నేరస్థులపై పీడీ అస్త్రం

ABN , First Publish Date - 2022-04-15T05:30:00+05:30 IST

తరచూ వివిధ నేరాలు చేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. సాధారణ చట్టాలతో మార్పురాని వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నారు.

నేరస్థులపై పీడీ అస్త్రం

- జిల్లాలో నేర చరిత్ర గల వారిపై పీడీ యాక్ట్‌ అమలు

- తరచూ నేరాలకు పాల్పడే వారిపై కొరడా

- నేరాల అదుపునకు జిల్లా పోలీసుల ప్రయోగం

- తాజాగా గన్‌తో బెదిరింపులకు పాల్పడిన ఓ రౌడీషీటర్‌పై పీడీయాక్ట్‌ నమోదు

- జిల్లాలో ఇప్పటి వరకు 37 మందిపై పీడీ యాక్ట్‌ కేసులు

- ఈ కేసు నమోదైతే  ఏడాది పాటు జైలులో ఉండాల్సిందే..


కామారెడ్డి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): తరచూ వివిధ నేరాలు చేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. సాధారణ చట్టాలతో మార్పురాని వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నారు. ఈ యాక్ట్‌ జిల్లాలో ఇటీవల అధికంగానే నమోదవుతున్నాయి. తాజాగా ఎలాంటి అనుమతి లేకుండా గన్‌ను వాడడమే కాకుండా ఓ దాబా వద్ద బెదిరింపులకు పాల్పడిన కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్‌ పెట్టి చంచల్‌గూడ జైలుకు పంపారు. గత కొద్దినెలల కిందట గంజాయి పండిస్తున్నారని మరో ఇద్దరిని, దొంగతనాలకు పాల్పడుతున్నారని మరికొందరిపై పీడీయాక్ట్‌ ప్రయోగించి జైలుకు పంపారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 37 మందిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదయ్యాయంటే తరచూ నేరాలకు పాల్పడే వారిపై పోలీసుశాఖ ఏ స్థాయిలో సీరియస్‌గా తీసుకుంటుందో అర్థమవుతోంది. అయినప్పటికీ నేరాలకు పాల్పడేవారు తమ తీరును మార్చుకోవడం లేదు. జైలుకు వెళ్లడం మళ్లీ అదే నేరాలకు పాల్పడుతూ వస్తున్నారు.

జిల్లాలో 37 మందిపై పీడీయాక్ట్‌ కేసుల నమోదు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో తరచూ నేరాలకు పాల్పడే వారిపై పోలీసుశాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. పీడీ యాక్ట్‌ లాంటి కేసులు నమోదు చేస్తూ నేరస్థులు బయటకు రాకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు తరచూ నేరాలకు పాల్పడుతున్న 37 మందిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేసినట్లు జిల్లా పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాల్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జంటహత్యలకు ప్రధాన నిందితుడైన వ్యక్తిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అదేవిధంగా గతంలో తరచూ ఏటీఎంలలో, బ్యాంకుల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిపై జిల్లా పోలీసుశాఖ పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసింది. గత 5 సంవత్సరాల కిందట పిట్లంకు చెందిన ఓ ఇసుక మాఫియాపై ఉమ్మడి జిల్లా పోలీసులు పీడీ అస్త్రాన్ని ప్రయోగించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని, గాంధారిలోని మరో నలుగురు గంజాయి స్మగ్లర్లపై అప్పటి పోలీసుశాఖ పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపింది. గతంలో ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడిన ముత్యంపేటకు చెందిన ఆటో డ్రైవర్‌పై పీడీ ప్రయోగించి జైలుకు పంపారు. తాజాగా కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ రౌడీషీటర్‌ గత జనవరిలో పొందుర్తి దాబా వద్ద ఇద్దరు వ్యక్తులతో గొడవపడి ఎలాంటి అనుమతి లేని గన్‌ కలిగి ఉండి బెదిరింపులకు పాల్పడ్డాడని, గతంలోనూ అనేక సార్లు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నాడని రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినా మారకపోవడంతో అతనిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇలా జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్లు, మత్తుపదార్థాల రవాణా, భూ కబ్జాలు, అత్యాచారాలు, డెకాయిట్‌, దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై పీడీయాక్ట్‌ కేసులు నమోదు చేశారు. మరికొందరిపైన పీడీయాక్ట్‌ ప్రయోగించే దిశగా పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

పీడీ యాక్టు నమోదైతే ఏడాది పాటు జైలే..

సాధారణ పీడీ (ప్రివెంట్‌ డిటెన్షన్‌) యాక్ట్‌ కింద కేసు నమోదయిన నేరస్థులు కనీసం ఏడాది పాటు జైలు జీవితం గడపాల్సిందే. పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదయితే కోర్టుల నుంచి బెయిల్‌ దొరకడం కష్టం. దీంతో నేరస్థులకు జైలు శిక్ష తప్పదు. న్యాయపరమైన వెసులుబాటు పొందే అవకాశాలు లేకపోవడంతో నేరస్థులు జైలు శిక్ష అనుభావించాల్సి వస్తోంది. గతంలో దేశ రక్షణకు భంగం కలిగించే చర్యలకు, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తారనే కారణాలతో ముందస్తుగా పీడీ యాక్ట్‌ నమోదయ్యేవి. అయితే చిన్నచిన్న నేరస్థులు సైతం పోలీసులు, కోర్టు జరిమానాలు, సాధారణ జైలు శిక్ష, సులువుగా బెయిల్‌ పొందడంతో నేరం చేయడంతో భయం పోతోంది. నేరస్థుల్లో భయం పెరగాలంటే పీడీ యాక్ట్‌ ప్రయోగమే చివరి అస్త్రంగా పోలీసులు భావించి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు పొందాలంటే జిల్లా ఉన్నతాధికారుల ముందస్తు సమాచారంతో వ్యక్తుల నేర చరిత్ర తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన కింది స్థాయి పోలీసు అధికారులు అమలు చేస్తున్నారు.


జిల్లాలో నాలుగేళ్లలో నమోదయిన పీడీ యాక్ట్‌లు

1. గుండాగిరి 14 కేసులు నమోదు

2. డెకాయిట్‌ 11 కేసులు నమోదు

3. డ్రగ్స్‌ (గంజాయి) 8 కేసులు నమోదు

4. వైట్‌కాలర్‌ 2 కేసులు నమోదు

5. అత్యాచారం 2 కేసులు నమోదు


Updated Date - 2022-04-15T05:30:00+05:30 IST