దోపిడీకి ‘పీడీ’!

ABN , First Publish Date - 2022-04-03T08:31:45+05:30 IST

గత ఏడాది డిసెంబరులో పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను రాష్ట్రం గుట్టుచప్పుడు కాకుండా లాగేసుకుంది.

దోపిడీకి ‘పీడీ’!

  • అధికారికంగా సర్కారు అరాచకం
  • సంస్థలు, పంచాయతీలపై పిడికిలి
  • వాటి నిధులన్నీ పీడీ ఖాతాలో జమ
  • అవన్నీ ఆర్థిక శాఖ నియంత్రణలోనే
  • తలచుకోగానే పీడీ ఖాతాలన్నీ ఖాళీ
  • పల్లె నిధులను పీల్చేసింది ఇలాగే
  • రెండు లక్షలకుపైగా పీడీ ఖాతాలు
  • నిత్యం సర్కారు అంకెల గారడీ


(అమరావతి - ఆంధ్రజ్యోతి): గత ఏడాది డిసెంబరులో పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను రాష్ట్రం గుట్టుచప్పుడు కాకుండా లాగేసుకుంది. మొన్నటికి మొన్న... పంచాయతీలు పన్నుల రూపంలో వసూలు చేసుకున్న నిధులను (జనరల్‌ ఫండ్స్‌) కూడా లాగేసుకుంది. దీంతో... పంచాయతీల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఎలా లాగేసుకోగలదు? అనే చర్చ సర్వత్రా మొదలైంది. నిజానికి... పంచాయతీల సొమ్ము రాష్ట్రం తీసుకోవడానికి అవకాశమే లేదు. జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత.. ‘పర్సనల్‌ డిపాజిట్‌’ (పీడీ) ఖాతాల రూపంలో అలాంటి వెసులుబాటు కల్పించుకుంది. పీడీ ఖాతాలన్నీ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నియంత్రణలోనే ఉంటాయి. ఆయన అనుకుంటే చాలు... ఖాతాల్లోని సొమ్ములన్నీ ఖాళీ చేసేస్తారు. అదీ అసలు విషయం. గత డిసెంబరులో కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను ఇలాగే లాగేసుకున్నారు. మార్చి 31వ తేదీన మరోసారి పల్లెల ఖాతాలను ఖాళీ చేశారు. గ్రామ సర్పంచులు, పంచాయతీల  కార్యదర్శులకు కూడా తెలియకుండానే మొత్తం నిధులను, పైసాలేకుండా పీల్చేస్తున్నారు. అత్యవసరమైన పనులకోసం అప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిధులు అడగకుండా... అధికారులు ‘పీడీ’ ఖాతాల్లో కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసుకుంటారు. 


అవసరమైనప్పుడు ఆ నిధులను వాడుకుంటారు. కానీ... జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత ఈ పీడీ ఖాతాలను కూడా ఆర్థిక అక్రమాలకు ఉపయోగించుకోవడం మొదలైంది. ఏకంగా రెండులక్షలకుపైగా పీడీ ఖాతాలను సృష్టించింది. కేంద్ర పథకాల నిధులు, కార్పొరేషన్ల గ్రాంట్లు, కేంద్రం నుంచి వివిధ బోర్డులకు వచ్చే నిధులు, ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పంచాయతీలు, జిల్లా పరిషత్‌ల వంటి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను స్వాహా చేయడానికే ఈ వ్యూహం రచించింది. ఈ విషయంలో మొత్తం ఆర్థికశాఖ అధికారులే చక్రం తిప్పుతారు. ఇతర శాఖల అధికారులు ఆటలో అరటిపళ్లు మాత్రమే. పేరుకు నిధులన్నీ తమ శాఖవే అయినా, తమ శాఖ పీడీ ఖాతాలోనే ఉన్నా ఆయా శాఖలు పైసా కూడా ఖర్చు చేయలేవు. మూడేళ్లుగా రాష్ట్రంలో ఇదే తంత్రం నడుస్తోంది. తాజాగా గ్రామ పంచాయతీల పీడీ ఖాతాల్లో నిధులను మాయం చేయడం కూడా ఇలాగే జరుగుతోంది. ఆ తర్వాత పంచాయతీలు బతిమాలితేనో, బెదిరిస్తేనో, రాష్ట్రస్థాయిలో ఉద్యమాలు చేస్తేనో ప్రభుత్వం కొంత మేరకు నిధులు తిరిగి ఇస్తుంది. లేకుంటే అంతే సంగతులు!


ఉన్నది లేనట్లు... లేనిది ఉన్నట్లు

ఇతర శాఖల నిధులను స్వాహా చేసేందుకేకాదు... ఆర్థిక అవకతవకలకు కూడా పీడీఖాతాలను యథేచ్ఛగా వాడుకుంటున్నారు. బ్యాంకు ఖాతాల్లో అయితే ఈ మాయాజాలం కుదరదు. అందుకే, పీడీ ఖాతాలతో గోల్‌మాల్‌ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం... బడ్జెట్‌ ప్రకారం ఏ శాఖ నిధులను ఆ శాఖ ఖాతాల్లో వేయడం ఆర్థికశాఖ విధి. కానీ, ఇప్పుడు అన్ని శాఖల నిధులను పీడీ ఖాతాల పేరుతో గుప్పిట్లో పెట్టుకుంది. దీనికోసం పీడీ ఖాతాలను ఎడాపెడా సృష్టించారు. బడ్జెట్‌ హెడ్ల నుంచి రూవేల కోట్లను ఈ ఖాతాలకు మళ్లిస్తున్నారు. నిజంగా ఆ డబ్బులు బడ్జెట్‌ హెడ్‌ నుంచి ఆయా శాఖల పీడీ ఖాతాలకు వెళ్తున్నాయా అంటే ఒక్క పైసా కూడా పోదు. కంప్యూటర్‌ స్ర్కీన్‌పై మాత్రమే బడ్జెట్‌ హెడ్‌ నుంచి పీడీ ఖాతాలకు వెళ్లినట్టు అంకెలు కనిపిస్తాయి. ఆర్థిక శాఖ అవసరాన్ని బట్టి మాయమవుతూ, మళ్లీ ప్రత్యక్షమవుతూ ఉంటాయి. మార్చి 31 వచ్చేసరికి... మొత్తం పీడీ ఖాతాలను ఖాళీ చేస్తారు. ఎందుకంటే... ఆర్థిక సంవత్సరాంతానికి పీడీ ఖాతాల్లో బ్యాలెన్స్‌ సున్నా ఉండాలి. లేదంటే ఈ మొత్తం రాష్ట్ర అప్పుగా భావించాల్సి ఉంటుంది. ఈ అప్పును కప్పిపుచ్చుకునేందుకే పీడీ ఖాతాల్లో ఎన్ని నిధులున్నా సున్నాగా మార్చి ఆ లెక్కలనే ఏజీ కార్యాలయానికి పంపుతారు. నిజానికి... పీడీ ఖాతాల్లో సున్నా బ్యాలెన్స్‌ ఉంటే నిధులన్నీ ఖర్చయ్యాయని, బిల్లుల చెల్లింపు జరిగిందని అర్థం. ఇక్కడ ఖాతాలు ఖాళీ చేయడమే తప్ప... బిల్లులు చెల్లించరు. ఆ మొత్తాన్ని ఖర్చు కూడా చేయరు. 


ఇలా చెప్పి మోసం చేశారు

ప్రభుత్వం బయటనుంచి అప్పు తెచ్చుకుంటే 7నుంచి 8శాతం వడ్డీ పడుతుంది. ఆయా కార్పొరేషన్లు, స్కీముల డబ్బులు ఖాతాల్లో ఉన్నప్పటికీ వాటిని ఒక్కసారిగా వాడుకోవు. అలా వాడకుండా ఉన్న డబ్బును ప్రభుత్వం తన అవసరానికి ఉపయోగించుకుంటే... అధిక వడ్డీ తప్పించుకోవచ్చని, నిధులు సద్వినియోగమవుతాయని భావించారు. ఆ డబ్బును ఖజానాకు అనుసంధానంగా ఉండే పీడీ ఖాతాల్లో జమచేస్తే, అవసరమైనప్పుడు బిల్లు పెట్టుకోగానే తిరిగి ఇచ్చే వ్యవస్థను రూపొందించారు. గత ప్రభుత్వంలో ఈ విధానం పక్కాగా అమలుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌ హెడ్లను పక్కనపడేసి కేవలం పీడీ ఖాతాల ద్వారానే లావాదేవీలు నడుపుతున్నారు. 2లక్షలుపైగా ఉన్న పీడీ ఖాతాల్లో ఏ లావాదేవీలు జరుగుతున్నాయో ఆర్థికశాఖలోని ఇద్దరు సెక్రటరీలకు తప్ప ఎవరికీ తెలియదు. ఇతర శాఖల నిధులు వాడుకోవడమే తప్ప ప్రభుత్వం వెనక్కి తిరిగివ్వడంలేదు. ఆయా శాఖలకు పని చేసిపెట్టిన వారు బిల్లుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుండగా, డబ్బులివ్వలేక ఆర్థికశాఖ అధికారులు, సీఎస్‌, ఇతర శాఖల అధికారులు కోర్టుకు సంజాయిషీలు చెప్తూ, కోర్టుతో శిక్షలు వేయించుకుంటున్నారు. కాగా, దీనికి తెర దించాలంటే... పంచాయతీల పేరిటే బ్యాంకు ఖాతాలు తెరవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-04-03T08:31:45+05:30 IST