంగా కాస్తంత చప్పగా గడిచిన గతంతో పోల్చితే, ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో ఇటీవల ముగిసిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి అంతర్జాతీయంగా ఎక్కువ ప్రాధాన్యమే వచ్చింది. ప్రాంతీయస్థాయిలో అవగాహనలు, ఎనిమిదిమంది దేశాధినేతల చర్చలు, ఇరాన్ నూ చేర్చుకోవాలన్న నిర్ణయం, వాణిజ్యం, పర్యావరణం, ఉగ్రవాదం ఇత్యాది విషయాల్లో సహకారం వంటి సంకల్పాలను అటుంచితే, నాయకత్వ బాధ్యతలు భారతదేశం చేతిలోకి రాబోతూండటం, దీనికి చైనా మనస్పూర్తిగా మద్దతు ప్రకటించడం విశేషమైన పరిణామం. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆరంభించిన తరువాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్న ఒక పెద్ద సమావేశం ఇది. ఈ విషయంలో రష్యా పక్షాన నిలుస్తూ, మరోపక్క తైవాన్ ఉద్రిక్తతలతో ప్రపంచం దృష్టినాకర్షించిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా పుతిన్‌ను ప్రత్యక్షంగా కలుసుకున్నది ఇప్పుడే. ఈ నేపథ్యంలోనే, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలకు అమిత ప్రాధాన్యం లభించాయి. ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అన్న మోదీ వ్యాఖ్యను భారత్ తొలిసారిగా చేసిన ఓ అతిపెద్ద బహిరంగ విమర్శగా, పుతిన్‌కు ఎదురుదెబ్బగా పాశ్చాత్యమీడియా విశ్లేషిస్తూ మోదీని అమితంగా ప్రశంసిస్తున్నది.


మోదీ వ్యాఖ్యలు, పుతిన్ ప్రతిస్పందన చూసినప్పుడు, ఒక అంతర్జాతీయ వేదికమీద పుతిన్‌ను తప్పుబట్టే ఉద్దేశం భారత్‌కు లేదని స్పష్టంగానే తెలుస్తున్నది. ఇది యుద్ధాల యుగం కాదనీ, చర్చలు, దౌత్యప్రక్రియలు, ప్రజాస్వామిక విధానాలే ప్రపంచానికి ఇప్పుడు అవసరమన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు మీకు టెలిఫోన్ సంభాషణలో తెలియచేశానని మోదీ చక్కగా, సౌమ్యంగా గుర్తుచేశారు. ఇందుకు ప్రతిగా పుతిన్ వ్యాఖ్యలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తరచుగా ఆందోళన వెలిబుచ్చుతున్నమాట నిజమేననీ, యుద్ధాన్ని త్వరితంగా విరమించుకునేందుకు శాయశక్తులా కృషిచేస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. ఒక అంతర్జాతీయ సదస్సు సందర్భంగా జరిగిన భేటీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం, ఆ మాటలకు విలువ ఇస్తూ పుతిన్ సానుకూలంగా స్పందించడం సంతోషించాల్సిన పరిణామం. తొమ్మిదినెలలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నప్పటికీ, చర్చలతో కాక, యుద్ధరంగంలోనే తేల్చుకుంటానని ఉక్రెయిన్ కాలుదువ్వుతోందని పుతిన్ ఆరోపించారు. దీనికితోడు, యుద్ధం విషయంలో చైనా కూడా రష్యాతో ఏకీభవించడంలేదని వ్యాఖ్యానించి, చైనా కూడా గుర్రుగానే ఉన్నదని ఆయనే ప్రపంచానికి తెలియచెప్పారు. ఏతావాతా ఉక్రెయిన్ యుద్ధంలో పీకలోతు ఇరుక్కుపోయి, కాలు వెనక్కుతీసుకోలేని స్థితిలో ఉన్న పుతిన్ చైనా, భారత్‌ల వైఖరికి సానుకూలంగా ప్రతిస్పందించడం ద్వారా ఆ ఊబిలోంచి బయటపడేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.


తొమ్మిదినెలలుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వైఖరి నిజానికి కొత్తదేమీ కాదు. పుతిన్ అన్నట్టుగానే పలుమార్లు భారత్ ఇదే విషయాన్ని చెప్పింది. ఇప్పుడు జరిగింది పునరుద్ధాటనే. ఇంకా చెప్పాలంటే, అంతకుముందు ఒకటిరెండు సందర్భాల్లో గైర్హాజరైన భారతదేశం, ఆ తరువాత భద్రతామండలిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు చేసింది, బుచా ఊచకోతను తీవ్రంగా తప్పుబట్టింది కూడా. కానీ, చైనా ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వచ్చినందున, చైనా అధ్యక్షుడు కూడా తనతో ముందురోజు జరిపిన భేటీలో యుద్ధాన్ని వ్యతిరేకించారన్నట్టుగా పుతిన్ చేసిన ప్రకటనలోనే ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం ఉన్నది. నిజానికి రష్యా ఇప్పుడు యుద్ధరంగంలో తీవ్రంగా దెబ్బతింటూ, ఆదిలో చేజిక్కించుకున్న నగరాలను వరుసగా వదులుకుంటున్న స్థితిలో దాని ఆప్తమిత్రదేశం ఇలా వ్యవహరించడం విశేషమే. ఉభయదేశాల హితవునూ, పుతిన్ స్పందననూ కూడా భూతద్దంలో పెట్టి చూడనక్కరలేదని అంటున్నవారు కూడా లేకపోలేదు. కానీ, ఈ సదస్సు ఆరంభానికి ముందే, భారత్ చైనా సహకారంతో పుతిన్ యుద్ధకష్టాల్లోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. యుద్ధరంగంలో చావుదెబ్బలు తింటూ, గత పాపాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న స్థితిలో, భారత్ చైనాల వైఖరి శాంతిదిశగా అడుగులు పడేందుకు ఓ అవకాశాన్నయితే అందిస్తున్నాయి.

Updated Date - 2022-09-20T06:43:07+05:30 IST